బుజ్జగింపులు షురూ.!.. ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్

బుజ్జగింపులు షురూ.!.. ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్
  •     ఎన్నికల్లో ఒకే ఈవీఎం ఉండేలా ప్లాన్
  •     ఎక్కువ ఈవీఎంలతో గుర్తులు, ఓటింగ్​లో గందరగోళానికి ఛాన్స్​
  •     నేటి మధ్యాహ్నం వరకు వెల్లడి కానున్న డీటైయిల్స్​

మహబూబాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందడానికి ప్రధాన పార్టీ అభ్యర్థులు ప్రతి అంశాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. నామినేషన్ల పర్వం, స్క్రూటినీ ముగిసిన తర్వాత మహబూబాబాద్ పార్లమెంట్​స్థానానికి 25 మంది అభ్యర్థులు, వరంగల్ ఎంపీ స్థానానికి 48 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరంతా పోటీలో ఉంటే ఎన్నికల నిర్వహణకు ఒకటి కంటే ఎక్కువ ఈవీఎంలను వినియోగించాల్సి వస్తుంది. దీంతో ఓటర్లు ఓట్లు వేయడం, అభ్యర్థుల గుర్తులను కచ్చితంగా గుర్తుపట్టడంలో గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ఇండిపెండెంట్ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించడానికి ప్రధాన పార్టీల నాయకులు వారితో జోరుగా మంతనాలు జరుపుతున్నారు.

ఒకే ఈవీఎంలో 16 మంది అభ్యర్థులకు ఛాన్స్..

ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు ఒక్కో బ్యాలెట్ యూనిట్ లో నోటాతో కలిపి 16 మంది అభ్యర్థుల పేర్లు మాత్రమే పొందుపర్చే అవకాశం ఉంటుంది. అంతకుమించి అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిస్తే అడిషనల్ బ్యాలెట్ యూనిట్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వరంగల్ ఎంపీ స్థానానికి 48 మంది, మహబూబాబాద్ ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నేడు మధ్యాహ్నంలోగా పోటీలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఇతర రిజిస్టర్డ్ పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరి నుంచి తప్పించడానికి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లకు చెందిన ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. వివిధ పార్టీల నుంచి రెబల్స్ గా నామినేషన్ వేసిన వారితో మాట్లాడి వారికి పార్టీలో సముచిత స్థానం కస్తామని హామీ ఇస్తున్నారు. పోటీ నుంచి తప్పుకుంటే నజరానాలు ఇస్తామని బజ్జగిస్తున్నారు. 

డబుల్ ఈవీఎంలతో రిస్క్ తప్పదు

డబుల్ ఈవీఎంలతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు రిస్క్​ తప్పదు. గతంలో ఇండిపెండెంట్లకు ప్రధాన పార్టీల గుర్తును పోలిన గుర్తులు రాగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇదే అదనుగా భావించిన ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడానికి భారీగా డిమాండ్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. సోమవారం మధ్యాహ్నం వరకు విత్ డ్రాకు గవువు ఉంది. స్వతంత్ర అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటే తప్ప, ఒకే ఈవీఎంతో ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు. మహబూబాబాద్ స్థానం నుంచి స్వతంత్రులను విత్​డ్రా చేయించాలన్న ప్రయత్నాలు సాగుతున్నాయి. వరంగల్ ఎంపీ స్థానానికి 48 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 32 మంది తప్పుకుంటేనే అక్కడ ఒకే ఈవీఎంతో ఎన్నిక జరగనుంది. సోమవారం సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు వెల్లడించడంతోపాటు వారికి ఎన్నికల గుర్తులను కేటాయించనున్నారు.