- రూ. 5 కోట్లతో ట్యాంక్‌బండ్ గా అభివృద్ధి
- రూ.4 కోట్లతో రిటైనింగ్ వాల్, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్
- రూ.కోటితో నీటి సామర్థ్యం పెంచేలా పూడికతీత పనులు
- చెరువు అక్రమ నిర్మాణాలపై చర్యలకూ అడుగులు
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ - హనుమకొండ నగరంలోని గోపాల్‌పూర్ ఊర చెరువుకు త్వరలో కొత్తరూపు రానుంది. హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని బతుకమ్మకుంట చెరువును అభివృద్ధి చేసిన తరహాలోనే ఈ చెరువును కూడా ఆధునికంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కేయూ 100 ఫీట్ల రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ చెరువు గుర్రపుడెక్క, చెత్తచెదారంతో డంపింగ్ యార్డును తలపిస్తోంది. చుట్టుపక్కల కాలనీవాసులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటికే కొంతభాగం ఆక్రమణలకు గురికాగా, గతేడాది వరదల సమయంలో ఈ చెరువు పరిసర కాలనీలను ముంచెత్తింది. భవిష్యత్తులో ఇలాంటి వరద ముప్పు లేకుండా చెరువులో పూడికతీత చేపట్టడం, భారీ వరదలను సైతం తట్టుకునేలా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. చెరువు గట్టును బతుకమ్మకుంట మాదిరిగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు కేటాయించగా, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికే పనులకు శంకుస్థాపన చేశారు.
వైభవం కోల్పోయిన ఊర చెరువు..
హనుమకొండ నగరంలోని 56వ డివిజన్ పరిధిలో ఉన్న గోపాల్‌పూర్ ఊర చెరువు ఒకప్పుడు గొలుసుకట్టు చెరువుల వ్యవస్థలో కీలక పాత్ర పోషించింది. వర్షపు నీటిని నిల్వచేసి నగర శివార్లలోని వేలాది ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందించేది. నగరం విస్తరించడంతో చెరువు చుట్టూ వందలాది కాలనీలు ఏర్పడ్డాయి. దాదాపు 29 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు క్రమంగా ఆక్రమణలకు గురైంది. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన చెరువు, ఇప్పుడు చెత్త, వ్యర్థాలు, గుర్రపుడెక్కతో నిండిపోయి డంపింగ్ యార్డుగా మారింది.
వరదలతో మునిగిన కాలనీలు
కాకతీయుల కాలంలో రూపొందించిన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థలో భాగంగా కాజీపేట వైపు ఉన్న రాంపూర్ చెరువు నుంచి మడికొండ, సోమిడి, వడ్డెపల్లి చెరువుల మీదుగా చివరకు గోపాల్‌పూర్ ఊర చెరువుకు వరద చేరుతుంది. గతేడాది అక్టోబర్ చివరి వారంలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో వరంగల్‌లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కేయూ 100 ఫీట్ల రోడ్డుకు దగ్గరో ఉండే గోపాల్‌పూర్ ఊర చెరువు పొంగిపొర్లి దాదాపు 15 కాలనీలు నీటమునిగాయి. పైభాగంలోని నాలుగు చెరువుల నుంచి భారీగా వరద చేరడంతో ఊర చెరువు ఒత్తిడిని తట్టుకోలేకపోయింది.
తులసి బార్ సమీపంలోని అమరావతి నగర్ వద్ద వరదను నాలాలోకి మళ్లించే స్పిల్‌వే షట్టర్లకు చెత్త, గుర్రపుడెక్క అడ్డుపడటంతో అవి సకాలంలో తెరుచుకోలేదు. ఫలితంగా పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద చేరింది. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు పడవలతో సహాయక చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఈ ఘటనలో ప్రాణనష్టం చోటుచేసుకోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భారీ ఆస్తినష్టం సంభవించింది.
రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు..
హైదరాబాద్‌లోని బతుకమ్మకుంట చెరువును టూరిజం స్పాట్‌గా మార్చిన తరహాలోనే గోపాల్‌పూర్ ఊర చెరువును కూడా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వరదల అనంతరం ఈ ప్రాంతాన్ని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.4 కోట్లతో చెరువు గట్టు వద్ద బలమైన రిటైనింగ్ వాల్ నిర్మించనున్నారు. దీని ద్వారా దాదాపు 20 కాలనీలకు వరద ముప్పు తగ్గే అవకాశం ఉంది. మరో రూ.కోటితో పూడికతీత పనులు చేపట్టి చెరువులో పేరుకుపోయిన చెత్త, బురద, గుర్రపుడెక్కను తొలగించనున్నారు.
చెరువు ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించి అక్రమ నిర్మాణాలను తొలగించనున్నారు. భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా కట్టపై వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయనున్నారు. చెట్లు, లైటింగ్‌తో చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసి మహిళలు బతుకమ్మ ఆడుకునేలా తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే రిటైనింగ్ వాల్ పనులు ప్రారంభమయ్యాయి. తాజాగా పూడికతీత పనులు కూడా మొదలుకావడంతో గోపాల్‌పూర్ ఊర చెరువు త్వరలోనే బతుకమ్మకుంట తరహాలో అందమైన మినీ ట్యాంక్‌బండ్‌గా మారనుంది.
