ఎన్నికల హడావుడితో గ్రామాలలోని నాయకులు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఓటర్లను ఆకర్షించడానికి విశ్వప్రయత్నాలు చేశారు. అభ్యర్థులు ఒకరిని మించి మరొకరు పోటీపడుతూ ప్రచార పర్వాన్నీ ముగించుకొని మూడు విడతలుగా ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 12,702 గ్రామ పంచాయతీలకు ప్రథమపౌరుడి నియామకాలు జరిగిపోయాయి. ఈ నెల 22న అధికారికంగా ప్రమాణ స్వీకారాలు చేసి గ్రామపాలకులుగా కొలువుదీరనున్నారు. పోటీలో ఎంతమంది అభ్యర్థులున్నప్పటికీ చివరికి గెలుపొందేది మాత్రం ఒక్కరే. కొలువుతీరాక కక్షగట్టే ధోరణితో, స్వార్ధపూరిత ఆలోచనలతో, ఖర్చుపెట్టిన డబ్బును ఎలా రాబట్టుకోవాలోనని, తమకు మద్దతివ్వనివారిపై ఏవిధంగా కక్షపూరిత చర్యలు చేపట్టాలనో గాకుండా ఆదర్శవంతమైన పాలన అందించాలి. అవినీతికి పాల్పడకుండా దాదాపు ఐదు సంవత్సరాలపాటు గ్రామాభివృద్ధికి గ్రామంలోని పలువురితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి కార్యక్రమంలో గ్రామప్రజలను భాగస్వాములుగా చేస్తూ ఎలాంటి కుల, మత, వర్గ భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూడాలి.
పథకాలపై అవగాహన పెంచుకోవాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రతి పథకంపట్ల అవగాహన పెంచుకోవాలి. ఆ పథకాలను తమగ్రామంలోని పేదలకు, ఎవరు ఏ పథకానికి అర్హులో వారికి ఆ ఫలాలను అందించేందుకు కృషి చేయాలి. గ్రామ పాలకులు గ్రామాభివృద్ధి దిశగా పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కానీ, చాలా గ్రామాలలో గెలుపొందిన అభ్యర్థులు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫలాలు వచ్చినా ముందుగా వారి పార్టీ కార్యకర్తలకు ఎలాంటి షరతులు పెట్టకుండా అధిక ప్రాధాన్యతనిస్తూ ఇప్పించడం జరుగుతున్నది. మరీ ముఖ్యంగా గ్రామాలలో ఉచిత పథకాల విషయంలో తమవర్గానికి మద్దతు ప్రకటిస్తూ వర్గపూరిత రాజకీయాలకు తెరలేపుతుంటారు. ఇది మంచి పరిణామం కాదు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే యావత్తు దేశం అభివృద్ధి చెందుతుంది. గ్రామంలోని ప్రతి ఒక్కరు వృద్ధిలోకి వస్తేనే గ్రామంసైతం అభివృద్ధి చెందుతుంది. గ్రామాభివృద్ధి అనేది గ్రామ ప్రథమ పౌరుడిపై ఆధారపడి ఉంటుంది. కావున, గ్రామ ప్రజలందరితో నిస్వార్థంతో, నిజాయితీతో వ్యవహరించాలి. ఎలాంటి పక్షపాత ధోరణి అవలంబించకుండా అర్హులందరికీ ఆసరాగా ఉంటూ అభివృద్ధికి పాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
పాలకుల ముందున్న ప్రజాసమస్యలు
గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని గ్రామాలలో నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ, ట్యాంకర్లతో నీటిని అందించడం జరిగింది. సర్పంచ్ లు సైతం ముందు జాగ్రత్తతో ప్రణాళికాయుతంగా వేసవికాలంలో మంచినీటి సమస్య లేకుండా చూసుకోవాలి. వితంతువులు, వృద్ధులు, అంగవైకల్యం కలిగినవారికి ప్రతి నెల పింఛను వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలి. ఏమైనా సాంకేతిక సమస్యలతో పేర్లు తొలగించితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. రేషన్ సరుకులు సక్రమంగా అందుతున్నాయా? ప్రతి నిరుపేదకు ఉపాధిహామీ పథకంలో చోటు ఉన్నదా? రైతు బీమా, రైతుబంధు వస్తుందా? గృహాల కల్పనలో నిరుపేదలకు స్థానమున్నదా? పాఠశాలలు సక్రమంగా నడుస్తున్నాయా? ప్రభుత్వం చేపట్టే పోలియో చుక్కల నిర్వహణ, వాక్సిన్‌కు తోడ్పాటు అందిస్తున్నారా? ప్రతి ఒక్కరి ఇంటికి మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు ఉన్నాయా? వీటన్నింటినీ చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉన్నది. రైతులకు ప్రాధాన్యమిచ్చి ప్రతి రైతుకు పంట లోన్లు, పంట నష్టపరిహారం అందేలా చూసుకోవాలి. వంద శాతం అక్షరాస్యత, పచ్చదనం, - పరిశుభ్రతకు సహకరించాలి. దేశానికి ప్రధాని ఎంతో గ్రామానికి సర్పంచ్కూడా అంతే. కాబట్టి గ్రామాభివృద్ధి సర్పంచ్ నిజాయితీ, చిత్త శుద్ధిపై ఆధారపడి ఉంటుందని మర్చిపోకూడదు!
- డా. పోలం సైదులు
