హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సుచిత్రలో ఘోరం జరిగింది. ఒక చిన్న చట్నీ గొడవ... కాస్తా కత్తుల దాడికి దారితీసింది. కేవలం టిఫిన్‌లోకి చట్నీ ఎక్కువ వేయలేదన్న కోపంతో ఓ వ్యక్తి హోటల్ సిబ్బందిపై దాడి చేయడం కలకలం రేపుతోంది.
స్థానికంగా ఉన్న ఓ టిఫిన్ సెంటర్‌కు వచ్చిన ఓ కస్టమర్... టిఫిన్‌తో పాటు చట్నీ ఎక్కువ వేయాలని సిబ్బందిని కోరాడు. హోటల్ సిబ్బంది అందుకు నిరాకరించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆ వ్యక్తి... హోటల్‌లో ఉల్లిపాయలు కోసే కత్తిని అందుకుని, అక్కడే ఉన్న సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు.
ఈ అటాచ్‌మెంట్‌లో హోటల్ సిబ్బందితో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న బాధితుల అరుపులతో ఒక్కసారిగా అందరు ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై... దాడికి పాల్పడిన వ్యక్తిని పట్టుకున్నారు. అనంతరం అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
