చేప పిల్లల టెండర్ల ప్రక్రియ ఆలస్యం

చేప పిల్లల టెండర్ల ప్రక్రియ ఆలస్యం
  • ముందుకు రాని కాంట్రాక్టర్లు
  • గత ప్రభుత్వం బకాయిలు ఇవ్వకపోవడమే కారణం
  • రూల్స్​ కూడా సడలించాలని డిమాండ్​ 
  • టెండర్​ విధానం వద్దంటున్న మత్స్యకారులు  
  • నగదు బదిలీ చేయాలని విన్నపం  

మెదక్/నిజంపేట, వెలుగు : విత్తన చేప పిల్లల సరఫరాకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఈ పాటికే టెండర్లు ఖరారు కావాల్సి ఉండగా గత బీఆర్ఎస్ ​ప్రభుత్వ హయాంలో సరఫరా చేసిన విత్తన చేప పిల్లలకు సంబంధించి పెద్ద మొత్తంలో బకాయిలు ఉండడం, రూల్స్ ​కొంత కఠినతరంగా ఉండడం వల్లే ఈ సారి టెండర్లు వేసేందుకు వెనుకాముందాడుతున్నట్టు తెలుస్తోంది. 

ఫిషరీస్ ​డిపార్ట్​మెంట్ ​ఇటీవల నిర్వహించిన టెండర్లలో కాంట్రాక్టర్లు ఎవరూ పాల్గొనకపోవడంతో ఈనెల13న మరోమారు టెండర్లు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, టెండర్ ​ప్రాసెస్​ పూర్తయి విత్తన చేప పిల్లలు సరఫరా కావడానికి చాలా రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. టెండర్ ​విధానంలో చేప పిల్లలను సరఫరా చేయడం వల్ల కాంట్రాక్టర్లు అవకతవకలకు పాల్పడుతుండటంతోపాటు, నాణ్యమైన విత్తన చేపపిల్లలు సరఫరా చేయడం లేదని, అందువల్ల టెండర్​ విధానం రద్దుచేసి సొసైటీలకు నగదు బదిలీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. 

86  కోట్ల చేపపిల్లలు...రూ.100 కోట్లు  

రాష్ట్ర వ్యాప్తంగా 4,500 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు (సొసైటీ) ఉన్నాయి. వీటి ఆధ్వర్యంలో 32 జిల్లాల పరిధిలో ఉన్న 26,357 చేపల చెరువులు, రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో చేప లను పెంచుతున్నారు. ఇదివరకటి మాదిరిగానే ఈ సీజన్​లో కూడా ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్య సొసైటీలు.. చేపల పెంపకం చేపట్టే ఆయా సాగునీటి వనరుల్లో 86 కోట్ల విత్తన చేప పిల్లలను వదలాలని నిర్ణయించింది. 

రూ.100 కోట్లు వెచ్చించేందుకు ఆమోదం తెలిపింది. ఫిషరీస్ డిపార్ట్ మెంట్ కూడా చేప పిల్లల సరఫరా కోసం గత నెలలో టెండర్లు పిలిచింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టారు. జులై 23వ తేదీ వరకు టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించారు. కానీ, గతేడాది సరఫరా చేసిన చేప పిల్లలకు సంబంధించి పెద్ద మొత్తంలో బకాయిలు ఉండడంతో కాంట్రాక్టర్లు ఈ సారి టెండర్లలో పాల్గొనేందుకు ముందుకు రాలేదని తెలిసింది. 

నిబంధనలు కూడా కొంత కఠినతరంగా ఉన్నాయని వాటిని సడలించాలని కోరుతున్నట్టు సమాచారం. దీంతో మరోసారి టెండర్లు పిలిచారు. దీనికి ఈ నెల13వ తేదీ వరకు గడువు ఉంది. చేప విత్తన పిల్లలు స్వల్ప సంఖ్యలోనే మన రాష్ట్రంలో లభ్యమవుతుండగా..మెజారిటీ చేప పిల్లలను ఏపీలోని కైకలూరు నుంచి తీసుకురావాల్సి వస్తోంది. అంతదూరం నుంచి తీసుకువస్తున్నప్పటికీ బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని కాంట్రాక్టర్లు అంటున్నారు.

 అయితే, సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకంలో మాదిరిగానే ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంలో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని భావిస్తున్న ప్రభుత్వం ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ జరుపుతున్నట్టు సమాచారం. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాంట్రాక్టర్లు ఈసారి టెండర్లు వేసేందుకు ముందుకు రావడం లేదని తెలిసింది.   

సొసైటీలకు నగదు బదిలీ డిమాండ్​ 

చేప పిల్లల సరఫరా కాంట్రాక్టర్లకు అప్పగించకుండా సొసైటీలకు నగదు బదిలీ  చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. టెండర్ విధానంలో చేప పిల్లలను సరఫరా చేస్తే కాంట్రాక్టర్లు చెరువుల్లో పోయాల్సిన్ని చేప పిల్లలను పోయడం లేదని, అంతేగాక సైజు విషయంలో కూడా తేడాలు ఉంటున్నాయని మత్స్యకారులు వాదిస్తున్నారు. అందువల్ల చేపపిల్లలకు బదులుగా సొసైటీ బ్యాంక్ ఖాతాలో నగదును జమ చేస్తే తామే అవసరమైనన్ని నాణ్యమైన చేప పిల్లలను కొనుక్కుని తెచ్చుకుంటామని చెప్తున్నారు.  

సీఎం రేవంత్​రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి లెటర్​ 

టెండర్​ విధానంలో చేప పిల్లలు సరఫరా చేసే బదులు చెరువు విస్తీర్ణాన్ని, వదలాల్సిన విత్తన చేప పిల్లల సంఖ్యకు అనుగుణంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు (సొసైటీ)లకు నగదు బదిలీ చేయడం మంచిదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదే విషయమై ఆయన ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్​రాశారు. చేపపిల్లల పంపిణీ నిబంధనలు సడలించాలనే డిమాండ్​తోనే గత నెలలో కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనలేదని ఆరోపించారు. చేప పిల్లల సైజు, నాణ్యత, సంఖ్య విషయంలో రూల్స్​పాటింపజేయడం కష్టసాధ్యమైన పని అని అభిప్రాయ పడ్డారు. అందువల్ల నేరుగా సొసైటీలకు నగదు బదిలీ చేయాలని కోరారు.  

సొసైటీ అకౌంట్​లో పైసలు జమ చేయాలి

కాంట్రాక్టర్లు మంచి చేప పిల్లలను సప్లై చేస్తలేరు. అందుకని చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు అయ్యే డబ్బులను సొసైటీ బ్యాంక్​ అకౌంట్​లో జమ చేయాలి. అట్లా చేస్తే సొసైటీ మెంబర్లే మంచి చేప పిల్లలను కొనుక్కొచ్చి చెరువులో పోస్తారు. ఎన్నో ఏండ్ల నుంచి సొసైటీ అకౌంట్ల పైసలు జమ చేయాలని మేము సర్కార్లను కోరుతున్నాం. పోయిన గవర్నమెంట్​ పట్టించుకోలేదు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బ్యాంక్ అకౌంట్ లో పైసలు జమ చేయాలి.

            -మంగిలిపల్లి శ్రీనివాస్, సొసైటీ అధ్యక్షుడు, చల్మెడ (మెదక్ జిల్లా)

చేపపిల్లల సప్లై లేట్ అయితే ఇబ్బంది 

జిల్లాలో చేప పిల్లల పంపిణీ టెండర్ల ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో చేప పిల్లల సప్లై కూడా లేటవుతోంది. చెరువుల్లో కొత్త వాననీరు వచ్చినప్పుడే  సీడ్​పోస్తే బాగా పెరుగుతయి. సరైన టైంలో చేప పిల్లలు వదలకపోతే చేపలు పెరగవు. సొసైటీ ఖాతాలో పైసలు జమ చేస్తే చెరువుల్లో నీరు రాంగనే చేప పిల్లలు కొనుక్కొచ్చుకుని పోసుకుంటం. 

- పాక రాజు, నిజాంపేట, మెదక్​ జిల్లా