జూన్ 15 లోపు వడ్లు కొనకపోతే..బీజేపీ నేతల ఇండ్లముందు పోస్తం: సీఎం రేవంత్ రెడ్డి

జూన్ 15 లోపు వడ్లు కొనకపోతే..బీజేపీ నేతల ఇండ్లముందు పోస్తం: సీఎం రేవంత్ రెడ్డి

రైతుల ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని తప్పుబట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ధాన్యానికి మద్దతు ధర ప్రకటించిన కేంద్రమే వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 15 లోపు వడ్లు కొనకపోతే... బీజేపీ నేతల ఇళ్ల ముందే వడ్ల కుప్పలు పోస్తామని హెచ్చరించారు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిస్కంలను అప్పుల కుప్పగా మార్చిందని... కానీ తమ ప్రభుత్వం రైతు డిస్కం ద్వారా ప్రజలకు మేలు చేస్తోందన్నారు. ఉచిత కరెంట్‌పై కాంగ్రెస్ పార్టీదే పేటెంట్ హక్కు అని, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి తీరుతామని, ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ అక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ప్రాథమిక ఆధారాలతో కేసులను సీబీఐకి అప్పగించామని... దీనిపై బీజేపీ నేత కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.

 హరీశ్ రావు ఎవరెవరితో సంప్రదింపులు జరుపుతున్నారో, ఎవరెవరితో మాట్లాడుతున్నారో తన దగ్గర పూర్తి సమాచారం ఉందన్నారు సీఎం. వచ్చే ఎన్నికల నాటికి హరీశ్ ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదని... ఒకవేళ బీఆర్ఎస్‌లోనే ఉంటాననే నమ్మకం ఉంటే, కేసీఆర్ మీద ఒట్టు వేసి చెప్పాలని సవాల్ విసిరారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని చెప్పారు.

►ALSO READ | ప్రయాణికులకు TGSRTC షాకింగ్ న్యూస్.. మే 31తో సమ్మర్ ఆఫర్ క్లోజ్

2034 వరకు తాను తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేయడమే తన ఏకైక లక్ష్యమన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్, సీఎంగా తాను... ఒక సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అని, ఈ జోడీ ఇప్పటికే మంచి ఫలితాలను ఇచ్చిందని గుర్తు చేశారు. ఇదే విజయవంతమైన కాంబినేషన్‌తో వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి తీరుతామని... 2029లోనూ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.