వెలుగు ఓపెన్ పేజీ.. మత, కుల వ్యవస్థ విభజించిన శవప్రయాణం!

వెలుగు ఓపెన్ పేజీ.. మత, కుల వ్యవస్థ  విభజించిన శవప్రయాణం!

మనుషులు.. స్త్రీలు, పురుషులు పుట్టినప్పుడు ఒకేరకంగా తల్లి గర్భం నుంచి పుడతారు. ఎవరూ  తండ్రి కడుపు నుంచి పుట్టరు.   వ్యత్యాసం కేవలం లింగభేదం.  స్త్రీకి పిల్లలను కనే గర్భశక్తి ఉంటుంది.  పురుషునికి ఉండదు. పురుషునికి  పిండరూపం చెందడానికి స్త్రీకి  ఇంద్రియ కణాలను అందించగల శక్తి మాత్రమే ఉంటుంది. కానీ, స్త్రీకి అండాన్ని అభివృద్ధిచేసి  కడుపులో పెంచి,  భూమి మీదకు తెచ్చి మనిషిగా ప్రకృతికి అందించే శక్తి ఉంటుంది.  ఇది మనుష స్త్రీకి, జంతుస్త్రీకి ఒకే రకంగా ఉంటుంది. కానీ, మనుష జీవనం ప్రకృతిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి జంతుజాతిని అధిగమించిన  కుటుంబ సమాజ వ్యవస్థ సమకూర్చుకున్నారు. దీనికి బాగా అభివృద్ధి చెందిన  మానవ మెదడు,  చేతుల పనితనం,  క్రమంగా టెక్నాలజీ  నిర్మాణం సహకరించాయి.  ఇక్కడే మానవులు  జంతువులను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ వ్యవస్థ నిర్మాణం ఒక్క మగవాళ్లే  చేసింది కాదు.  స్త్రీ పాత్ర చాలా కీలకమైనది.

సమాజ అభివృద్ధి క్రమంలో  ప్రపంచంలో మతాలు ఏర్పడ్డాయి.  ఈక్రమంలో మనుషులను నమ్మించడానికి భూమి మీద జీవితానికి, చనిపోయిన తరువాత జీవితం ఆత్మరూపంలో నిరంతరత్వం పొందుతుందని కథలు రాసుకున్నాయి.  లేదా  నోటి ద్వారా  చెప్పుకున్నాయి.  ఈ కథలు  క్రమంగా సమ్మకాలుగా మారాయి.  ఈ కథలన్నీ  స్త్రీ, పురుషులు కలిసి  సమాజాన్ని  ని ర్మించాక చెప్పుకున్నవి.  లేదా రాసుకున్నవి.  అన్ని మత గ్రంథాలు లేదా మత విలువలు ఈ క్రమంలో  రూపుదిద్దుకున్నవే.

కులాన్నిబట్టి  వ్యత్యాసం 

జీవించి  చనిపోయాక  స్త్రీ– పురుషుల  మంచి చెడులతో  బేరీజు వేయబడి స్వర్గానికిగాని,  నరకానికిగాని  పోతారని  చెప్పుకున్నారు. రాసుకున్నారు. అయితే,  చావు  సందర్భంగా స్త్రీకి, పురుషునికి మధ్య వ్యత్యాసం  ఉండటమే కాక,  స్త్రీ శవం, పురుషుడి శవం  ట్రీట్​మెంట్​లో  చాలా తేడా ఉన్నది.  ఈ  తేడా అన్ని కులాల్లో ఎంతోకొంత  ఉన్నప్పటికీ  స్త్రీ శవయాత్ర సందర్భంగా ఆ శవం చుట్టూ పనిచేసే  స్త్రీలకు శవయాత్ర హక్కుల్లో కులాన్నిబట్టి  చాలా వ్యత్యాసం ఉన్నది.  అసలు ఈ కులాలు లేదా మతాలు నమ్మే స్వర్గాన్ని  పురుషులతో సమానంగా పంచుకునే హక్కు ఉన్నదా అని అనుమానం  కచ్చితంగా మెదడున్న మనిషికి రావాలి. కానీ, మూఢనమ్మకం మనుషుల  మెదళ్లను  పూర్తిగా  మొద్దుబారగొట్టింది. అందులో ముఖ్యంగా స్త్రీకి ఈ భూమి మీద పురుషునితో ఉండాల్సిన సమానత్వం గురించి వందల ఏండ్లు  సంఘర్షణ జరుగుతున్నా స్త్రీకి చనిపోయాక స్వర్గంలో ఎటువంటి సమానత్వం ఉంటుంది అనే అంశంపై చర్చ జరగలేదు. 

స్త్రీ మరణం– స్వర్గంలో స్థానం

ఈ మధ్య నాకు బాగా పరిచయం ఉన్న ఒక బ్రాహ్మణ మిత్రుని భార్య చనిపోయింది. ఆ శవయాత్రకు  ప్రిపరేషను జరిగేటప్పుడు  పురుషులంతా  క్రిస్టియన్​ డ్రెస్​గా  భావించే  ప్యాంటు,  షర్టు విప్పేసి ధోతీ కట్టుకుని పైన ఎటువంటి టవలు కూడా లేకుండా ఉన్నారు.  అందరికీ జంజాలు ఉన్నాయి. స్త్రీ శవస్నానం  బట్టతెర మధ్య చేయించి పట్టుబట్టను వేశారు.  స్త్రీకిగాని,  పురుషునికిగాని స్వర్గానికి దారిచూపే పవర్​ కొడుక్కి మాత్రమే ఉంటుందనే  నమ్మకం ఉంది.  కనుక ఆ కొడుకు శవపూజలో పాల్గొన్నాడు.  కూతురికి అందులో స్థానం లేదు.  శవాన్ని శ్మశానంకు  తీసుకెళ్లేటప్పుడు  కేవలం పురుషులను మాత్రమే రానిచ్చారు.  దగ్గరి  బంధువులకు, కూతురుతో  సహా అంతిమంగా శరీరం అంతమై  స్వర్గానికి ఆత్మ ఎగిరిపోతుంది  అనుకునే కాడి  దగ్గరకు మాత్రమే  స్త్రీలు పొయ్యే హక్కు లేదు.  స్త్రీ శరీరం అంతమై ఆమె ఆత్మ  స్వర్గ ప్రయాణమయ్యే  దశలో  స్త్రీలుచుట్టూ ఉంటే వచ్చే  ప్రమాదమేంటి? ప్రాణంతో ఉన్న స్త్రీలంతా పాపాత్ములనా లేక వారి ఉనికి  స్వర్గదారికి  అడ్డుపడుతుందనా!

ముస్లిం స్త్రీ , బ్రాహ్మణ స్త్రీ సిద్ధాంతాలకు సారూప్యత

నేను మౌలానా ఆజాద్​ యూనివర్సిటీలో ఒక స్త్రీ ప్రొఫెసర్​ చనిపోయినప్పుడు కూడా పోయి చూశాను. వారి స్త్రీలను  ఆ స్త్రీ శవాన్ని దగ్గరగా చూట్టానికి కూడా అనుమతించలేదు.  దూరంగావెళ్లి చూసి లోనికి వెళ్లండని   స్త్రీలతో   పురుషులు అన్నారు. ముస్లిం ‘జన్నా’ (స్వర్గం)పై మరీ ఎక్కువ నమ్మకం అంతిమంగా  గోరీల గడ్డకు ఆ శవాన్ని తీసుకుపోయినప్పుడు స్త్రీలు అసలు శవంవెంట పోయే హక్కు ప్రపంచంలో ఎక్కడా ముస్లిం స్త్రీలకు లేదు. అలాగే బ్రాహ్మణ స్త్రీలకు ఆ హక్కులేదు.  

 ఇక్కడ ఒక ప్రశ్న ఏమంటే  అసలు స్త్రీకి చనిపోయిన  తరువాత కూడా  ఈ మతాల సిద్ధాంతంలో  స్వర్గంపొయ్యే హక్కు ఉందా?  ఆ స్వర్గంలో నిరంతరంగా స్వర్గసుఖాలు అనుభవించే హక్కు వారికి ఉందా?  బతికున్న స్త్రీకి స్వర్గానికి దారి అయిన చావు ప్రయాణంలో పాల్గొనే హక్కు లేనప్పుడు చనిపోయాక స్త్రీకి స్వర్గంలో స్థానం ఎలా ఉంటుంది. 

 స్వర్గంలో  స్త్రీ, పురుషులు సమానంగా అన్ని సుఖాలను అనుభవిస్తారా, లేదా అక్కడ కూడా పురుషులకు స్త్రీలు సేవ చేస్తూ ఉండాలా!  ఇస్లాంలోకాని, బ్రాహ్మణిజంలోకాని స్త్రీకి స్వర్గంలో స్థానం గురించి వారిలోని స్త్రీలు కూడా  ఇప్పటివరకు ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఇందుకు భిన్నం గా శూద్రుల్లో స్త్రీ శవ ప్రయాణం గురించి చూద్దాం. 

శూద్ర స్త్రీ స్వర్గ ప్రయాణం

నేనుపైన చెప్పిన బ్రాహ్మణ స్త్రీ చనిపోయిన మరుసటిరోజే నా అక్క కొనగొండ బుచ్చమ్మ తన 80వ  ఏట చనిపోయింది. హైదరాబాదులో  కొడుకు, కోడలు, మనవరాలుతో  ఉండేది.  ఆమె శవాన్ని కే సముద్రం దగ్గర ఉప్పరపల్లిలో దహనం  చేశాం. అది వారి ఊరు.  నేను  దినమంతా అక్కడే ఉన్నాను.  శవంచుట్టూ  స్త్రీలంతా  గట్టిగా ఏడుస్తూ,  ఆమె గుణగణాలు ఏడ్పుపాటలా చెపుతూ  ఆఖరి యాత్రకు ప్రిపేర్​ చేశారు.  ఆడ, మగ ఐక్యంగా కాడిలో పెట్టి మనిషో కట్టెపుల్ల  కాడిపై వేసి వెనుతిరిగారు.  గ్రామస్తులే నిప్పు అంటించారు. కానీ, శూద్రుల్లో కూడా కొడుకు మాత్రమే తలగోరు పెడతాడు. ఈ తలగోరు అంతిమ పూజా కార్యక్రమం.  ఈ తలగోరు పట్టే హక్కు దళితుల్లో ఎలా ఉంటుందో నేను దగ్గరుండి చూడలేదు. కానీ, కొడుకు మాత్రమే పెట్టాలనే సాధారణ ఆచారం ఉంది. ఇది నిజానికి వీరిమధ్య ఆస్తితో ముడిపడి ఉన్న సమస్య. తండ్రికి, లేదా తల్లికి  తలగోరు కూతురుపెడితే  ఆస్తిలో ఆమెకు కూడా హక్కు ఏర్పడుతుందని వారి భావన కూడా. వీరిమధ్య స్వర్గం, మోక్షం చర్చ అంతగారాదు కానీ ఉంటుంది. 

క్రిస్టియన్, బుద్ధిస్టు స్త్రీ స్టేటస్​

ఈ రెండు మతాల్లో  కూడా  పితృస్వామ్య నిర్మాణం బలంగా ఉంది.  క్రిస్టియానిటీలో  స్వర్గం గురించి చర్చ చాలా ఉంటుంది.  అందులో  శవ ప్రిపరేషన్,  శవయాత్ర  రెండింటిలో స్త్రీకి అంతిమదశ వరకు పాల్గొనే హక్కు ఉన్నట్టు కనిపిస్తుంది.  అయితే,  స్వర్గంలో  స్త్రీని పురుషునితోపాటు అన్ని రంగాల్లో సమాన హక్కులు ఉంటాయి అని  బైబిలులో  కూడా ఎక్కడా లేదు.  ఈ మతంలో  కూడా  దేవునిపై బలమైన నమ్మకం ఏర్పరిచేది ఇహలోక,  పరలోక జీవితాల  గురించి నూరిపోసి  దేవుణ్ని నమ్మిస్తారు.  ఆ నమ్మకం స్త్రీ,  పురుషులందరికీ ఎక్కిస్తారు.  అయితే,  స్త్రీలకే  దైవనమ్మకం  ఎక్కువ  ఎక్కుతుంది.  ఎందుకంటే వారికి ప్రతి కాన్పు ఒక ప్రాణాపాయ సమస్య.  అందుకని వారు దేవునిపై  భారంవేసి  ప్రసవవేదన  అనుభవిస్తారు.  ఇటువంటి సమాజ భవిష్యత్  సృష్టికర్తలైన స్త్రీలకు  ఆ మతంలో కూడా పరలోక రాజ్యంలో సంపూర్ణ సమానత్వం ఉంటుందా!  ఉండకపోతే ఆ నమ్మకాన్ని మార్చేదెట్ల? అయితే క్రిస్టియానిటీల మరో  వాదన కూడా ఉంది.  దేవుని రాజ్యాన్ని పరలోకంలో కాదు చూడాల్సింది ఈ లోకంలో బతికుండగానే   స్త్రీ–పురుష సర్వ సమానత్వ సాధనలో చూడాలని న్యూ థియాలజీ సిద్ధాంతకర్తలలో చర్చ జరుగుతోంది. ఈ థియాలజీని అటు క్యాథలిక్కులు, ఇటు ప్రొటెస్టెంటుల్లో పాత  ఆచారకులు ముఖ్యంగా  పురుష ఆధిక్యవాదులు అంగీకరించడంలేదు. ఇతర మతాల్లో ముఖ్యంగా ఇస్లాంలో,  సనాతన ధర్మ మతవాదంలో ఇటువంటి చర్చ లేవనెత్తడం కూడా  నేరంగా భావిస్తున్నారు. 

స్త్రీ- పురుష అసమానత్వం ఎంతకాలం?

బుద్ధిజంలో ఆధునిక  స్త్రీ–పురుష సమానత్వంపై చాలా తక్కువ రచనలు వచ్చాయి.  చనిపోయాక  పునర్​జన్మ లేకుండా బతకడానికి  కావలసిన విలువలు  స్త్రీ–పురుషులకు  ఒకేరకంగా  ఉంటాయా  వేరువేరుగా ఉంటాయా! అంబేద్కర్​ బుద్ధిస్టుగా చనిపోయినప్పుడు ఎవరు చితికి నిప్పు పెట్టారో తెలియదు. బుద్ధిజం తీసుకుని చనిపోయిన గద్దర్​ను  బొందపెట్టినప్పుడు చివరి ప్రార్థన ఆయన కొడుకుని కేంద్రంచేసే  చేసేశారు. అయితే ఆడ, మగ శవం చుట్టూ  గుమిగూడి ఉన్నారు. బుద్ధిస్టు స్వర్గంలో  స్త్రీ–పురుష సమానత్వం ఎలా ఉందో మనమిప్పుడు గద్దర్​నే అడగాలి.  ఏదేమైనా స్త్రీ–పురుష అసమానత్వం చాలా తీవ్రమైన సమస్య. ఇది అన్ని మతాల్లో, అన్ని కులాల్లో, అన్ని తెగల్లో ఉన్నది.  అందులో మానవ చావు  సందర్భంగా  కూడా  బ్రాహ్మణిజంలో,  ఇస్లాంలో  ఇది చాలా తీవ్రంగా ఉన్నది.  ఒకవైపు  స్వర్గం  పొందడమే  మానవ అంతిమ లక్ష్యంగా చూపెడుతున్న మతాలు.. స్త్రీని చావులోనూ అసమానురాలిని చేసి వారికి అసలు స్వర్గప్రాప్తి ఉన్నదా లేదా అనే ప్రశ్నకూడా వేయకుండా చేసింది. ఆ ప్రశ్న వేయాలన్నా వారికి భయమే.  ఈ స్థితి ఇంకా ఎంతకాలం?

- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్​