హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో జెన్-కో, డిస్కంల పాత్ర కీలకమని సీఎస్ సంజయ్ జాజు అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, డిస్కంల నిర్వహణతోపాటు సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, విస్తరణ కార్యకలాపాలపై సోమవారం సచివాలయంలో ఆయా సంస్థల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న అవసరాలకు అనుగుణంగా గ్రిడ్ నిర్వహణ, విద్యుత్ లభ్యతను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
నానాటికీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను సమర్థవంతంగా తట్టుకునేలా ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు సరఫరాలో అంతరాయం కలుగకుండా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. రాష్ట్ర ఇంధన అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సింగరేణి కాలరీస్ సంస్థ ప్రస్తుత బొగ్గు ఉత్పత్తి, భవిష్యత్ విస్తరణ ప్రాజెక్టుల పురోగతి, రవాణా ఏర్పాట్లపై లోతుగా చర్చించారు. సింగరేణి పరిధిలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సమయానికి చేరుకోవాలని, కొత్త గనుల విస్తరణ పనులు వేగవంతం చేయాలని సింగరేణి సీఎండీకి సూచించారు.
