పోలీస్ వ్యవస్థలో జవాబుదారీతనం పెరగాలని... పాత పద్ధతులకు స్వస్తి పలికి, ప్రజలకు సేవలు అందించడంలో ముందంజలో ఉండాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఇన్‌స్పెక్టర్ల స్థాయి నుంచి ఎస్పీలు, కమిషనర్ల వరకు నిర్వహించిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పోలీస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఫిర్యాదుదారుల కోసం పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని... ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది క్రమశిక్షణతో మెలగాలని డీజీపీ ఆదేశించారు. సీసీటీఎన్‌ఎస్ (CCTNS) పనితీరు సరిగాలేకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీలను పునర్ వ్యవస్థీకరించాల్సిన సమయం వచ్చిందని డీజీపీ అభిప్రాయపడ్డారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ రవాణా నిరోధానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.త్వరలోనే పోలీస్ శాఖలో సరికొత్త విభాగాలు రాబోతున్నట్లు డీజీపీ వెల్లడించారు. అందులో భాగంగా...ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో,ఫుడ్ అడల్ట్రేషన్ వింగ్ (ఆహార కల్తీ నిరోధక విభాగం), విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌లను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వాడుకునేందుకు డీజీపీ టెక్ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇకపై ప్రతి జిల్లా ఎస్పీ, కమిషనర్లు తప్పనిసరిగా క్రైమ్ రివ్యూ నిర్వహించాలని... యూనిట్ హెడ్ ఆఫీసర్లు పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.పోలీస్ శాఖలో అంతర్గత క్రమశిక్షణ చాలా ముఖ్యమని... జూనియర్లు, సీనియర్లకు సరైన రీతిలో గౌరవం ఇవ్వాలని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
