- ఎనిమిది నెలల కింద భార్య కూడా సూసైడ్
- అనాథలైన ఇద్దరు ఆడబిడ్డలు
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన
కాటారం, వెలుగు: అప్పులు చేసి ఊర్లో అభివృద్ధి పనులు చేయిస్తే.. ప్రభుత్వం నుంచి బిల్లులు రాక, అప్పుల బాధ పెరిగిపోయి ఓ ఉప సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎనిమిది నెలల కింద ఆయన భార్య కూడా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ దంపతుల ఇద్దరు ఆడబిడ్డలు అనాథలయ్యారు.
ఈ విషాద సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిదినేపల్లి జీపీ పరిధిలోని దంతాలపల్లిలో జరిగింది. దంతాలపల్లికి చెందిన బీఆర్ఎస్ లీడర్ తిరుపతిరెడ్డి(35) ఊర్లో వ్యవసాయం చేస్తూనే.. చిదినేపల్లి సర్పంచ్ ఎన్నికల్లో ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. గ్రామ పంచాయతీ తరఫున రైతు వేదికతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు రూ. 11 లక్షల దాకా అప్పులు చేశాడు. ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయని ఏడాదిగా ఎదురుచూశాడు. బిల్లులు రాకపోవడంతో ఆఫీసర్లకు మొరపెట్టుకున్నాడు. అయినా ఎలాంటి స్పందన కనిపించలేదు. అప్పులు ఇచ్చిన వారంతా ఇంటి చుట్టూ తిరిగిపోతుండటంతో ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ అకౌంట్ల నుంచి డబ్బులు లాక్కోవడంతో మరింత ఆందోళన చెందాడు. శనివారం ఉదయం 9 గంటలకు పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా... మార్గమధ్యంలో తిరుపతిరెడ్డి చనిపోయాడు.
అనాథలైన పిల్లలు
బాల్నేని తిరుపతిరెడ్డి భార్య సరిత కూడా 8నెలల కింద అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు ఆడ బిడ్డలు. పెద్ద కూతురు శ్రీనిత ఐదో తరగతి చదువుతుండగా, చిన్న కూతురు శ్రీనిక రెండో తరగతి చదువుతున్నది. అమ్మా నాన్న మృతితో ఇద్దరు బిడ్డలు అనాథల య్యారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

