- ఐ అండ్ పీఆర్ కమిషనరేట్ ఎదుట డెస్క్ జర్నలిస్టుల ఆందోళన
- న్యాయం చేయకుంటే సెక్రటేరియెట్ ను ముట్టడిస్తామని నేతల హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని, అర్హులైన వారందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని పలు జర్నలిస్టు సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయం చేయకపోతే సెక్రటేరియేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అక్రెడిటేషన్ కార్డుల సంఖ్యను భారీగా తగ్గించడాన్ని నిరసిస్తూ డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్ టీ) ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని ఐ అండ్ పీఆర్ కమిషనరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాకు టీడబ్ల్యూజేఎఫ్, టీయూడబ్ల్యూజే, టీయూడబ్ల్యూజే (143), హెచ్‌యూజే సంఘాలు పూర్తి మద్దతు తెలిపాయి. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఐ అండ్ పీఆర్ అడిషనల్ డైరెక్టర్ జగన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా డీజేఎఫ్ టీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జ్యోతి బాసు, మస్తాన్ మాట్లాడుతూ.. గతంలో ప్రతి జిల్లాకు ఐదుగురికి, ఎడిషన్ జర్నలిస్టులకు వేరుగా అక్రెడిటేషన్లు ఇచ్చేవారన్నారు. కానీ, ఇప్పుడు ఎడిషన్ సెంటర్‌కు 4 కార్డులే ఇస్తామనడం దారుణమన్నారు.
ఒక్కో ఎడిషన్ పరిధిలో 3 నుంచి 6 జిల్లాలు ఉంటాయని, మొత్తం ఎడిషన్‌కు కలిపి 4 కార్డులు ఇస్తే కనీసం డెస్క్ ఇన్ చార్జిలకు కూడా రావని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సిటీలో 18 నుంచి 20 మంది పనిచేస్తుంటే.. కేవలం 6 కార్డులే ఇస్తున్నారని, ఇది సరికాదన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా డెస్క్ జర్నలిస్టులకు కూడా కార్డులను 12 నుంచి 8కి తగ్గించారని, వారికి 15 కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్టూనిస్టులకూ ప్రత్యేక కాలం పెట్టి వారికీ కార్డులు ఇవ్వాలన్నారు.
టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ మాట్లాడుతూ.. అక్రెడిటేషన్ల మంజూరులో వివక్ష తగదన్నారు. టీయూడబ్ల్యూజే(143) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, కోశాధికారి యోగి మాట్లాడుతూ.. గతంలో మాదిరిగానే జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్, కార్యదర్శి నవీన్ మాట్లాడుతూ... అర్హత ఉన్న ఒక్క జర్నలిస్టుకు అన్యాయం జరిగినా సహించేది లేదన్నారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని హెచ్‌యూజే అధ్యక్షుడు అరుణ్ కుమార్, డీజేఎఫ్ టీ రాష్ట్ర నాయకురాలు విజయ కోరారు.
