మధిర, వెలుగు: రాష్ట్రంలో పుట్టిన ఏ బిడ్డా అర్ధాకలితో బడికి వెళ్లకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉదయం పౌష్టికాహారాన్ని అందిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఉచిత పథకాలపై విమర్శలు సరికాదని, పరిశ్రమలు, ప్రాజెక్టుల మాదిరిగా ఇవి ప్రజల కోసం పెట్టే పెట్టుబడులని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో సోమవారం సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ సెంటర్, మిల్క్ యూనిట్‌ను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఇడ్లి, పొంగల్, ఉప్మా, పూరీ తదితర అల్పాహారాలను రుచి చూశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా ప్రభుత్వ బడుల్లో ఉచిత అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలోని 7 లక్షల మంది, ప్రభుత్వ బడుల్లోని 20 లక్షల మంది విద్యార్థులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 27 లక్షల మందికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. హరే కృష్ణ మిషన్ భాగస్వామ్యంతో మెకనైజ్డ్ కిచెన్లను ఏర్పాటు చేసి మధిర నుంచి 16 మండలాల స్కూళ్లకు అల్పాహారం సప్లై చేస్తున్నట్లు చెప్పారు. మానవ వనరులే దేశానికి అసలైన సంపద అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఓట్ల తొలగింపుపై కుట్ర
మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ద్వారా ఇతర రాజకీయ పార్టీల ఓట్లను తొలగించేందుకు దేశవ్యాప్తంగా కుట్రలు జరుగుతున్నాయని భట్టి విక్రమార్క ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో పలు రాష్ట్రాల్లో ఈ రకంగా లబ్ధి పొందారని విమర్శించారు. మధిరలో జరిగిన కాంగ్రెస్ బీఎల్‌ఏల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కు తొలగిస్తే భవిష్యత్తులో రేషన్ కార్డు, సంక్షేమ పథకాలతో పాటు పౌరసత్వమే ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరించారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన బీఎల్‌ఏలు, వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. మధిర నియోజకవర్గంలో ఇప్పటివరకు దాదాపు 90% ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని, చనిపోయిన వారు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని గుర్తించి100% మ్యాపింగ్పూర్తి చేయాలని సూచించారు.
