న్యూయార్క్: అమెరికాలోని నీటి పంపిణీ వ్యవస్థపై తాజాగా సైబర్ దాడి జరిగింది. మిన్నెసోటా, మిషిగాన్ సహా ఏడు రాష్ట్రాల్లో వాటర్ సిస్టంలపై వరుసగా సైబర్ అటాక్స్ చోటుచేసుకున్నాయి. అయితే, నీటిని కలుషితం చేసిన ఆనవాళ్లు మాత్రం కనిపించలేదని అమెరికా నిపుణులు తెలిపారు. వాటర్ ట్రీట్ మెంట్, ప్రెజర్, కెమికల్ స్థాయుల నిర్వహణ వంటి కీలకమైన వ్యవస్థలపై సైబర్ అటాక్స్ చోటుచేసుకోవడం గమనార్హం. మౌలిక వసతుల్లో కీలకమైన నీటి సరఫరా వ్యవస్థపై దాడి జరగడం అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ దాడుల వెనక ఇరాన్ హస్తం ఉన్నట్లు సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతుండగా.. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం తోసిపుచ్చారు. తొలుత ఈ ఘటన వెలుగు చూసిన మిన్నెసోటా రాష్ట్రంలోనే దాడి మూలాలు ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రంప్ ఆరోపణలను మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ కొట్టిపారేశారు. వాటర్ సిస్టమ్స్ ప్రస్తుతం సాఫీగానే నడుస్తున్నాయని ఫెడరల్ ఆఫీసర్లు తెలిపారు. ఇప్పటికైతే ఈ సైబర్ అటాక్స్ వెనక ఇరాన్ పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని, అయినప్పటికీ తమ దర్యాప్తు కొనసాగిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా, ఇరాన్ నుంచి సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేస్తూ.. ఇంటర్నెట్, సైబర్ డిఫెన్స్ వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలని వాటర్ సిస్టం అధికారులకు సూచించారు.
