ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఎలక్షన్స్ అయిపోయ్ ఇక ఏ నిమిషం అయినా రేట్లు పెరగొచ్చని తెలుస్తోంది. పెట్రోలియం మంత్రి మాత్రం షార్టేజీలేదు, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల రేట్లు పెంచాల్సి రావచ్చు అంటున్నారు. అయినా ఎన్నికలకూ రేట్ల పెంపుకూ లింక్ ఏం లేదంటూ కవరింగ్ కూడా ఇస్తున్నారు. దీనికి తోడు దేశంలోని ఆయిల్ కంపెనీల తీరు కూడా విచిత్రంగా ఉంది లాభాలు వస్తే తమ ఖాతాలో.. నష్టం వస్తే జనం జేబుల్లో అన్నట్లుగా ఉంది పరిస్థితి.
క్రూడ్ ఆయిల్ రేట్లు విపరీతంగా పెరుగుతున్న వేళ.. సామాన్య వినియోగదారుడి జేబుకు చిల్లు పడకుండా ప్రభుత్వం, చమురు సంస్థలే ఈ భారాన్ని భరించాలని ఆర్థిక నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా క్యాపిటల్‌మైండ్ వ్యవస్థాపకుడు దీపక్ షెనాయ్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రయోజనాన్ని సామాన్యులకు అందించలేదని.. మరి అలాంటప్పుడు ప్రస్తుతం ధరలు పెరుగుతుంటే మాత్రం ఆ భారాన్ని ప్రజలపై మోపాలని చూడటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
The last three years of low crude prices didn't help Indian consumers (we kept the petrol price the same)
— Deepak Shenoy (@deepakshenoy) May 12, 2026
Who made money? The govt, and the oil cos. The largest oil retail co, has more than 82,000 cr. in collective profits since FY24 to now.
They should take the hit now. pic.twitter.com/b6tuL9Eubx
గత కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గుముఖం పట్టినప్పటికీ.. భారత్‌లో మాత్రం పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించలేదు. ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు భారీగా లాభాలను జోబులో వేసుకున్నాయని షెనాయ్ లెక్కలతో సహా బయటపెట్టారు. ఉదాహరణకు.. దేశంలోనే అతిపెద్ద ఆయిల్ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లాభాలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.11వేల 704 కోట్లుగా ఉన్న ఐఓసీఎల్ నికర లాభం.. 2024 నాటికి ఏకంగా రూ.43వేల 161 కోట్లకు చేరుకుంది. అంటే గత 3 ఏళ్లలో చమురు కంపెనీలు రూ.82వేల కోట్లకు పైగా లాభాలను పొందాయి. ఇంతకాలం భారీ లాభాలు పొందిన ఈ సంస్థలు.. ఇప్పుడు సంక్షోభ సమయంలో ఆ భారాన్ని తమపై వేసుకోవాలని అన్నారు దీపక్ షెనాయ్.
భారత్ తన క్రూడ్ ఆయిల్ అవసరాల కోసం 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే అది కేవలం పెట్రోల్ ధరకే పరిమితం కాకుండా దాని ప్రభావం రవాణా, లాజిస్టిక్స్, విమానయానం, పెయింట్లు, సిమెంట్ వంటి అనేక రంగాలకు పాకుతుంది. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇప్పటికే ప్రధాని మోడీ ఇంధన పొదుపు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్సైజ్ సుంకాలు, పన్నుల పేరుతో ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకుంది తప్ప.. లీటరుపై పైసా కూడా తగ్గించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయిల్ ధరలు పెరిగితే.. ప్రభుత్వం మళ్లీ పాత పద్ధతినే అవలంబిస్తుందా లేక చమురు సంస్థల లాభాల నుంచి కొంత వెచ్చించి సామాన్యుడిని ఆదుకుంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. చమురు ధరల పెరుగుదల వల్ల పెట్రోలియం ఉత్పత్తులను ముడిసరుకుగా వాడే పరిశ్రమలు తీవ్ర నష్టాల్లో పడే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పన్నులను తగ్గించడం ద్వారా లేదా చమురు మార్కెటింగ్ కంపెనీలను భారం పంచుకోమని ఆదేశించడం ద్వారా మాత్రమే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయగలదు.
