
కేసీఆర్ కారణజన్ముడు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. హైదరాబాద్ లోని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ రూపొందించిన ''దేశ్ కీ నేత కేసీఆర్'' అనే పాటను తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడులకను పురస్కరించుకుని ఈ పాటను రూపొందించారు. ఈ పాటను తన నివాసంలో ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రతి సంవత్సరం ఉద్యమ కాలం నాటి నుంచి నేటి వరకు కూడా కేసీఆర్ జన్మదిన సందర్బంగా పాటను రూపొందించడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాడన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ వచ్చిందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి అవుతోందని, అన్ని పరిశ్రమల మాదిరిగానే తెలుగు చలన చిత్ర పరిశ్రమ కూడా అద్భుతంగా అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు.
కేవలం సినిమా వాళ్ళకే కాదు సినిమా కార్మికులకు కూడా కేసీఆర్ అండగా నిలిచారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశంసంచారు. నిత్యం సినిమా కార్మికుల మధ్య ఉంటూ సినీ పరిశ్రమ బాగు కోసం ఆలోచించే ప్రతాని రామకృష్ణ గౌడ్ , దర్శకుడు సముద్ర మరోసారి కేసీఆర్ మీద పాట రూపొందించినందుకు వారిని అభినందించారు. పాటలో ఏదైతే రాశారో అది అక్షరాలా నిజమవుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశఆరు. దేశానికి ఒక నాయకుడు కావాలని, దేశాన్ని ముందుకు నడిపించే ఆ నాయకుడే కేసీఆర్ అని స్పష్టం చేశారు. దేశాన్ని అమ్ముకుంటూ, సర్వనాశనం చేస్తూ, ఉద్యోగాలు లేకుండా, కేవలం అధికార దాహంతో ఉన్న కేంద్రానికి బుద్ధి చెప్పడానికే కేసీఆర్ ముందడుగు వేశారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు వి. సముద్ర, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.