ఎండీ ఫొటో డీపీగా పెట్టి మెసేజ్..కంపెనీకి రూ.2.7 కోట్లు టోకరా.. నిందితులు అరెస్ట్

ఎండీ ఫొటో డీపీగా పెట్టి మెసేజ్..కంపెనీకి రూ.2.7 కోట్లు టోకరా.. నిందితులు అరెస్ట్
  • ఇద్దరు  సైబర్ కేటుగాళ్లు అరెస్ట్ .. మరో కేసులో ఐదు మంది కూడా

హైదరాబాద్​సిటీ, వెలుగు: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అక్టోబర్  మొదటి వారంలో  రెండు సైబర్ నేరాలను ఛేదించి , వివిధ రాష్ట్రాల్లో ఏడుగురిని అరెస్టు చేశారు. సైబరాబాద్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం..  గ్రీన్‌కో గ్రూప్‌కు చెందిన ఎండీగా నటించి.. వాట్సాప్ ద్వారా కంపెనీ అధికారులను మోసం చేసి రూ.2.7 కోట్లు బదిలీ చేయించిన కేసును ఛేదించారు. 

 గ్రీన్‌కో గ్రూప్‌కు చెందిన సీఎఫ్‌ఓ, ఎండీ ఫొటోను డిస్‌ప్లే పిక్చర్‌గా ఉపయోగించిన రెండు వాట్సాప్ నంబర్ల  నుంచి మెసేజ్​లు చేశారు. వాటిని నమ్మి, సీఎఫ్‌ఓ  చీఫ్ ఫైనాన్స్ కంట్రోలర్ (సీఎఫ్‌సీ)  రూ.1.95 కోట్లు , మరొకరు రూ.75 లక్షలు  చెల్లించారు.   నేరస్తులు ఎండీ ఫోటోను ఉపయోగించి వాట్సాప్ ప్రొఫైల్‌లను సృష్టించి, సీనియర్ అధికారుల  నమ్మకాన్ని పొందారు.  మోసపోయామని  గుర్తించిన వెంటనే కంపెనీ అధికారులు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

పోలీసులు  కేసు దర్యాప్తు చేసి   బెంగళూరులో ఇద్దరు నిందితులు సందీప్ రూప్, అవినాష్ కుమార్ ను అరెస్టు చేశారు. అలాగే   మరో కేసులో  మరో  5 మంది నేరస్థులను పోలీసులు అరెస్ట్​ చేశారు.  వారి నుంచి 33 ఫోన్లు, 2 ల్యాప్​టాప్​లు, 32 చెక్​బుక్​లు , 23 ఏటీఎం కార్డులు, 48 సిమ్​ కార్డులు స్వాధీనంచేసుకున్నారు.  వీటితో పాటు  53 కేసులలో   బాధితులకు  రూ.75,12,158- రీఫండ్  చేయనున్నామని పోలీసులు తెలిపారు.