భారత ఆహార సంస్థ (FCI) చేపట్టిన రూ.20వేల కోట్ల విలువైన అడ్వాన్స్ డ్ సైలో(silo scheme) ప్రాజెక్టులో కాంట్రాక్టుల కేటాయింపు అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశంలో ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను ఆధునికీకరించేందుకు రూపొందించిన ‘‘హబ్ అండ్ స్పోక్” సైలో స్కీంలో అత్యధిక కాంట్రాక్టులు కేవలం రెండు సంస్థలకే దక్కడంపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. మొత్తం 134 కాంట్రాక్టులలో 100 కాంట్రాక్టులు కేవలం రెండు కంపెనీలకు కట్టబెట్టడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.
అందుబాటులో రిపోర్టుల ప్రకారం.. అదానీ అగ్రి లాజిస్టిక్స్ లిమిటెడ్ (AAL), లీప్ ఇండియా ఫుడ్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (LIFL) కలిసి మొత్తం 134 సైలో కాంట్రాక్టుల్లో 110 కాంట్రాక్టులను సొంతం చేసుకున్నాయి. వీటి మొత్తం విలువ రూ.16వేల500 కోట్లకు పైనే ఉంటుంది. ప్రాజెక్టులో భాగంగా 60 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంలో సుమారు 46.5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఈ రెండు సంస్థల నిర్వహణలో ఉండనున్నాయి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొదట్లో ఏ ఒక్క కంపెనీ ఆధిపత్యం చెలాయించకుండా ఉండేందుకు ఎఫ్‌సీఐ యాంటీ మోనోపాలీ నిబంధనను తీసుకొచ్చింది. అయితే 2022లో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఆర్థిక వ్యవహారాల శాఖలు ఆ నిబంధనకు వ్యతిరేకంగా అభిప్రాయం వ్యక్తం చేశాయి. దీంతో మార్కెట్ పోటీకి అవకాశం ఇవ్వాలనే కారణంతో ఆ పరిమితిని తొలగించారు.
ఆ తర్వాత జరిగిన టెండర్ ప్రక్రియల్లో అదానీ, లీప్ ఇండియా సంస్థలు వరుసగా భారీ సంఖ్యలో కాంట్రాక్టులు దక్కించుకున్నాయి. విమర్శకుల అభిప్రాయం ప్రకారం..యాంటీ మోనోపాలీ నిబంధనలు అమల్లో ఉండి ఉంటే ఇంత స్థాయిలో కాంట్రాక్టుల కేంద్రీకరణ జరిగి ఉండేది కాదని అంటున్నారు. అయితే సంబంధిత సంస్థలు మాత్రం తాము అత్యల్ప బిడ్లు సమర్పించి నిబంధనల ప్రకారమే కాంట్రాక్టులు పొందినట్లు చెబుతున్నాయి.
►ALSO READ | మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీపై కోడి గుడ్లు, రాళ్లు, చెప్పులతో దాడి
అయితే ఈ కాంట్రాక్టుల కేటాయింపుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేవలం రెండు కంపెనీల చేతిలోకి దేశ ఆహార నిల్వల వ్యవస్త వెళ్లడంపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం సామాన్య ప్రజల కంటే కంపెనీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని విమర్శిస్తున్నారు.
సైలో ప్రాజెక్ట్ (Silo Project) అనేది వ్యవసాయ ఉత్పత్తులను, ముఖ్యంగా వరి, గోధుమలు వంటి ఆహార ధాన్యాలను అత్యంత భద్రతతో, శాస్త్రీయ పద్ధతిలో పెద్ద ఎత్తున నిల్వ చేయడానికి ఉద్దేశించిన ఆధునిక నిల్వ కేంద్రాల ప్రాజెక్టు. భారతదేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి, పోతకోత నష్టాలను (Post-harvest losses) తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టులను తీసుకొచ్చాయి.
ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశాలు..
ఆహార ధాన్యాల నిల్వలు: ఆహార ధాన్యాలను బహిరంగ ప్రదేశాల్లో నిల్వ చేస్తే పాడైపోతాయి. అలా కాకుండా ఉక్కుతో తయారు చేసిన భారీ సిలిండర్ల (సైలోస్) రూపంలో నిల్వ చేస్తారు. ఈ సిలిండర్లతో తేమ, ఉష్ణోగ్రతను నియంత్రించే ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఉంటాయి. దీంతో ధాన్యం నాణ్యత చెడిపోకుండా చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది. ఆహార నిల్వల రవాణాకు అనువుగా రైల్వే లైన్లతో అనుసంధానించబడి ఉంటాయి. దీనిద్వారా బల్క్ లోడింగ్ ,అన్‌లోడింగ్ సులభతరం అవుతుంది.
ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా దేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) ఆధ్వర్యంలో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) పద్ధతిలో ఈ సైలో గోదాముల నిర్మాణం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ నిల్వలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. తెలంగాణలో సుమారు 20 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యంతో సైలో- ధాన్య నిల్వ వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు వేగవంతం,నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి.
