నెహ్రూ ఘనతను తెలుపుతున్న లెక్కలు

నెహ్రూ ఘనతను తెలుపుతున్న లెక్కలు

బ్రిటిష్ వారు1947లో  ఇండియాను విడిచి వెళుతూ విశాల ఇండియాను  విభజించి, పలు సమస్యల్ని వదిలేసి, స్వాతంత్ర్యాన్ని ప్రకటించి దానితో బాటు కుదేలైన వ్యవసాయ, పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య రంగాల్ని, అప్పుల భారాన్ని, ఖాళీ ఖజానాను, 24 శాతం ఆహారధాన్యాల లోటును ఇచ్చివెళ్ళారు.  1956 నుంచి దాదాపు దశాబ్ద కాలంపైగా  అమెరికా నుంచి  పీఎల్ 480 స్కీమ్ కింద మిలియన్ల టన్నుల ఆహారధాన్యాలను, ఆర్థిక సహాయాన్ని పొంది  దేశ ప్రజల్ని.. దేశ ఐక్యత,  స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడమనేది నూతన భారత్​కు  అతిపెద్ద భారంగా తయారయ్యింది.  బ్రిటిష్ వారి పాలనా కాలంలో ముఖ్యంగా 1760-1900 మధ్య భారతదేశం నుంచి 65 ట్రిలియన్ల డాలర్ల సంపద శాశ్వతంగా ఇంగ్లండ్​కు  తరలిపోయింది.   

భారత  బ్రిటిష్  ప్రభుత్వం  యుద్ధాలు,  వృధా ఖర్చులు వంటి పలు నిర్వాకాలతో 1947 నాటికి 16 బిలియన్ల రూపాయల్ని భారతీయులకు రుణపడి ఉంది. ఇక, భారత బ్రిటిష్ ప్రభుత్వం చేసిన అప్పులు 1858 నాటికి 70 మిలియన్ల పౌండ్లుగా ఉండగా 1939 నాటికి అది 884 మిలియన్ల పౌండ్లకు చేరింది.  అనగా, 1947 నాటికి ఈ సంఖ్య కనీసం 1,000 మిలియన్ల   పౌండ్లకు చేరి భారత్ నెత్తిన భారం పడింది. 1947లో  స్వాతంత్య్రంతో పాటు భారత్  పొందిన ఆదాయాన్నిచ్చే అసెట్స్ విలువ కేవలం రూ.835 కోట్లు  కాగా,  కేష్ (నగదు) బ్యాలెన్స్ పొందిన పంపక భాగం కేవలం రూ. 325 కోట్లు మాత్రమే.  ఈ కొద్దిపాటి  నగదుతో  దేశ అభివృద్ధిని, తీవ్ర ఆహార సమస్యకు  పరిష్కారాన్ని,  పేదరిక నిర్మూలనను  నెహ్రూ సాధించాల్సి ఉండగా అన్నింటా ఆయన ఘన విజయాల్నే సాధించారని చెప్పవచ్చు.

స్థిరంగా జీడీపీ

 గ్రాస్ 'నేషనల్ ప్రొడక్ట్'ను ( జీఎస్పీ/ జీడీపీ) స్థిరంగా 4 శాతంగా 1951-–1965 మధ్య నిలిచి ఉండేటట్లు నెహ్రూ చేయగలిగాడు. అనగా  బ్రిటిష్ పాలన కాలపు చివరి యాభై ఏండ్లుగా ఒక్క శాతంలోపు మాత్రమే  ఉండిన జాతీయ ఆదాయాన్ని నాలుగు రెట్లు  పెరిగేటట్టు  చేయగలిగాడు.  ఈ తలసరి ఆదాయం పెరుగుదలను దేశ జనాభా పెరుగుదల 37.3% కన్నా వేగంగా సాధించగలిగాడు. అసలు, జపాన్ తొలినాళ్ల అభివృద్ధి కాలంలో 1893–-1912 మధ్య, ఆ దేశం  సాధించిన జాతీయ ఆదాయం 4 శాతంలోపు మాత్రమే.  అనగా, స్వాతంత్య్రం సాధించిన తొలినాళ్లలో  భారత్ సాధించిన దానికన్నా జపాన్ జాతీయ ఆదాయం తక్కువగా ఉండేది.   1912 తరువాత 30 ఏండ్లు కాలంలో  కూడా జపాన్ సాధించింది 4 శాతంలోపు జాతీయ ఆదాయమే. ఆ సంఖ్యను జపాన్ దాటలేకపోయింది. కానీ, భారత్  మాత్రం నెహ్రూ తదనంతరం 25 ఏండ్లలో రాజీవ్ కాలానికి 1989 నాటికి 5.5 శాతం నుంచి 6 శాతం మధ్య జాతీయ ఆదాయం ఎదుగుదల జరిగింది.  

పారిశ్రామిక రంగం

ఇంతటి  ఘనతను  విదేశీ  ఆర్థికసహాయం అతి తక్కువగా వినియోగించుకుంటూ సాధించడం జరిగింది. నెట్ నేషనల్ ప్రొడక్ట్ (ఎన్.ఎన్.పి.) ఆఫ్  పబ్లిక్  సెక్టార్  ప్రకారం 1951-–52లో 0.86శాతం, 1956–-57లో 1.05 శాతం, 1957-–58లో 2.37 శాతం, 1960–61లో 2.86శాతం మాత్రమే విదేశీ ఆర్థిక సహాయం వాడుకోవడం జరిగింది.  ఈ సహాయం తొలి ప్రణాళికా కాలంలో 71 శాతం గోధుమల దిగుమతికి వాడుకోగా, రెండు, మూడు ప్రణాళికల కాలంలో ఇనుము, ఉక్కు, పరిశ్రమలు, రవాణా, కరెంటు, కమ్యూనికేషన్స్​ అభివృద్ధికి వాడటం జరిగింది.  ప్రభుత్వపు  ఆర్థికలోటు జీడీపీలో 3.8 శాతానికి తగ్గేట్టు 1969–70 నాటికే  సాధించడం జరిగింది. 1963 వరకు ధరల పెరుగుదల ప్రతి ఏడాది 2శాతంలోపే  ఉండేటట్టు చర్యలు తీసుకోవడమైనది. 1951– 1965 మధ్య పారిశ్రామిక రంగంలో 7.8 శాతం సాధించి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేటట్టు చేయడమైనది. బేసిక్​ గూడ్స్, క్యాపిటల్​ ఎక్విప్​మెంట్​లకు విదేశాలపై ఆధారపడటాన్ని 1950లో 89.8 శాతం ఉండగా 1960 నాటికి 4శాతానికి తగ్గేట్టు 
చేయడమైనది. 

 వ్యవసాయ రంగం

 వ్యవసాయ రంగంలో 1950-–65 మధ్య  ప్రతి  ఏడాది 3 శాతం పెరుగుదల జరిగింది. ఇది 1965 నాటికి గత 50 సంవత్సరాల  బ్రిటిష్ కాలంనాటి స్థాయికన్నా 7.5 రెట్లు పెరుగుదలగా ఉండేది. అంతేగాక, చైనా, జపాన్​లో కన్నా ఎక్కువగా ఎదుగుదల ఉండేది.   దేశంలో ఆహార ధాన్యాల లభ్యత పెరుగుదల 'గ్రీన్​ రెవెల్యూషన్' కారణంగా 1966లో 73.5 మిలియన్ టన్నుల నుంచి 1970కి 89.5 మిలియన్ టన్నులకు, 1978కి 110.25 మిలియన్ టన్నులకు, 1984కు 128.8  మిలియన్  టన్నులకు పెరిగి 1980ల మధ్య కాలానికి దేశంలో  ఆహార  ధాన్యాల  నిల్వలు 30 మిలియన్ టన్నులకు చేరి  పి.ఎల్.480  కిందగాని,  ఇతరత్రాగాని  ఆహార  ధాన్యాల  దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.  దేశం ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధిని సాధించగలిగింది.  దీంతో  1966లో 10.3 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల దిగుమతి 1970 కే  3.6 మిలియన్ టన్నులకు  పడిపోయింది.  1980లలో  ఆ అవసరమే లేకుండా పోయింది. అంతేకాక 1940ల నాటికి దేశంలో 70 శాతం భూమి, భూస్వాముల చేతుల్లో ఉండగా భూసంస్కరణల ద్వారా భూమిలేని కోట్లాది మందికి భూలభ్యత కల్పించి భూసంస్కరణల్లో నాటి చైనా, జపాన్, కొరియా, తైవాన్,  బ్రిటన్ వంటి దేశాలకన్నా ముందడుగులో భారత్ నిలిచేటట్లు చేయడం జరిగింది.

ఇన్​ఫ్రాస్ట్రక్చర్, వైద్య రంగం

ఇన్​ఫ్రాస్ట్రక్చర్,  వైద్యరంగంలోనూ 1950-–51 నుంచి 1965-–66 మధ్య గణనీయమైన అభివృద్ధి జరిగింది. ఉదాహరణకు  విద్యుత్ స్థాపిత సామర్థ్యం  393.5 శాతం, అనగా 4.5 రెట్లు అభివృద్ధి.  నగరాలు, -గ్రామాలు విద్యుదీకరణ 1,313.5 శాతం.  అనగా 14 రెట్లు పెరుగుదల,  రైల్వే సరకుల రవాణా 120.4 శాతం పెరుగుదల, రోడ్లు 82 శాతం పెరుగుదల, ఆసుపత్రుల్లో పడకలు 165.5 శాతం. అనగా 2.5 రెట్లు పెరుగుదల  జరిగింది. 

విద్యారంగం

విద్యారంగంలో అమెరికాలోని ఎం.ఐ.టి (మెసాచొసెట్స్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) తరహాలో 1952లోనే మొదటి ఐ.ఐ.టి.ని  ఖరగ్​పూర్​లో,  ఆ తరువాత మద్రాసు, బాంబే, కాన్పూర్,  ఢిల్లీలలోను  ఏర్పరచి అత్యున్నత మానవ వనరులు సృష్టించి త్వరిత ఆర్థికాభివృద్ధికి ప్రయత్నించడం జరిగింది. అలాగే, ఐ.ఐ.ఎం., ఐ.ఐ.ఎన్.సి, ఆర్.ఇ.సి, ఎన్.ఐ.టి.లు వంటివి కూడా తరువాత  స్థాపించడమైనది.  ఆగస్టు 1947 నాటికి 300,000 మంది విద్యార్థుల్ని కలిగి ఉన్న18 విశ్వవిద్యాలయాల సంఖ్యను 1964 నాటికి 54కు  పెరిగేటట్లు చేయడం జరిగింది. అదే ఏడాదికి కాలేజీల సఖ్య 2,500 పెరిగింది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్, విద్యార్థులు 613,000 ఉండేవారు.  విద్యపై 1952-–53లో ఖర్చు 198 మిలియన్ల రూపాయలు కాగా 1964–-65 నాటికి 1462.7 మిలియన్ల రూపాయలకు పెంచడం జరిగింది. అనగా 7 రెట్లు పెరిగింది. అలాగే శాస్త్రపరిశోధనలు, వాటి అనుబంధ కార్యకలాపాలపై ఖర్చు 1948–-49లో రూ. 1.10 కోట్లు  ఉండగా 1965–-66 నాటికి రూ. 85.06 కోట్లకు పెంచడం జరిగింది.
1939 నాటికి 7 ఇంజినీరింగ్ కాలేజీలు, అందులో 2,217 మంది విద్యార్థులు ఉండగా, వాటి సంఖ్య పెరిగి వాటిలో 1950 నాటికి 13,000 మంది, 1965 నాటికి 78,000 మంది విద్యార్థులు చదువుకొనేవారు.  దేశ సమస్యలకు పరిష్కారాలు చూపగలిగేది  శాస్త్ర  పరిశోధనలు, సాంకేతిక విద్యలే అని  నెహ్రూ గాఢంగా భావించేవారు.  పలు పరిశోధనలకు 17 జాతీయస్థాయి  లేబొరేటరీలను  స్థాపించడంతోపాటు ‘కౌన్సిల్​ ఆఫ్​ సైంటిఫిక్​ అండ్​ ఇండస్ట్రియల్​ రీసెర్చ్’ సంస్థకు తానే చైర్మన్​గా వ్యవహరించేవారు. 1948 ఆగస్టులో  అటామిక్​  ఎనర్జీ  కమిషన్​ను  ఏర్పరచి దానికి సైంటిఫిక్​ రీసెర్చ్​ డిపార్ట్​మెంట్​కు  చైర్మన్​గా న్యూక్లియర్​ సైంటిస్ట్​ హోమి జె బాబాను నియమించారు. 1956  ఆగస్టులో  ఆసియాలోనే మొదటి న్యూక్లియర్​ రియాక్టర్​ను బాంబే వద్ద గల ట్రాంబేలో ఆరంభించారు.  1962లో ఇండియన్​ నేషనల్​ కమిటీ ఫర్​ స్సేస్​ రీసెర్చ్​ సంస్థలు ఏర్పరిచారు. తుంబ వద్ద రాకెట్​ లాంచింగ్​ ఫెసిలిటీని నెహ్రూ ఏర్పాటు చేశారు. 15 ఏండ్ల తన పాలనలో ఎన్నో ఘనతలను సాధించి దేశాన్ని ప్రగతిపథంలో నడిపిన నెహ్రూ అడుగుజాడల్లో నడిచి మన  ప్రగతిని మనం సాధించుకోవాలి.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- డా. దేవిరెడ్డి 
సుబ్రమణ్యం రెడ్డి,
రిటైర్డ్ ప్రొఫెసర్, చరిత్ర శాఖ, 
ఎస్వీ యూనివర్సిటీ