ఎలక్షన్ పాలిటిక్స్ ఆ మూడింటి చుట్టే

ఎలక్షన్ పాలిటిక్స్ ఆ మూడింటి చుట్టే

 

  •     వీటిపైనే రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు
  •     నేతల మధ్య పోటాపోటీ కామెంట్లు, సవాళ్లు.. ప్రతి సవాళ్లు 
  •     గెలుపోటములకు కీలకం కానున్న అంశాలివే 
  •     ఓటర్ల మైండ్ సెట్ మార్చేలా లీడర్ల మాటలు
  •     ఎవరికి కలిసొస్తుందో చూడాలంటున్న విశ్లేషకులు  

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కరెంట్, రుణమాఫీతో పాటు రిజర్వేషన్ల రద్దు అంశాలపై హోరాహోరి నడుస్తున్నది. గత కొన్ని రోజులుగా రుణమాఫీపై రాజీనామా సవాళ్ల రగడ సాగగా.. తాజాగా పవర్ కట్ పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి. ఈ రెండు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వాడివేడి చర్చకు తావిచ్చింది. ఇక బీజేపీకి, కాంగ్రెస్ కు మధ్య రిజర్వేషన్ల రద్దు టాపిక్ పై యుద్ధమే నడుస్తుండగా, ఇప్పుడిది దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. 

అయితే, రాష్ట్రంలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోగా, బూమరాంగ్‌‌ అవుతున్నాయి. అధికార కాంగ్రెస్‌‌కే ఫేవర్‌‌గా మారుతున్నాయి. దీంతో పోలింగ్ దగ్గర పడే కొద్దీ ఎలక్షన్ పాలిటిక్స్ ఎటు తిరుగుతాయో చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చెబుతున్న మాటలు.. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు చేస్తున్న కామెంట్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయని.. చివరి నిమిషం వరకు గెలుపోటములకు ఇవే కీలకం అయ్యే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

రచ్చకెక్కిన పవర్ కట్ పాలిటిక్స్​

రాష్ట్రంలో కరెంట్ కోతలపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం కరెంట్ కోతలు వున్నాయని ఆరోపించారు. మహబూబ్ నగర్ లో ప్రచారం సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళితే.. అక్కడ భోజనం చేస్తుండగా రెండుసార్లు కరెంట్ పోయిందని కేసీఆర్ ఎక్స్ (ట్విట్టర్)లో ట్వీట్ చేశారు. 

ఇది పెద్ద దుమారమే లేపింది. దీన్ని సీరియస్​గా తీసుకున్న సీఎం రేవంత్ ఎంక్వైరీకి ఆదేశించగా.. పవర్ కట్ కాలేదని, అదంతా అబద్ధమేనని లోకల్ కరెంట్ ఆఫీసర్లు కొట్టిపారేశారు. లేనిపోని అబద్ధాలతో కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. మొన్న సూర్యాపేటలో కరెంట్ పోయిందని చెప్పారు. 

మహబూబ్‌‌నగర్‌‌లోనూఅవే అబద్ధాలు చెప్పారని ఫైరయ్యారు. కేసీఆర్ నిద్ర లేచింది మొదలు అవాస్తవాలు, అభూత కల్పనలతో కాలం గడిపేస్తున్నారని.. ఎన్నికల ముందు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి కూడా కౌంటర్ ఇచ్చారు. ఇది కూడా కాంగ్రెస్​కే కలిసి వస్తుందని చెప్తున్నారు. కరెంట్ కోతలు లేకున్నా అబద్ధాలు చెప్పడం ద్వారా జనాలకు వాస్తవాలు అర్థమవుతాయని కాంగ్రెస్​ భావిస్తున్నది. 

రిజర్వేషన్లపై రాజకీయ ప్రకంపనలు

ప్రస్తుతం రాజకీయాల్లో రిజర్వేషన్ల టాపిక్ కూడా భగ్గుమంటోంది. ఇది చివరకు ఎవరికి ఓట్లను కుమ్మరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే.. మోదీ, అమిత్ షా ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నది. గతంలో అమిత్​ షా చేసిన కామెంట్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నది. 

ఈ క్లిప్పులను రాష్ట్రం నుంచే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా వైరల్ చేయించేలా ప్లాన్​ చేసినట్లు తెలిసింది. దీంతో ఇప్పుడు దేశం మొత్తం రిజర్వేషన్ల రద్దుపై దుమారం రేపుతోంది. స్వయంగా అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ సైతం దీనిపై స్పందిస్తూ రిజర్వేషన్లు రద్దు చేయబోం అని వివరణ ఇచ్చుకునే దాకా పరిస్థితి వచ్చింది. అయితే, ముస్లిం ఓట్లు ఎలాగైనా కాంగ్రెస్​కు పడతాయని.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓట్లు కూడా గంపగుత్తగా మల్చుకునేందుకు కాంగ్రెస్ కు రిజర్వేషన్ల రద్దు అంశం బాగా ఉపయోగపడుతుందని పొలిటికల్ ఎక్స్ పర్ట్ లు అంటున్నారు. 

మాఫీ ఒట్టు ఒకవైపు.. రాజీనామా ఇంకోవైపు 

రాష్ట్రంలో పంట రుణాల మాఫీని ఆగస్టు 15వ తేదీలోగా చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రకటించారు. ఈ ప్రకటన అధికార పార్టీని ఇరుకున పెడుతుందని భావించిన హరీశ్​రావు.. రుణాలు మాఫీ చేయకపోతే రాజీనామా చేస్తవా? అని సవాల్ చేశారు. దీనికి స్పందించిన రేవంత్ రెడ్డి ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని, అప్పుడు రాజీనామా చేయడంతోపాటు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తవా? అంటూ హరీశ్ కు ప్రతి సవాల్‌‌ చేశారు. 

దీనికి హరీశ్‌‌రావు తగ్గేదే లేదంటూ ముందుకు వచ్చి.. రుణమాఫీతోపాటు ఆరు గ్యారంటీలు అమలు చేయాలని, అలా చేస్తే రాజీనామా చేయడంతోపాటు ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయనని గన్​పార్క్ లోని అమరువీరుల స్థూపం దగ్గర హంగామా చేశారు. దీనికి మళ్లీ రేవంత్‌‌రెడ్డి స్పందించారు. డెడ్‌‌లైన్‌‌లోపే రుణమాఫీ చేసి చూపిస్తామని ప్రకటించారు. అలా చేస్తే బీఆర్‌‌ఎస్‌‌ పార్టీని రద్దు చేస్తావా? అని ప్రశ్నించారు. 

యాదాద్రి లక్ష్మీ నర్సింహా స్వామితో పాటు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి మీద ఒట్లు వేసి మరీ పంద్రాగస్టులోగా క్రాప్ లోన్లు మాఫీ చేసి తీరుతామని రేవంత్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. రుణమాఫీపై ఎంత చర్చ జరిగితే కాంగ్రెస్‌‌కు అంత మేలు జరుగుతుందని సీఎం రేవంత్‌‌ భావిస్తున్నారు.  పంట రుణాలు మాఫీ చేయని బీఆర్‌‌ఎస్‌‌పై ఆగ్రహంగా ఉన్న రైతులు లోక్‌‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి షాక్‌‌ ఇస్తారని లెక్కలు వేసుకుంటున్నారు.