గచ్చిబౌలి, వెలుగు : బ్యాంకు అధికారులమంటూ నమ్మించి రూ.77 లక్షలకు పైగా కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుల ముఠాలో ప్రధాన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద రూ.7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రూ.15 లక్షలు రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి విజయ్‌కుమార్‌కు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పండితాపూర్ గ్రామానికి చెందిన సలీం మండల్ ఫోన్ చేసి, తాను సిటీ బ్యాంక్ ప్రెస్టీజ్ క్రెడిట్ కార్డు విభాగం అధికారి అని పరిచయం చేసుకున్నాడు. కొరియర్ ద్వారా విజయ్‌కుమార్‌కు ఫోన్ పంపించారు. బాధితుడు అందులో సిమ్ కార్డు వేయగానే బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీలు, మెసేజ్‌లు అన్నీ నిందితులకు డైవర్ట్ అయ్యాయి. దీంతో విజయ్‌కుమార్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.77.75 లక్షలను దోచుకున్నారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటికే అబ్దుల్ అలీం, సయ్యద్ హమీమ్, బన్సిధర్, రెహమాన్ షేక్, మహబూబ్ ఆలం అన్సారీలను అరెస్ట్ చేశారు. తాజాగా ప్రధాన నిందితుడు సలీం మండల్(30)ను పశ్చిమ బెంగాల్ నుంచి ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చి అరెస్ట్ చేశారు. అతని నివాసం నుంచి రూ.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
