ప్రాజెక్టుల ఎగువన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు.. వరద సమాచారం ముందుగానే తెలుసుకునే అవకాశం

ప్రాజెక్టుల ఎగువన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు.. వరద సమాచారం ముందుగానే తెలుసుకునే అవకాశం
  •     డ్రిప్ కింద గడ్డెన్న వాగు, స్వర్ణ ప్రాజెక్టుల కోసం ప్రతిపాదనలు
  •     రూ.36 కోట్లతో అంచనాలు
  •     వరద సమాచారం ముందుగానే తెలుసుకునే అవకాశం
  •     కడెం తరహాలోనే యాక్షన్ ప్లాన్

నిర్మల్, వెలుగు: ఏటా వర్షాకాలంలో ప్రాజెక్టుల ఎగువ నుంచి వచ్చే వరద ఉధృతిని సంబంధిత అధికారులు సరిగా అంచనా వేయలేకపోతుండడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షాకాలంలో ఇరిగేషన్ అధికారులు నిత్యం ప్రాజెక్టుల వద్దనే ఉంటున్నప్పటికీ.. రాత్రివేళ ఎగువ నుంచి వరద ఒకేసారి పెద్ద ఎత్తున వస్తుండడంతో ప్రవాహ ఉధృతిని అంచనా వేయలేకపోతున్నారు. దీంతో గేట్లు పైకెత్తి దిగువకు నీటిని వదలడం తీవ్ర సమస్యగా మారుతోంది. ఒకేసారి గేట్లను పైకెత్తడంతో వరదతో పరివాహక గ్రామాలన్నీ ముంపుకు గురై పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. 

వరద ఉధృతిని ఎప్పటికప్పుడు లెక్కకట్టేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కడెం ప్రాజెక్టు పరిధిలో ఏర్పాటుచేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లను గడ్డన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టు పరిధిలో కూడా సిద్ధం చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 

ఆయా చోట్ల సత్పలితాలు

కడెం వద్ద ఏర్పాటుచేసిన రెయిన్ ఫాల్ సెంటర్లు, సెన్సార్లు ప్రాజెక్టు వరద ఉధృతిని తెలుసుకునేందుకు దోహదపడ్డాయి. దీంతో గతేడాది వరద ఉధృతిని ఎప్పటికప్పుడు లెక్కగట్టి దానికినుగుణంగా గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం మందపల్లి వద్ద ఉన్న పలికేరు వాగుపై, కడెం నది తాటిగూడ, చిక్ మాన్ వాగు, కుప్టి వాగు వద్ద ఉన్న స్టేషన్లను మంచి ఫలితాలను ఇస్తున్నాయి. వీటి ద్వారా వరద లెక్కలను అధికారులు పక్కాగా నిర్ధారించారు. 

డ్రిప్ పథకం కింద ప్రతిపాదనలు

ఇదే తరహాలో గడ్డన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల ఎగువ భాగాన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డ్రిప్ (డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్​మెంట్ ప్రోగ్రాం) పథకం కింద అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. గడ్డెన్న ప్రాజెక్టుకు ఎగువన 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిగువ గ్రామ ప్రాంతంలో రూ.18 కోట్లతో వెదర్ స్టేషన్ తోపాటు, స్వర్ణ ప్రాజెక్టు ఎగువ బాగాన కూడా ఏర్పాటు చేసేందుకు మరో రూ.18 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. 

స్వర్ణ ప్రాజెక్టు ఎగువన 63 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యాచ్​మెంట్ ఏరియాలో వెదర్ స్టేషన్​ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇక్కడ వెదర్​స్టేషన్లు ఏర్పాటు చేస్తే వరదను పక్కాగా అంచనా వేసి నష్ట నివారణ చర్యలు చేపట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.