ఆర్మీ ఆఫీసర్ పేరిట సైబర్ చీటర్ల మోసం.. ఫ్లాట్ రెంట్​కు కావాలని అకౌంట్ ఖాళీ

ఆర్మీ ఆఫీసర్ పేరిట సైబర్ చీటర్ల మోసం..  ఫ్లాట్ రెంట్​కు కావాలని అకౌంట్ ఖాళీ

బషీర్​బాగ్, వెలుగు: ఆర్మీ అధికారి పేరిట ఫ్లాట్ రెంట్​కు తీసుకుంటామని చెప్పి ఓ గృహిణిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ కు చెందిన 40 ఏళ్ల మహిళ తన ఫ్లాట్​ను రెంట్​కు ఇవ్వడానికి QUIKR యాప్​లో పోస్ట్ చేసింది. గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు కాల్ చేసి, తాను ఆర్మీ అధికారిని అని పరిచయం చేసుకున్నాడు. ఫ్లాట్ రెంట్​కు తీసుకుంటానని, అందుకు సంబంధించిన ప్రాసెస్ కోసం ఆర్మీకి సంబంధించిన అకౌంటెంట్ సంప్రదిస్తాడని తెలిపాడు. 

అనంతరం ఫోన్ చేసిన స్కామర్ తనను ఆర్మీ అకౌంటెంట్​గా పరిచయం చేసుకొని, ఆర్మీ నిబంధనల మేరకు ప్రాసెస్ రివర్సల్ మోడ్ ఉంటుందని తెలిపాడు. అందుకు తొలుత రూ.5 పంపించమని బాధితురాలికి తెలిపి, ఆమె పంపిన తరువాత ఆ డబ్బును తిరిగి ఆమె అకౌంట్​కు పంపించాడు. ఆ తర్వాత మరి కొంత నగదును బాధిత మహిళ బదిలీ చేసింది. కానీ, ఆ డబ్బులు తిరిగి ఆమెకు క్రెడిట్ కాలేదు. ప్రాసెస్ నిదానంగా చేయడం కారణంగా డబ్బులు క్రెడిట్ కాలేదని స్కామర్స్ తెలిపాడు. 

కోల్పోయిన డబ్బులు తిరిగి చెల్లిస్తామని నమ్మిస్తూ , ఆమె అకౌంట్​ను ఖాళీ చేశారు. తిరిగి స్కామర్స్ కు మహిళ కాల్ చేయడంతో.. ఆమె అకౌంట్​లో డబ్బులు లేకపోవడం వల్ల రివర్సల్ మోడ్ కావడం లేదని చెప్పారు. దీంతో ఆమె తెలిసిన వల్ల దగ్గర అప్పు చేసి డబ్బులను మరల స్కామర్స్ కు పంపించింది. ఆ తర్వాత స్కమార్లు స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు మొత్తం రూ. 1,30,980 లను పోగొట్టుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఆన్​లైన్ లో ఫిర్యాదు చేసింది.