న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. రోహిణి ఈస్ట్ కౌన్సిలర్ ప్రవేశ్ వాహి ఢిల్లీ కొత్త మేయర్‌గా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఈ ఎన్నికల్లో ఆయనకు మొత్తం 156 ఓట్లు వచ్చాయి. ఇంద్రప్రస్థ వికాస్ పార్టీకి చెందిన 14 మంది సభ్యులు బీజేపీ అభ్యర్థికే మద్దతు పలికారు.
ప్రత్యర్థిగా నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి హాజీ జరాఫ్‌కు కేవలం 9 ఓట్లు మాత్రమే లభించాయి. ఆనంద్ విహార్ కౌన్సిలర్ మోనికా పంత్ ఢిల్లీ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆమెకు 156 ఓట్లే వచ్చాయి. స్టాండింగ్ కమిటీ సభ్యులుగా బీజేపీ నుంచి జై భగవాన్ యాదవ్ (బేగంపూర్), మనీష్ చద్ధా (పహార్‌గంజ్) ఎన్నికవ్వగా.. ఆప్ నుంచి జలజ్ చౌదరి (శాలిమార్ బాగ్) ఎన్నికయ్యారు. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది.

