V6 News

కేంద్ర ఉద్యోగులకు 2శాతం డీఏ.. 2026 జనవరి 1 నుంచే పెంపు అమల్లోకి..

కేంద్ర ఉద్యోగులకు 2శాతం డీఏ.. 2026 జనవరి 1 నుంచే పెంపు అమల్లోకి..
  • 2026 జనవరి 1 నుంచే పెంపు అమల్లోకి.. కేంద్ర కేబినెట్‌‌ కీలక నిర్ణయం
  • 50.46 లక్షల మంది ఉద్యోగులు, 68.27 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం
  • సావరిన్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటుకు ఆమోదం.. భారత నౌకలకు బీమా కవరేజీ  
  • దీనికోసం రూ.13 వేల కోట్లు కేటాయింపు
  • ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గడువు 2028 మార్చి వరకు పొడిగింపు
  • దీని కోసం అదనంగా రూ. 3 వేల కోట్లు కేటాయింపు
  • ఏపీలో రాజమండ్రి, విశాఖ పట్నం మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి గ్రీన్‌‌ సిగ్నల్‌‌
  • రూ. 24,815 కోట్లతో ఏపీ, యూపీకి భారీగా రైల్వే ప్రాజెక్టులు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ను కేంద్రం  2 శాతం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నది.  అంటే ప్రస్తుతం ఉన్న 58శాతం నుంచి 60శాతానికి డీఏను పెంచారు.ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుంది. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో భేటీ అయిన కేబినెట్‌‌‌‌‌‌‌‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఈ వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌‌‌‌‌‌‌ మీడియాకు వెల్లడించారు. 

డీఏ పెంపుతో సుమారు 50.46 లక్షల మంది ఉద్యోగులకు, 68.27 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఈ పెంపుతో కేంద్ర ప్రభుత్వంపై ఏడాదికి సుమారు రూ. 6,791.24 కోట్ల అదనపు భారం పడనున్నది. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం డీఏను సవరిస్తుంది. పెరుగుతున్న నిత్యావసర ధరలకు తగ్గట్టుగా ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ భత్యాన్ని అందజేస్తారు. ఏటా జనవరి, జులైలో ఈ సవరింపు ఉంటుంది. అయితే, ఈ సారి ఆలస్యం అయింది.

రూ. 12,980 కోట్లతో సావరిన్ మారిటైమ్ ఫండ్ 
భారతీయ నౌకాయాన రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో రూ. 12,980 కోట్ల భారీ కార్పస్‌‌‌‌‌‌‌‌తో ‘సావరిన్ మారిటైమ్ ఫండ్’ ఏర్పాటుకు కేబినెట్‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. భారత్‌‌‌‌‌‌‌‌కు వచ్చి వెళ్లే నౌకలకు, భారత జెండా ఉన్న షిప్‌‌‌‌‌‌‌‌లకు తక్కువ ధరకే బీమా సౌకర్యం కల్పించడం ఈ నిధి ప్రధాన ఉద్దేశం. నౌకల యంత్రాలు, కార్గో, పీ అండ్​ఐ (చమురు లీకేజీ, శిథిలాల తొలగింపు, సిబ్బంది గాయాలు), యుద్ధం వల్ల కలిగే నష్టాలకు ఈ బీమా రక్షణ కల్పిస్తుంది. ఈ పథకం 10 ఏండ్లపాటు అమల్లో ఉంటుంది. అవసరమైతే మరో 5 ఏండ్లు పొడిగించే అవకాశం ఉంది. 

విదేశీ బీమా సంస్థలపై ఆధారపడటం తగ్గుతుంది. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం (ఫారెక్స్​) ఆదా అవ్వడమే కాకుండా, అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం ఉన్నా కూడా భారత వాణిజ్యం నిరంతరాయంగా సాగుతుంది. దీనివల్ల సముద్ర వాణిజ్యంలో భారత్ స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో హార్మూజ్‌‌‌‌‌‌‌‌ జలసంధిలో రవాణా నౌకలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే.

పీఎంజీఎస్‌‌‌‌‌‌‌‌వై పొడిగింపు
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అనుసంధానాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ‘ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన’ను 2028 వరకు పొడిగించాలని  నిర్ణయం తీసుకున్నది. దీని కోసం అదనంగా రూ. 3వేల కోట్లను కేటాయించింది. దీనివల్ల మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. 

రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ 
 ఏపీ, యూపీ రాష్ట్రాల్లో రూ. 24,815 కోట్ల అంచనా వ్యయంతో రెండు రైల్వే మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీలో రాజమండ్రి,- విశాఖపట్నం మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌ లభించింది. ఇందులో భాగంగా కాకినాడ, మచిలీపట్నం, గంగవరం పోర్టుల కనెక్టివిటీ కోసం 198 కిలోమీటర్ల కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయనున్నారు. 

గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల మేర కొత్త వంతెనను నిర్మించనున్నారు. ఈ మార్గం హౌరా-–చెన్నై హై-డెన్సిటీ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ రద్దీ పెరగడంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలుగుతున్నది. కొత్త లైన్ల వల్ల విశాఖపట్నం, మచిలీపట్నం లాంటి పోర్ట్‌‌‌‌‌‌‌‌లకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.