మస్తు పిరమైన సీతాఫలం పండ్లు..

మస్తు పిరమైన సీతాఫలం పండ్లు..
  • డజన్​ రూ. 800 నుంచి 1,000
  • అంతరిస్తున్న గుట్టలు, చెల్కలు.. కనుమరుగవుతున్న సీతాఫల చెట్లు

మహబూబ్​నగర్​, వెలుగు: ఒకప్పుడు సెప్టెంబర్​, అక్టోబర్​ వచ్చిందంటే చాలు.. తెలంగాణ పల్లెల్లో గుట్టలు, చెల్కల పొంట ఎటుచూసినా విరగకాసిన సీతాఫల చెట్లు కనిపించేటివి. గంపలకు గంపలు దోరకాయలను తెంపి మగ్గపెట్టుకొని ఇంటిల్లిపాదీ తినెటోళ్లు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. సీతాఫల చెట్లు కనుమరుగవుతున్నాయి. సీతాఫలాలు కనిపిస్తలేవు. మార్కెట్​లో ఎక్కడో ఓ చోట కనిపించినా రేట్లు భగ్గుమంటున్నాయి. ఒక్క పండు కొందామన్నా యాభై, వంద రూపాయలకు తక్కువ లేదు. క్వారీల కారణంగా గుట్టలు ధ్వంసం కావడం, బంజరు భూములు మాయమవడం.. చేన్లు, చెల్కలు వెంచర్లుగా మారుతుండడంతో సీతాఫల చెట్లు అంతరిస్తున్నాయి. ఫలితంగా మార్కెట్లోకి సహజసిద్ధమైన సీతాఫలాలు రావడం లేదు. వాటి స్థానంలో హైబ్రిడ్​ పండ్లు వచ్చి చేరుతున్నాయి. అవి రుచి పచీ ఉండటం లేదని జనం అంటున్నారు. 

మూడేండ్లుగా తగ్గిన దిగుబడులు

గుట్టలు, చిట్టడవులు ఎక్కువగా ఉన్న ఉమ్మడి కరీంనగర్​, వరంగల్​, ఆదిలాబాద్​, మెదక్, ఖమ్మం, మహబూబ్​నగర్​ జిల్లాల్లో గతంలో సీతాఫల చెట్లు ఎక్కువగా ఉండేవి. వానాకాలం సీజన్ ​ప్రారంభం కాగానే పూత, కాత పట్టి, బతుకమ్మ పండుగ నాటికి పండ్లు మార్కెట్​లోకి వచ్చేవి. పక్వానికి వచ్చిన కాయలను చెట్ల కింద, గడ్డికుప్పల్లో మగ్గపెట్టి.. ఆ తర్వాత తినేవారు. రుచికి రుచి, హెల్త్​కు కూడా మంచివి కావడంతో ఈ పండ్లను పిల్లలు మొదలుకొని వృద్ధులదాకా ఇష్టంగా తినేవారు. ఉమ్మడి కరీంనగర్​, వరంగల్​, మెదక్​, మహబూబ్​నగర్​ జిల్లాల్లో కొందరు సీతాఫలాల అమ్మకం ద్వారా నెల, 2 నెలలపాటు ఉపాధి పొందేవారు. అప్పట్లో చాటెడు వడ్లు పెడ్తే, గంపెడు పండ్లు వచ్చేవి. కానీ కాలక్రమేణా గుట్టలు, చిట్టడవులు ధ్వంసం అవుతున్నాయి. గ్రానైట్, కంకర క్వారీల పేరిట ఇప్పటికే కరీంనగర్​ జిల్లాలో 300కుపైగా గుట్టలు, ఖమ్మం, మెదక్​ జిల్లాల్లో 100కు పైగా, పాలమూరు జిల్లాలో 40 దాకా గుట్టలను ధ్వంసం చేశారు. కొన్నిచోట్ల రియల్​ వెంచర్లకు గుట్టలు అడ్డుగా ఉన్నాయని ఖతం చేస్తున్నారు. ఒకప్పుడు సర్కారు భూముల్లో ఉన్న చిట్టడవుల్లో సీతాఫల చెట్లు ఉండేవి. కానీ సర్కారే భూములు అమ్ముతుండడంతో చిట్టడవులన్నీ వెంచర్లుగా, ఫామ్​ల్యాండ్స్​గా మారుతున్నాయి. పట్టణీకరణ వల్ల చేన్లు, చెలకలు మాయమవుతున్నాయి.  గత ఐదేండ్లలో పాలమూరు జిల్లాలోనే దాదాపు 20% భూములను వెంచర్లు చేసి ప్లాట్లను అమ్మగా, ఏడాదిగా ఫామ్స్​ ల్యాండ్స్​ బిజినెస్​ కూడా పెరిగింది. ఇలా గుట్టలు, వ్యవసాయ భూములను వెంచర్లుగా మారుతుండడంతో సీతాఫల చెట్లు కనుమరుగైపోతున్నాయి. దీంతో మూడేండ్ల నుంచి సీతాఫలాల దిగుబడి తగ్గిపోయింది.  నిజానికి ఆగస్టు చివరి వారం నుంచి సీతాఫలాల సీజన్​ ప్రారంభమై నవంబర్​ చివరి వారం వరకు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఆక్టోబర్​ నెల ప్రారంభమై రెండు వారాలు కావస్తున్నా, ఇంకా మార్కెట్​లో డిమాండ్​ మేరకు పండ్లు రాలేదు.

హైబ్రిడ్​ సాగు..!

ఎక్కడో కశ్మీర్​లోనో, విదేశాల్లోనే పండే ఆపిల్ ప్రస్తుతం మార్కెట్​లో కిలో రూ.100, రూ.150కి దొరకుతుంటే.. మన పల్లెల్లో గుట్టలు, చెల్కల్లో కాసే సీతాఫలాలు కిలో రూ.500 దాకా పలుకుతున్నాయి. రెండు, మూడేండ్ల కింద పాలమూరు, సిద్దిపేట, కరీంనగర్​లాంటి ప్రాంతాల్లో రూ.100 పెడ్తే గంపెడు సీతాఫలాలు వచ్చేవి. ప్రస్తుతం అదే గంప రూ.500 నుంచి వెయ్యి దాకా చెప్తున్నారు. హైదరాబాద్​లో డజన్​ సీతాఫలాలు రూ.800 నుంచి వెయ్యికి అమ్ముతున్నారు. పైగా ఎక్కడ చూసినా హైబ్రిడ్​ పండ్లే కనిపిస్తున్నాయి. సహజంగా పెరిగే చెట్లు అంతరించిపోతుండడం, తద్వారా పండ్లకు ఏర్పడుతున్న డిమాండ్​తో చాలా జిల్లాల్లో రైతులు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సీతాఫలాలు సాగు చేస్తున్నారు. ఇప్పటికే  మహబూబ్​నగర్​ జిల్లాలో 96.24 ఎకరాల్లో హైబ్రిడ్​ సీతాఫలాలు సాగవుతున్నాయి. జడ్చర్లలో 69 ఎకరాల్లో, దేవరకద్రలో 16 ఎకరాల్లో ఉన్నాయి. హైదరాబాద్​లో బండ్లపై పెట్టుకొని ఒక్కో పండును రూ.50 నుంచి 100 చొప్పున అమ్ముతున్నారు. సీతాఫలల చెట్లను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.

హైబ్రిడ్​ పండ్లే దొరుకుతున్నయ్​

ఒకప్పుడు బంజరు భూముల్లో, సేన్లు, సెల్కల పొంట సీతాఫలాలు మస్తు దొరికేటియి. ఇప్పుడు గుట్టలు కనిపిస్తలేవు. బంజరు భూములను ప్లాట్లు చేసి అమ్ముతున్నరు. చూద్దామన్నా సీతాఫల చెట్లు కనిపిస్తలేవ్​. మార్కెట్​లో దొరుకుతున్నవన్నీ సాగుచేసిన హైబ్రిడ్​ రకం పండ్లే. అవి రుచి ఉంటలేవు.. రేట్లు మాత్రం మస్తు చెప్తున్నరు. 

- ఎస్​.వెంకటేశ్​, 
బాలానగర్, మహబూబ్​నగర్​​

ఒకప్పుడు మా దగ్గర మస్తు ఫేమస్​

సీతాఫలాలు ఒకప్పుడు మా బాలానగర్​లో మస్తు ఫేమస్​. ఇక్కడి నుంచి హైదరాబాద్​ మార్కెట్​కు ఎక్స్​పోర్ట్ చేసేటోళ్లు. బాలానగర్​ చుట్టూ ఉన్న అడవిలో మస్తు చెట్లు ఉండేటివి. ఊరు పెరుగుతున్న కొద్దీ అడవి, దాని చుట్టూ ఉన్న చెట్లను నరికేసిన్రు. ఉన్న భూములు, గుట్టలను సాప్​ చేసి వెంచర్లు వేసిన్రు.  ఇప్పుడు చెట్లు కనిపిస్తలేవు. 

- జి.యాదయ్య, బాలానగర్​, మహబూబ్​నగర్