ఎగుమతుల జోరు పెరగాలి..సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి: సీఎస్ సంజయ్ జాజు  

ఎగుమతుల జోరు పెరగాలి..సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి: సీఎస్ సంజయ్ జాజు  

హైదరాబాద్, వెలుగు: తెలంగాణను దేశంలోనే ప్రముఖ ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు వేగవంతం చేయాలని సీఎస్​ సంజయ్ జాజు ఆదేశించారు. అందుకోసం ఎగుమతుల వృద్ధికి అవసరమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తక్షణమే రూపొందించాలని సంబంధిత శాఖల అధికారులకు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీఎస్ అధ్యక్షతన ‘రాష్ట్ర ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ’ సమావేశం  జరిగింది. ఈ సందర్భంగా ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు, మౌలిక వసతుల కల్పన, ఎగుమతులకు అనుకూలమైన నూతన విధానాల అమలుపై చర్చించారు.

గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి రూ.1,22,655 కోట్ల విలువైన ఎగుమతులు నమోదు కావడం విశేషమని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమలు, తయారీ రంగాలు,  వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్, హస్తకళలు, ఐటీ ఆధారిత సేవల ఎగుమతులను భవిష్యత్తులో మరింత విస్తరించడానికి అన్ని శాఖలు సమన్వయంతో అడుగులు వేయాలని  సీఎస్​ సూచించారు. ఎగుమతులకు మరింత ఊతమిచ్చేలా అంతర్జాతీయ స్థాయిలో నూతన మార్కెట్లను అన్వేషించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎగుమతుల వేగాన్ని పెంచేలా ప్రణాళికలు ఉండాలని చెప్పారు.