మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీపై కోడి గుడ్లు, రాళ్లు, చెప్పులతో దాడి 

మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీపై కోడి గుడ్లు, రాళ్లు, చెప్పులతో దాడి 

కోల్‎కతా: బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. కోడి గుడ్లు, రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వచ్చి మరీ అటాక్ చేశారు. ఆత్మరక్షణ కోసం అభిషేక్ బెనర్జీ తలకు క్రికెట్ హెల్మెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. శనివారం (మే 30) సోనారుర్ గ్రామ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. అభిషేక్ బెనర్జీపై దాడితో వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ హీటెక్కాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష టీఎంసీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. 

ఇటీవల జరిగిన వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో బాధితులను పరామర్శించేందుకు శనివారం (మే 30) ఎంపీ అభిషేక్ బెనర్జీ సోనారుర్ గ్రామ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో గ్రామస్థులు ఆయనపై తిరగబడ్డారు. తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు అభిషేక్‎పై రాళ్లు, కోడిగుడ్లు చెప్పులు విసిరారు. మరికొందరు ఆయన చొక్కా పట్టుకుని లాగారు. 

దాడి సమయంలో బీజేపీ కార్యకర్తలు అతడికి వ్యతిరేకంగా దొంగ దొంగ అంటూ నినాదాలు చేశారు. అప్రమత్తమైన సిబ్బంది అభిషేక్ బెనర్జీకి రక్షణగా నిలిచారు. గ్రామస్థుల దాడి నుంచి ఆయనను కాపాడారు. ఆత్మరక్షణ కోసం అభిషేక్ తలకు క్రికెట్ హెల్మెట్ పెట్టుకుని చిరిగిన చొక్కాతోనే గ్రామం నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన అనంతరం అభిషేక్ బెనర్జీ చికిత్స కోసం కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. మమతా బెనర్జీ ఆసుపత్రికి వెళ్లి అభిషేక్‎ను పరామర్శించారు.

ఈ ఘటన సమయంలో అభిషేక్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై దాడికి బీజేపీనే కారణమని ఆరోపించారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగిందన్నారు. తనను చంపడానికి ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు. దాడి సమయంలో పోలీసులు ఎక్కడా కనిపించలేదన్నారు. 

►ALSO READ | రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. పట్టపగలే చీకట్లు.. వెనువెంటనే భారీ వర్షం..వీడియో వైరల్

తాను తీవ్ర గాయం నుండి తృటిలో తప్పించుకున్నానని పేర్కొన్నారు. అదృష్టవశాత్తూ నేను హెల్మెట్ ధరించడం వల్ల నా తలకు ఏమీ కాలేదని.. నా బట్టలు చింపి, కళ్లజోడు పగలగొట్టారని చెప్పారు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డ్ అయిందని.. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తప్పకుండా తీసుకెళ్తామన్నారు. గవర్నర్‌కు కూడా తెలియజేస్తామని చెప్పారు. 

అభిషేక్ బెనర్జీపై దాడిని టీఎంసీ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి అధికార బీజేపీనే కారణమని ఆరోపించింది. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు సరికాదని పేర్కొంది. ఇలాంటి ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని హెచ్చరించింది. అభిషేక్ బెనర్జీ దాడి ఘటనపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా దీదీ రియాక్ట్ అయ్యారు. పాలకులు హంతకులుగా మారారని ఇది బీజేపీకి సిగ్గుచేటని ఘాటుగా స్పందించారు.