వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెడితే... తాము వచ్చే ఎన్నికల్లో పోటీనే చేయబోమని సంచలన సవాల్ విసిరారు. ఒకవేళ మీటర్లు పెట్టకపోతే... బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకుంటుందా? అని ప్రశ్నించారు. ఈఆర్సీ ముందుకు రాకముందే బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు చెప్తున్నారని, అబద్ధాలు ఆడటం, బ్లాక్‌మెయిల్ చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.
హరీశ్ రావు టార్గెట్
ఇక బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావును టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. హరీశ్ రావు ఎవరెవరితో సంప్రదింపులు జరుపుతున్నారో, ఎవరెవరితో మాట్లాడుతున్నారో తన దగ్గర పూర్తి సమాచారం ఉందన్నారు సీఎం. వచ్చే ఎన్నికల నాటికి హరీశ్ ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదని... ఒకవేళ బీఆర్ఎస్‌లోనే ఉంటాననే నమ్మకం ఉంటే, కేసీఆర్ మీద ఒట్టు వేసి చెప్పాలని సవాల్ విసిరారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని చెప్పారు.
ధాన్యం కొనుగోళ్లపై అల్టిమేటం
రైతుల ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరిని తప్పుబట్టారు సీఎం. ధాన్యానికి మద్దతు ధర ప్రకటించిన కేంద్రమే వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 15 లోపు వడ్లు కొనకపోతే... బీజేపీ నేతల ఇళ్ల ముందే వడ్ల కుప్పలు పోస్తామని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిస్కంలను అప్పుల కుప్పగా మార్చిందని... కానీ తమ ప్రభుత్వం రైతు డిస్కం ద్వారా ప్రజలకు మేలు చేస్తోందన్నారు. ఉచిత కరెంట్‌పై కాంగ్రెస్ పార్టీదే పేటెంట్ హక్కు అని, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి తీరుతామని, ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ అక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ప్రాథమిక ఆధారాలతో కేసులను సీబీఐకి అప్పగించామని... దీనిపై బీజేపీ నేత కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.
2034 వరకు నేనే... కాంబినేషన్ సూపర్ హిట్
2034 వరకు తాను తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేయడమే తన ఏకైక లక్ష్యమన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్, సీఎంగా తాను... ఒక సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అని, ఈ జోడీ ఇప్పటికే మంచి ఫలితాలను ఇచ్చిందని గుర్తు చేశారు. ఇదే విజయవంతమైన కాంబినేషన్‌తో వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి తీరుతామని... 2029లోనూ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
