ట్రాఫిక్ కష్టాలకు చెక్.. కొంపల్లి, అమీన్‌పూర్ రోడ్ల విస్తరణకు గ్రీన్ సిగ్నల్

ట్రాఫిక్ కష్టాలకు చెక్.. కొంపల్లి, అమీన్‌పూర్ రోడ్ల విస్తరణకు గ్రీన్ సిగ్నల్

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన, నగర అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ అధ్యక్షతన, సీఎంసీ కమీషనర్ సృజన ఆధ్వర్యంలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో మొత్తం 11 ఎజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రోడ్ల అభివృద్ధి.. మౌలిక సదుపాయాలకు గ్రీన్ సిగ్నల్

ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా పలు ప్రధాన రోడ్ల అభివృద్ధి పనులకు స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జె.జె.నగర్ నుంచి కొంపల్లి వరకు 30 మీటర్ల రోడ్డు అభివృద్ధి పనులకు, అలాగే అమీన్‌పూర్ కమాన్ నుంచి బండం కొమ్ము చెరువు వరకు 45 మీటర్ల రోడ్డు ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. ఇక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కు సంబంధించి ఏఎస్సీఐ (ASCI) సేవల ప్రతిపాదనను కమిటీ ఉపసంహరించుకుంది.

రూ. 161 కోట్లతో సీఎంసీ శాశ్వత కార్యాలయం

ఈ సమావేశంలో అన్నిటికంటే ముఖ్యంగా సీఎంసీ శాశ్వత కార్యాలయ భవన నిర్మాణానికి కమిటీ ఆమోదం తెలిపింది. ఖానామెట్‌లో నిర్మించబోయే ఈ భవనానికి రూ. 161 కోట్లు మంజూరు చేశారు. అలాగే ఖైత్లాపూర్ లో జీ ప్లస్ 8 అంతస్తులతో అధునాతన కార్యాలయ భవనాన్ని నిర్మించనున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా దీనిని జీ ప్లస్ 12 అంతస్తుల వరకు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

►ALSO READ | ప్రయాణికులకు TGSRTC షాకింగ్ న్యూస్.. మే 31తో సమ్మర్ ఆఫర్ క్లోజ్

ప్రజా సమస్యలు, దరఖాస్తుల వేగవంతమైన పరిష్కారం కోసం టౌన్ ప్లానింగ్ ,ఇంజినీరింగ్ విభాగాలను బలోపేతం చేయాలని కమిటీ నిర్ణయించింది. ఫీల్డ్ తనిఖీలను వేగవంతం చేయడానికి టౌన్ ప్లానింగ్‌లోనూ, మౌలిక సదుపాయాల పనుల పర్యవేక్షణకు ఇంజినీరింగ్ విభాగంలోనూ అదనపు సిబ్బందిని నియమించనున్నారు. పరిపాలనా సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు వీలుగా కన్సల్టెన్సీ సపోర్ట్ సర్వీసుల వినియోగానికి కూడా కమిటీ ఆమోదం తెలిపింది.

దోమల నివారణకు పైలట్ ప్రాజెక్ట్

కొత్తగా విలీనమైన యూఎల్బీల్లో (ULBs) దోమల నియంత్రణే లక్ష్యంగా ఎంటమాలజీ పైలట్ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నారు. దీని కోసం ఫాగింగ్ మిషన్లు, ఇతర పరికరాల కొనుగోలుతో పాటు సిబ్బంది నియామకానికి ఓకే చెప్పారు. అలాగే నగరంలో చెట్ల నిర్వహణ, ప్రజా భద్రత కోసం 14 బకెట్ ల్యాడర్లను ఏర్పాటు చేయనున్నారు. నగర పచ్చదనం, బయోడైవర్సిటీని పెంచేందుకు రూ. 5.70 కోట్లతో అర్బన్ బయోడైవర్సిటీ కార్యక్రమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.నగరంలో క్రీడా సౌకర్యాల లీజు ధరలు, వాటి కాలపరిమితి సవరణలకు కూడా స్టాండింగ్ కమిటీ ఆమోదం ముద్ర వేసింది.