- చెన్నైలో జరిగిన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు: మహాత్మా గాంధీ ఏం పాపం చేశారని జాతీయ ఉపాథి హామీ పథకం నుంచి ఆయన పేరును తొలగించారని కేంద్ర ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. గురువారం ఆయన ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయడాన్ని నిరసిస్తూ తమిళనాడు కాంగ్రెస్ కమిటీ చెన్నైలో నిర్వహించిన సభకు చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..ఉపాధి పథకంలో గాంధీ పేరును తొలగించిన కేంద్రం.. వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ గ్యారెంటీ కల్పించాలనే అంశాన్ని సైతం తొలగించిందని ఆరోపించారు.
మానవీయకోణంతో యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో తీసుకువచ్చిన ఈ పథకం.. వ్యవసాయ కార్మికులకు ఎంతో ఉపాధినిచ్చేదన్నారు. దాన్ని ఇప్పుడు మోదీ సర్కార్ నిర్వీర్యం చేస్తు్న్నదని మండిపడ్డారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు గాంధీని ముట్టుకోలేకపోయారు కాని, మన దేశంలోని మతతత్త్వ వాదులు మహాత్మునిగా పిలుచుకునే గాంధీని చంపేశారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. సభలో తమిళనాడు పీసీసీ చీఫ్సెల్వతో తదితరులు పాల్గొన్నారు.
