- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ
- మే ఫస్ట్ వీక్ నుంచి సవరించిన భూముల మార్కెట్ విలువ
- అన్ని శాఖల పరిధిలోని భూముల వివరాలు సేకరించాలని ఆదేశం
- హిల్ట్ పాలసీని ఆహ్వానిస్తున్నామన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ప్రతినిధులు
- చైనా తరహాలో పారిశ్రామిక పార్కులు పెట్టాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీతో పాటు, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రభుత్వం హిల్ట్(హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్) పాలసీ తీసుకువచ్చిందని, ఈ పాలసీని ప్రజాస్వామ్య పద్ధతిలో అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. శుక్రవారం సెక్రటేరియెట్‌లో రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మే మొదటి వారం నుంచి సవరించిన భూముల మార్కెట్ విలువలను అమలు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను సబ్ కమిటీ ఆదేశించింది. సమావేశంలో కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు కమిటీ సభ్యులు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ప్రతినిధులు సైతం పాల్గొని వారి అభిప్రాయాలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని ఇండస్ట్రియల్ అసోసియేషన్ లతో చర్చించి హిల్ట్ పాలసీ అమలును వేగవంతం చేస్తామన్నారు. కాలుష్యకారక పరిశ్రమలు అన్నిటిని ఓఆర్ఆర్ అవతలికి తరలించాలని కంపల్సరీ చేస్తే అందరూ వెళ్ళిపోతారని కొందరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ల ప్రతినిధులు చెప్పారన్నారు. అయితే అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు పోతున్నామని భట్టి వివరించారు.
ఓఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్ మధ్య
ఇండస్ట్రియల్ పార్కులు..
ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తే మంచిదని, చైనా తరహాలో ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రతినిధులు సూచించారు. వీటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. హిల్ట్ పాలసీని స్వాగతిస్తున్నామని చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ రెడ్డి సమావేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పాలసీని ఇష్టారాజ్యం అమలు చేసుకుంటూ పోతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఇబ్బంది పడతారని కొంతమంది నాయకులు తమను పిలిచి చెప్పారన్నారు. ప్రస్తుతం తాము ఉంటున్న భూములను 30 సంవత్సరాల కిందటే ఆనాటి ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశామని వివరించారు. తమ వద్ద సేల్ డీడ్లు సైతం ఉన్నాయని వివరించినట్టు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కన్వర్షన్ చార్జీలను రోడ్డు విస్తీర్ణాన్ని బట్టి 30% నుంచి 50% వరకు నిర్ణయించారని హిల్ట్ పాలసీ అమలులో ఎక్కడ క్యాష్ ట్రాన్స్ఫర్ లేదని.. ఎటువంటి అనుమానాలు అవసరం లేదని చెప్పినట్లు తెలిపారు. పాలసీ అమలుకు 6 నెలలు సమయం ఇవ్వాలని, ఓఆర్ఆర్ అవతల ఏర్పాటు చేసుకునే పరిశ్రమలకు షిఫ్ట్ చేసేందుకు అదనపు చార్జీలు వసూలు చేయరాదని శ్రీనివాస్ రెడ్డి కోరారు. హిల్ట్ పాలసీని స్వాగతిస్తున్నామని కన్వర్షన్ చార్జీలను స్వల్పంగా తగ్గించాలని ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీస్ సెక్రటరీ సత్యనారాయణ కోరారు. సబ్సిడీలు ఇవ్వకపోయినా పర్వాలేదని.. భూమి చూపించి ఓఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్ మధ్య ఇండస్ట్రియల్ ఏరియా ఏర్పాటు చేయాలని జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా అధ్యక్షుడు నరేంద్రబాబు సూచించారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులు శశాంక, కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
పాలసీ అమలులో చాలా ఓపెన్‌గా ఉన్నం: మంత్రి శ్రీధర్ బాబు
హిల్ట్ పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఓపెన్ గా ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కొత్త ఇండస్ట్రియల్ పాలసీలో కార్మికుల కోసం డార్మెటరీలు తప్పనిసరి చేశామన్నారు. యూఏడీఎల్(అన్ డెవలప్డ్ ల్యాండ్) పాలసీ కింద భూములను అభివృద్ధి చేసే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇండస్ట్రియల్ పార్కుల ప్రతినిధులు కలిసి అభివృద్ధి చేసుకోవాలన్నారు. రిసోర్స్ మొబిలైజేషన్ లో భాగంగా తీసుకున్న నిర్ణయాలను అధికారులు స్పష్టంగా అమలు చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని, అశ్రద్ధ చేస్తే ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. అన్ని శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న, ఆక్రమణకు గురైన, అందుబాటులో ఉన్న భూముల వివరాలు సేకరించాలని అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు.

