- హైదరాబాద్‌కు వెళ్లే అవసరం లేకుండా హాస్పిటల్స్‌ను బలోపేతం చేస్తం
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వైద్య సేవలపై సెక్రటేరియట్ లో మంత్రి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేసి, ప్రజలకు ఆయా జిల్లాల్లోనే నాణ్యమైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సోమవారం సెక్రటేరియట్ లోని తన చాంబర్‌లో ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్ బాబు, కోవ లక్ష్మి, రామారావు పవర్, అనిల్ జాదవ్ తో పాటు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ తదితరులతో కలిసి మంత్రి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆదిలాబాద్ రిమ్స్ తో పాటు ఆసిఫాబాద్, నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, జనరల్, ఏరియా హాస్పిటళ్లు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, సబ్ సెంటర్ల పనితీరు, మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు. ఎమ్మెల్యేల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి కొత్త పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఉన్నవాటిని అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. ఆదిలాబాద్ రిమ్స్ ను ప్రధాన వైద్య కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. క్లిష్టమైన చికిత్సలకు ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆయా జిల్లాల్లోనే పూర్తిస్థాయి వైద్యం అందుబాటులోకి తెస్తామని మంత్రి స్పష్టం చేశారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అటవీ ప్రాంత జిల్లాల్లో మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాలు, డయేరియా వంటి సీజనల్ వ్యాధులపై డీఎంహెచ్‌వోలు అప్రమత్తతతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. హాస్పిటళ్లలో అవసరమైన మందులు, డయాగ్నస్టిక్ కిట్లు, ఐవీ ఫ్లూయిడ్స్, వైద్య పరికరాలను నిల్వ ఉంచాలని, అవసరమైతే గ్రామ స్థాయిలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి మండలానికి ఒక అంబులెన్స్‌ను మంజూరు చేశామని, త్వరలో సీహెచ్‌సీలు, ఏరియా హాస్పిటళ్లకు అనుబంధంగా అదనపు అంబులెన్సులను తీసుకొస్తామని చెప్తూ, 108, 102 సేవలు అంతరాయం లేకుండా సాగాలని అధికారులను ఆదేశించారు.
