- జార్ఖండ్ రాజకీయ పరిణామాలపై నివేదిక అందజేత
న్యూఢిల్లీ, వెలుగు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం రాజాజీ మార్గ్ లోని నివాసంలో ఖర్గేతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా.. జార్ఖండ్ రాజకీయ పరిణామాలపై నివేదికను సమర్పించారు. జార్ఖండ్‌లో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో.. ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్‌తో తాను జరిపిన చర్చల వివరాలను భట్టి తెలియజేశారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి, ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాలను తెలిపారు.
కాగా... పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం ఇటీవల జార్ఖండ్ లో పర్యటించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలపై నివేదిక రూపొందించారు. ప్రధానంగా రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగడం వంటి అంశాలపై జార్ఖండ్ నాయకత్వంతో చర్చలు జరిపారు. ఈ చర్చల సారాంశంతో పాటు కూటమి ఐక్యతను చాటేలా జార్ఖండ్ కాంగ్రెస్ నేతలు శ్రమిస్తున్న తీరును అధ్యక్షునికి వివరించినట్లు మీడియాకు భట్టి వెల్లడించారు.
