- తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అత్యధిక ఎంపీ సీట్లు గెలవాలి
- కులవివక్ష ఎక్కడ ఉన్నా రాహుల్ అక్కడ ఉంటారని వెల్లడి
- డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో ప్రసంగం
హైదరాబాద్, వెలుగు: రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఈ దేశంలోని అనేక రుగ్మతలకు పరిష్కారం లభిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా అనంతగిరిలో జరుగుతున్న రెండు తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో భట్టి మాట్లాడారు. రాహుల్ను ప్రధానిని చేయాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకోవాలని, అందుకు డీసీసీ అధ్యక్షులు పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. ‘దేశంలో కుల సమస్యలు, రిజర్వేషన్లు’ అనే అంశంపై భట్టి మాట్లాడారు.
అంటరానితనం, కులవివక్ష.. ఎక్కడ, ఎవరికి ఎదురైనా రాహుల్ అక్కడ ఉంటారన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల కుల వివక్షకు భరించలేక బలవన్మరణానికి పాల్పడితే రాహుల్ గాంధీ నేరుగా వర్సిటీకి వచ్చారని గుర్తుచేశారు. అంటరానితనాన్ని ఒక సమస్యగా చూడాలేతప్ప రాజకీయ కోణంలో కాదన్నారు. రాహుల్ ఆలోచన మేరకే కర్నాటక, తెలంగాణల్లో రోహిత్ వేముల చట్టం తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వనరులను, సంపదను సమానంగా పంచుతామని రాహుల్ గాంధీ ప్రకటించారని, ఆయన ప్రకటించినట్టుగానే తెలంగాణలో ప్రజాపాలన ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో కులగణనను 50 రోజుల్లో పూర్తిచేసి, అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకున్నామని చెప్పారు.
నేనూ కులవివక్షను ఎదుర్కొన్నా..
దేశానికి స్వాతంత్ర్యం సాధించడంతో పాటు ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం సాధించేందుకు అనేక విప్లవాత్మక చట్టాలను చేసిన కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో లేకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని భట్టి మండిపడ్డారు. తానూ కుల వివక్షను ఎదుర్కొన్నానని, సమాజంలో కుల వివక్ష ఉంటుందనే వాస్తవాన్ని మనస్సులో పెట్టుకొని బలమైన సంకల్పంతో అనుకున్న లక్ష్యం కోసం ముందుకెళ్తున్నట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, ఎస్సీ సబ్ ప్లాన్ పూర్తి కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారానే సాధ్యమయ్యాయన్నారు
. భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. దీంతో సామాజిక వివక్షను ఎదుర్కొనే ధైర్యం ప్రజల్లో కలిగిందన్నారు. కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఏఐసీసీ నాయకులు విశ్వనాథన్, సచిన్ తదితరులు పాల్గొన్నారు.
