నకిలీ నోట్లకు చెక్.. ఒకే నోటు.. ఒకే ఇంకు.. రెండు రంగులు

నకిలీ నోట్లకు చెక్.. ఒకే నోటు.. ఒకే ఇంకు.. రెండు రంగులు
  • కరెన్సీకి కొత్త సెక్యూరిటీ ఫీచర్​ను తయారు చేసిన సీఎస్​ఐఆర్​
  • డ్యుయల్​ ఎమిసివ్​ ల్యుమినిసెంట్​ పిగ్మెంట్​ను తయారు చేసిన సైంటిస్టులు
  • అన్ని వాతావరణాలను తట్టుకుని స్థిరంగా ఉన్న ఇంక్​.. 6 నెలలు టెస్ట్​
  • లీగల్​ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు, ఫార్మా కంపెనీలకూ ఉపయోగం

ఎన్ని కొత్త సెక్యూరిటీ ఫీచర్లు తెచ్చినా కేటుగాళ్లు దొంగ నోట్లను తయారు చేస్తూనే ఉన్నారు. మార్కెట్లో మామూలు నోట్లతో కలిపి చలామణీలోకి తెస్తున్నారు. మూడేళ్ల క్రితం ప్రభుత్వం నోట్లు రద్దు చేసి, కొత్త నోట్లు తీసుకొచ్చినా వాటినీ వదల్లేదు. మరి, ఈ సమస్యకు విరుగుడు లేదా? అంటే.. సీఎస్​ఐఆర్​ (కౌన్సిల్​ ఆఫ్​ సైంటిఫిక్​ అండ్​ ఇండస్ట్రియల్​ రీసెర్చ్​)కు చెందిన నేషనల్​ ఫిజికల్​ లేబొరేటరీ (ఎన్​పీఎల్​) మంచి పరిష్కారం కనుగొంది. సరికొత్త డ్యుయల్​ సెక్యూరిటీ ఇంక్​ను తయారు చేసింది.

ఏంటా ఇంక్​.. ఏంటా రెండు రంగులు?

ఫ్లోరోసెన్స్​ ఫాస్ఫరోసెన్స్​ టెక్నిక్​ ద్వారా ఈ కొత్త ఇంక్​ను తయారు చేసింది ఎన్​పీఎల్​. ఒకే ఒక్క వేవ్​లెంగ్త్​లో రెండు కలర్లను చూపిస్తుంది ఆ కొత్త ఇంక్​. ఆ రెండు రంగులు ఎరుపు, ఆకుపచ్చ. ఫ్లోరోసెన్స్​ టెక్నిక్​లో 611 నానోమీటర్​(ఎన్​ఎం) వేవ్​లెంగ్త్​ వద్ద ఎరుపు రంగును చూపిస్తే, ఫాస్ఫరోసెన్స్​ టెక్నిక్​తో 532 నానోమీటర్​(ఎన్​ఎం) వేవ్​లెంగ్త్​ వద్ద ఆకుపచ్చగా కనిపిస్తుంది. ‘‘పిగ్మెంట్​ కలర్​ను మార్చడం ద్వారా ఈ ఇంకుకు సరికొత్త సెక్యూరిటీ ఫీచర్​ వస్తుంది. ఇప్పుడున్న నోట్లు ఒక వేవ్​లెంగ్త్​ వద్ద ఒకే కలర్​తో మాత్రమే ఉంటాయి” అని ఈ పరిశోధనను లీడ్​ చేసిన ఎన్​పీఎల్​ సీనియర్​ సైంటిస్ట్​ డాక్టర్​ బిపిన్​ కుమార్​ గుప్తా తెలిపారు. మామూలు లైట్​లో తెల్లగా కనిపించే ఇంకు, అతినీలలోహిత (అల్ట్రావయొలెట్​– యూవీ) లైట్​లోకి తీసుకెళ్లినప్పుడు 254 ఎన్​ఎం వేవ్​లెంగ్త్​ వద్ద ఎర్రగా కనిపిస్తుందన్నారు. యూవీ సోర్స్​ను ఆపేస్తే ఆకుపచ్చగా కనిపిస్తుందని తెలిపారు. ఈ రెండు రంగులను మామూలుగా కూడా చూడొచ్చని చెప్పారు. డ్యుయల్​ ఎమిసివ్​ ల్యుమినిసెంట్​ పిగ్మెంట్​ (రెండు రంగులను చూపించే పిగ్మెంట్​)గా పిలుస్తున్న ఈ టెక్నిక్​ను ఇప్పటిదాకా ఎక్కడా వాడలేదని, నోట్లు, ఇతర డాక్యుమెంట్లకూ అది లేదని, దీనిని కనిపెట్టడం ఇదే మొదటిసారని ఆయన వివరించారు.

ఎట్ల చేశారు?

ఈ కొత్త పిగ్మెంట్​ను తయారు చేయడానికి సైంటిస్టులు రెండు కెమికల్​కాంపౌండ్స్​ను ఎంచుకున్నారు. యురోపియంను కలిపిన సోడియం ఇట్రియం, యురోపియం డిస్ప్రోషియం కలిపిన స్ట్రాన్షియం అల్యూమినేట్​ను తీసుకున్నారు. ఫ్లోరోసెన్స్​ ప్రాపర్టీ ఉండే సోడియం ఇట్రియం ఎరుపు రంగును ఇస్తే, ఫాస్ఫరోసెన్స్​ ప్రాపర్టీతో స్ట్రాన్షియం అల్యూమినేట్​ ఆకుపచ్చ రంగునిస్తుంది. ఎరుపు రంగు రావడానికి హైడ్రోథెర్మల్​ సింథసిస్​ ద్వారా ఆ రెండు కాంపౌండ్లను తయారు చేశారు. అంటే ఎక్కువ వేడి వద్ద ద్రావణం (నీళ్లు కలిపిన సొల్యూషన్​) నుంచి వాటి స్ఫటికాలను ఉత్పత్తి చేశారు. కొత్త ఇంకుకు కావాల్సిన లక్షణాలు వచ్చేలా ఆ రెండు పిగ్మెంట్లను 3:1 (మూడొంతుల సోడియం ఇట్రియానికి ఒక వంతు స్ట్రాన్షియం అల్యూమినేట్​) నిష్పత్తిలో కలిపారు. ఆ పదార్థాన్ని 400 డిగ్రీల వద్ద మూడు గంటల పాటు వేడి చేశారు. ఈ ప్రక్రియను అన్నీలింగ్​ అని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ప్రక్రియతో తెల్లటి పౌడర్​ తయారైంది. అంటే రెండు రంగులనిచ్చే ఒకే పౌడర్​ అన్నమాట. ఇంక్​ తయారయ్యేందుకు ఆ రెండు పిగ్మెంట్లు ఒకదానికొకటి అతుక్కుపోయి ఉండేందుకూ ఈ అన్నీలింగ్​ తోడ్పడుతుందని సైంటిస్టులు అంటున్నారు. వేడి చేయకుండా డైరెక్ట్​గా ఆ రెండు పిగ్మెంట్లను కలిపేస్తే పౌడర్​ ఒకటే అయినా ఆ రెండు పిగ్మెంట్లు వేర్వేరుగానే ఉండిపోతాయని, కావాల్సిన లక్షణాలు దానికి రావని స్టడీలో పాల్గొన్న అమిత్​ కుమార్​ గంగ్వార్​ అనే మరో సైంటిస్ట్​ తెలిపారు. చివరిగా ల్యుమినిసెంట్​ సెక్యూరిటీ ఫీచర్​ వచ్చేలా ఆ ఇంకు పౌడర్​ను పాలివినైల్​ క్లోరైడ్​ (పీవీసీ)తో కలిపారు. అది సరిగ్గా ఉందో లేదో తెలుసుకునేందుకు నాన్​ ఫ్లోరోసెంట్​ (మెరవని) తెల్లటి బాండ్​ పేపర్​పై దానిని ప్రింట్​ తీశారు. ఆ తర్వాత 254 ఎన్​ఎం వద్ద యూవీ లైట్​ కింద దానిని టెస్ట్​ చేస్తే ఆ రెండు రంగులూ కనిపించాయి.

అన్ని టెస్టులూ పాస్​.. అన్ని వెదర్స్​కూ ఓకే

ఇంకు స్థిరత్వాన్ని తెలుసుకునేందుకు సైంటిస్టులు మరిన్ని టెస్టులూ చేశారు. సబ్బు నీళ్లు, ఇథైల్​ ఆల్కహాల్​, ఎసిటోన్​ వంటి కెమికల్స్​తో పరీక్షించారు. అన్ని టెస్టుల్లోనూ ఆ ఇంకు తన స్థిరత్వాన్ని కోల్పోలేదు. ‘‘దాదాపు ఆరు నెలలపాటు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఇంకును టెస్ట్​ చేశాం. ఉక్కపోత, వేడి, చలి వంటి పరిస్థితులను ఇంకు తట్టుకుంది. అన్ని పరిస్థితుల్లోనూ అది స్థిరంగా ఉంది. ఒక్క ప్రాపర్టీ కూడా పోలేదు. ప్రింట్​లో తేడాలూ లేవు” అని స్టడీలో పాల్గొన్న మరో సైంటిస్ట్​ గిరిజా శంకర్​ తెలిపారు. అంతేగాకుండా మంచి ప్రింటింగ్​ క్వాలిటీ కోసం ఇంకు చిక్కదనాన్ని (విస్కాసిటీ)నీ సైంటిస్టులు టెస్ట్​ చేశారు. ఆఫ్​సెట్​ ప్రింటింగ్​, స్క్రీన్​ ప్రింటింగ్​ టెక్నిక్​లలో దానిని పరీక్షించారు. అందులోనూ అది సక్సెస్​ అయింది.

నకిలీ నోట్లకు చెక్​..  ఫార్మా కంపెనీలకూ తోడు

ఈ ఇంకుతో నకిలీ నోట్ల బెడదకు చెక్​ చెప్పడమే కాకుండా, వేరే డాక్యుమెంట్లనూ ప్రింట్​ చేయొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఉదాహరణకు పాస్​పోర్ట్​నే తీసుకుంటే, యూవీ లైట్​ కింద పెట్టినప్పుడు దానిపై ఉన్న నేషనల్​ ఎంబ్లెమ్​ ఆకుపచ్చగా కనిపిస్తుంది. ఈ కొత్త ఇంకును వాడితే రెండు రంగులను చూపిస్తుంది. దానిని ఎట్టిపరిస్థితుల్లో కాపీ చేయలేరు. అంతేగాకుండా నకిలీ మందులనూ ఈ ఇంకుతో అరికట్టొచ్చని సైంటిస్టులు అంటున్నారు. ఈ ఇంకుతో మెడిసిన్​ ప్యాకులపై సెక్యూరిటీ ఫీచర్​ను ప్రింట్​ చేస్తే అసలువేవో, నకిలీవేవో ఈజీగా గుర్తుపట్టొచ్చని చెబుతున్నారు. వాటితో పాటు అత్యంత రహస్యమైన లీగల్​ సర్టిఫికెట్లు, వ్యాపార, ఎలక్ట్రానిక్​ బార్​కోడ్​ల వంటి వాటికీ వాడొచ్చని అంటున్నారు.

ఆర్​బీఐ ఏం చెప్పింది?

రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) విడుదల చేసిన 2018–19 వార్షిక నివేదిక ప్రకారం రూ.500, రూ.2000 నోట్లకు నకిలీల బెడద ఉందని హెచ్చరించింది. రూ.500కు 121 శాతం, రూ.2,000 నోట్లకు 21.9 శాతం ఆ ముప్పు ఉందని చెప్పింది. రూ.200 నోటును మార్కెట్​లోకి తీసుకొచ్చాక 2017లో 12,728 నకిలీ నోట్లను గుర్తించినట్టూ వెల్లడించింది. త్రీడీ వాటర్​మార్క్​, చిన్న చిన్న అక్షరాలు, సెక్యూరిటీ థ్రెడ్​, కలర్​ షిఫ్ట్​ ప్యాటర్న్​ వంటి పది రకాల సెక్యూరిటీ ఫీచర్లు పెట్టినా నకిలీ నోట్ల బెడద పోవట్లేదని వెల్లడించింది. ఇప్పుడు సీఎస్​ఐఆర్​ తయారు చేసిన ఈ సరికొత్త ఇంకు దానికి పరిష్కారం చూపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.

CSIR develops advanced security ink to stop counterfeiting of currency notes