అయ్యో.. బూదవ్వ: ఆస్తి లాక్కొని అడవిలో వదిలేసిన కూతురు, మనవడు..

అయ్యో.. బూదవ్వ: ఆస్తి లాక్కొని అడవిలో వదిలేసిన కూతురు, మనవడు..
  • రెండు రోజులుగా తిండి, నీళ్లు లేక అడవిలో అచేతన స్థితికి..
  • మూల్గులు విని అధికారులకు సమాచారం ఇచ్చిన రైతులు
  • కూతురు, మనుమడు ఆస్తి లాక్కొని అడవిలో వదిలేశారంటూ వృద్ధురాలు కన్నీరు
  • సఖి కేంద్రానికి తరలించిన ఆఫీసర్లు​
  • జగిత్యాల జిల్లాలో ఘటన

జగిత్యాల, వెలుగు : వృద్ధాప్యంలో తల్లిదండ్రులను అనాథాశ్రమంలో పడేసే పిల్లలను చూశాం. కానీ ఇక్కడ ఏకంగా అటవీ ప్రాంతంలో వదిలేశారు. మూడు రోజులుగా తిండి, నీళ్లు లేక నీరసించిపోయిన ఆ అభాగ్యురాలి మూల్గులు విన్న రైతులు అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి సఖి కేంద్రానికి తరలించారు. మానవత్వానికి మచ్చగా మిగిలిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లె గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఉన్న పొలాలకు బుధవారం రాత్రి నీరు పెట్టేందుకు వెళ్లిన కొందరు రైతులకు ఓ వృద్ధురాలి మూల్గులు వినిపించాయి. 

దీంతో మరికొంత మంది స్థానికుల సాయంతో చుట్టుపక్కల వెతకగా అచేతన స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలు కనిపించింది. గ్రామస్తులు డీడబ్ల్యూవో నరేశ్‌‌‌‌కు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో ఆ వృద్ధురాలిని గ్రామంలోకి తీసుకువచ్చి వివరాలు ఆరా తీశారు. తనది జగిత్యాలలోని ఇస్లాంపుర అని, తన పేరు బూదవ్వ అని వృద్ధురాలు చెప్పింది. తన కూతురి పేరు ఈశ్వరి అని, ఆమెను జగిత్యాల రూరల్‌‌‌‌ మండలం నర్సింగాపూర్‌‌‌‌ గ్రామానికి చెందిన రాజయ్యకు ఇచ్చి వివాహం చేసినట్లు వివరించింది. తీవ్ర అస్వస్థతకు గురైన బూదవ్వను సఖి కేంద్రానికి తీసుకెళ్లి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందిస్తున్నారు. ఆమె చెప్పిన వివరాలపై ఆరా తీస్తున్నారు. 

మూడు రోజులుగా అటవీ ప్రాంతంలోనే...

జగిత్యాలకు చెందిన బూదవ్వ సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లె అటవీ ప్రాంతానికి ఎలా వెళ్లిందనే విషయంపై ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు. ఆమె మూడు రోజుల కింద ఓ రైతువేదిక సమీపంలోని వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద కనిపించగా స్థానిక రైతులు ఆహారం, నీరు అందించామని, తన కూతురు, మనుమడు తనను కొట్టి పొలం రాయించుకుని, బంగారం తీసుకున్నారని వృద్ధురాలు చెప్పినట్లు స్థానికులు తెలిపారు. 

ఆమె వద్ద గల సంచిలో ఓ పేపర్‌‌‌‌పై రాసి ఉన్న ఈశ్వరికి ఫోన్‌‌‌‌ చేయగా సంబంధం లేనట్లు మాట్లాడి కట్‌‌‌‌ చేసిందని స్థానికులు చెబుతున్నారు. అసలు అంత దూరంలోని అటవీ ప్రాంతానికి ఎలా వెళ్లిందోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. పైగా తన చెవి కమ్మలు కనిపించడం లేదని, ఎవరో తన కాళ్లు, చేతులు కట్టేసి అటవీ ప్రాంతంలో వదిలేశారని వృద్ధురాలు చెబుతోంది. దీంతో సంబంధిత శాఖ అధికారులు పూర్తి స్థాయి వివరాలను సేకరిస్తున్నారు.