సీఎన్​జీ వెహికల్స్​కు పెరుగుతున్న గిరాకీ

సీఎన్​జీ వెహికల్స్​కు పెరుగుతున్న గిరాకీ

మొత్తం కార్ల అమ్మకాల్లో వీటి వాటా 10శాతం
రన్నింగ్​కాస్ట్​ తక్కువ ఉండటమే కారణం

న్యూఢిల్లీ : కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్​జీ) ధరలు పెరిగినప్పటికీ, ఈరకం ఇంధనంతో నడిచే ప్యాసింజర్ కార్ల అమ్మకాలు స్థిరంగా పెరుగుతున్నాయి. పెట్రోల్​, డీజిల్​తో పోలిస్తే సీఎన్​జీ ధర తక్కువ కావడం, మైలేజ్​ ఎక్కువ ఉండటం ఇందుకు కారణం. ఇప్పుడు దేశంలోని మొత్తం కార్ల అమ్మకాలలో 10 శాతం వాటా వీటిదే ఉంది. ఈ ఏడాది జనవరిలో సీఎన్‌జీ వెహికల్స్​అమ్మకాల వాటా 8 శాతమే ఉండేది. సాధారణ కార్లతో పోలిస్తే తక్కువ నిర్వహణ ఖర్చు తక్కువ ఉండటం, కొత్త మోడల్స్​ రావడం, ఆఫర్లు బాగుండటం వల్ల సీఎన్​జీ వెహికల్స్​కు డిమాండ్‌‌ పెరుగుతున్నదని నిపుణులు తెలిపారు.

"సీఎన్​జీ వెహికల్​  రన్నింగ్ కాస్ట్ కిలోమీటరుకు రూ.2.5 నుంచి రూ. 2.60 వరకు మాత్రమే ఉంటుంది. పెట్రోల్,  డీజిల్‌‌తో నడిచే వెహికల్స్​కు అయితే కిలోమీటరుకు రూ. 5.30 నుంచి రూ.5.45 వరకు పెట్టాలి. భారత్​లో​అతిపెద్ద సీఎన్​జీ కార్ల పోర్ట్‌‌ఫోలియో మా కంపెనీకే ఉంది” అని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. భౌగోళిక రాజకీయ ఇబ్బందులు తగ్గుతుండటం వల్ల సీఎన్​జీ ధరలూ తగ్గే అవకాశం ఉందని శ్రీవాస్తవ చెప్పారు. సీఎన్​జీ కిలో ధర  ఈ ఏడాది  48శాతం పెరిగి 78.61 రూపాయలకు చేరుకుంది. అయినప్పటికీ, సీఎన్​జీ కార్ల రిటైల్ అమ్మకాలు జనవరిలో 22,807 యూనిట్ల నుంచి అక్టోబర్‌‌లో 33,529 యూనిట్లకు పెరిగాయి. ఆటోమోటివ్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ జాటో డైనమిక్స్ ప్రకారం, నవంబర్‌‌లో మాత్రమే అమ్మకాలు స్వల్పంగా తగ్గి 25,904 యూనిట్లకు చేరుకున్నాయి. 

నగరాల్లో ఎక్కువ...

నగరాల్లో టాక్సీ విభాగంలో సీఎన్​జీ కార్లదే హవా! మనదేశంలో ఇప్పటికీ సీఎన్​జీ ఫిల్లింగ్​స్టేషన్ల సంఖ్య తక్కువే.ఇందుకే ఇలాంటి కార్లను కొనడానికి కొందరు వెనకాడుతున్నారు. సీఎన్‌జీ నింపడానికి పట్టే సమయం ఎక్కువగా ఉండటం వల్ల, బంకుల్లో సీఎన్‌జీ వెహికల్స్ క్యూలు కనిపిస్తుంటాయి. అయితే సీఎన్‌‌‌‌‌‌‌‌‌‌జీ స్టేషన్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది నవంబర్  నాటికి భారతీయ నగరాల్లో 4,709 సీఎన్​జీ పంపులు ఉన్నాయి.  2019-–20లో వీటి సంఖ్య 2,207 మాత్రమే. గ్రీన్ ఫ్యూయల్‌‌‌‌ అయిన సీఎన్​జీ... డీజిల్, పెట్రోల్​ కంటే మంచిదేనని, అయితే  పెరుగుతున్న ధర వల్ల రన్నింగ్​కాస్ట్​లో పెద్దగా లాభం ఉండటం లేదని టాక్సీ ఆపరేటర్లు అంటున్నారు.  టాక్సీ డ్రైవర్లకు ఇంధనం చాలా ముఖ్యమని, వెహికల్​ రన్నింగ్​ కాస్ట్​లో ఇదే కీలకం కాబట్టి టాక్సీ ఆపరేటర్ల లాభాలపై ప్రభావం ఉంటుందని ముంబైలోని టాక్సీ అండ్ ఆటోరిక్షా యూనియన్ ప్రెసిడెంట్ శశాంక్ రావు అన్నారు.