స్టాక్స్​లో ఇన్వెస్ట్​ చేస్తే అధిక లాభాలంటూ రూ.17.39 లక్షల మోసం.. ఇద్దరు సైబర్ నేగాళ్లు అరెస్ట్

స్టాక్స్​లో ఇన్వెస్ట్​ చేస్తే అధిక లాభాలంటూ రూ.17.39 లక్షల మోసం..  ఇద్దరు సైబర్ నేగాళ్లు అరెస్ట్

బషీర్​బాగ్, వెలుగు: స్టాక్​మార్కెట్​లో ఇన్వెస్ట్​చేస్తే అధిక ప్రాఫిట్స్ వస్తాయంటూ సిటీకి చెందిన వ్యక్తిని చీట్​చేసిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.సిటీకి చెందిన 40 ఏండ్ల వ్యక్తికి కొన్నాళ్ల కింద ఫేస్ బుక్ మెసెంజర్​లో ఇద్దరు పరిచయమయ్యారు. కీర్తి రఘురాం పేరిట ఉన్న అకౌంట్​నుంచి మెసేజ్​లు చేశారు. సాఫ్ట్ వేర్ డెవలపర్, దుబాయ్ లో ఇన్వెస్టర్​పేరుతో ఫ్రెండ్​షిప్​చేశారు. స్టాక్స్ లో పెట్టుబడి పెడితే 70 శాతం వరకు లాభాలు వస్తాయని నమ్మించారు. 

ఓ వైబ్​లింక్​పంపించి Innobyt IT Solutions పేరుతో ఇన్వెస్ట్​చేయించారు. తర్వాత లాభాలు వచ్చినట్లు చూపించారు. అలా మొత్తం రూ.17,39,000 ఇన్వెస్ట్​చేయించారు. చివరికి అదంతా ఫ్రాడ్​అని తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ పి.ప్రమోద్ కుమార్, ఎసై షైక్ అజీజ్ టీమ్ దర్యాప్తు చేపట్టి మహారాష్ట్రకు చెందిన ఐటీ ఉద్యోగి రేయనోల్డ్ వింసెంట్(26), ఫ్రీలాన్సర్​మనీశ్​దినేశ్​సొనవనే(27)ను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై దేశవ్యాప్తంగా 27 కేసులతోపాటు తెలంగాణరాష్ట్రంలో ఒక కేసు నమోదు అయినట్లు గుర్తించారు. రెండు సెల్​ఫోన్లు, మూడు సిమ్ కార్డులను సీజ్ చేసి రిమాండుకు తరలించారు. 

డెలివరీ అడ్రెస్ మారుస్తాంటూ వృద్ధుడిని.. 

కొరియర్ డెలివరీ అడ్రస్ మారుస్తామంటూ సైబర్​నేరగాళ్లు ఓ వృద్ధుడిని బురిడీ కొట్టించారు. రూ.1.18లక్షలు కొట్టేశారు. సిటీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి(70) ఇటీవల ఆన్​లైన్​లో ఓ ప్రొడక్ట్​బుక్​చేశాడు. అడ్రస్​తప్పుగా పెట్టడంతో బ్లూడార్ట్ కొరియర్ కస్టమర్​కేర్​నంబర్​కోసం గూగుల్​లో సర్చ్​చేశాడు. స్కామర్లు పెట్టిన నంబర్ నిజమైన నంబర్ అనుకుని కాల్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత బ్లూ డార్ట్ కొరియర్ సర్వీస్ ప్రతినిధిని అంటూ స్కామర్ కాల్ చేశాడు. తన డెలివరీ అడ్రెస్ మార్చాలని వృద్ధుడు కోరగా, ప్రాసెస్ చేయడానికి ఆన్​లైన్​లో రూ.1 చెల్లించాలని స్కామర్ తెలిపాడు. 

వృద్ధుడు తనకు ఆన్​లైన్​పేమెంట్ ఆప్షన్ లేదని చెప్పడంతో.. స్కామర్ వృద్ధుడి వాట్సాప్ కు support.co..apk అనే లింక్ పంపించాడు. దాన్ని ఓపెన్​చేసిన వృద్ధుడు తర్వాత ఆధార్ కార్డు వివరాలను పంపించాడు. తర్వాత వృద్ధుడి ఫోన్ రెండుసార్లు ఆటోమేటిక్ గా స్విచ్​ఆఫ్ అయింది. కొద్దిసేపటి తర్వాత వృద్ధుడి బ్యాంక్​అకౌంట్ లో రూ.507.60లు ఉన్నట్లు మెసేజ్ రావడంతో షాక్ అయ్యాడు. వెంటనే బ్యాంక్ కు వెళ్లగా, రెండు దఫాలుగా రూ.1,18,999 డెబిట్​అయినట్లు తెలుసుకున్నాడు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.