వెలుగు ఓపెన్ పేజీ: గాంధీ స్థానంలో సావర్కర్ వస్తుండు

వెలుగు ఓపెన్ పేజీ:  గాంధీ స్థానంలో  సావర్కర్ వస్తుండు

ఈ మధ్యకాలంలో మహాత్మాగాంధీ ఎంప్లాయ్​మెంట్​ గ్యారంటీ స్కీము నుంచి గాంధీ పేరు తీసేసి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్లు పాస్​ చేసింది. అంతేకాకుండా గాంధీ బొమ్మను రూ.500 నోటుపై నుంచి తీసివేయాలని రిజర్వు బ్యాంకుకు సూచించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ నిర్ణయం మామూలుగానైతే మోదీ, అమిత్​షాకి అంగీకారయోగ్యమైన నిర్ణయం కాదు. గుజరాతీ బనియా పునాదుల నుంచి వచ్చిన ఆ ఇరువురికి గాంధీ పేరును తీసేయడం అంత ఇష్టమైన పనికాదు. ఇది సావర్కర్​ సిద్ధాంతాన్ని బలంగా అమలుచేయాలనే ఆలోచనలో భాగంగా ఆర్​ఎస్​ఎస్​ కేంద్రం చేత చేయిస్తున్న పని. గాంధీని బదులు దేశ ఐక్యతను కాపాడిన శూద్ర నాయకుడు సర్దార్​ వల్లబాయ్​ పటేల్​ బొమ్మను నోట్ల మీదికి తెస్తారా,  లేదా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్​ బొమ్మను తెస్తారా అంటే అందుకు అవకాశమే లేదు. 

లార్జర్​ ప్లాను ప్రకారం మునుముందు చాలా రంగాల్లో సావర్కర్, హెగ్డేవార్, గోల్​వాల్కర్​ తెరమీదికి వచ్చే ప్లాను కనిపిస్తోంది. ఈ ముగ్గురు మహారాష్ట్రకు చెందిన బ్రాహ్మణ మేధావులు. విశ్వ హిందూ పరిషత్​నూ, ఆర్​ఎస్ఎస్​ను స్థాపించిన సనాతన ధర్మవాదులు. ముగ్గురికి వర్ణధర్మం, కుల వ్యవస్థ రక్షణ,  వేద,  కౌటిల్యుని అర్థశాస్త్రం,  మను ధర్మశాస్త్రాలను తిరిగి ఆధిక్యతలోకి తేవాలని నమ్మిన ఆధునిక కౌటిల్యులు.  వారి సిద్ధాంతాన్ని శూద్రులు, ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు అర్థం చేసుకోవాలంటే సావర్కర్​ మౌలిక సిద్ధాంత పుస్తకం ‘హిందూత్వ’ను చాలా సీరియస్​గా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. 

హిందూత్వ పుస్తకం ఏం చెబుతోంది?

ఈ పుసక్తం 1923లో రాయడమైనది. ఇది ఒకరకంగా మహాత్మా గాంధీ 1909లో రాసిన ‘హింద్​ స్వరాజ్’కు సమాధానం. హింద్​ స్వరాజ్​ గాంధీ తన తత్వ చింతన గురించి చెబుతూ రాసిందైతే,  సావర్కర్​ దానికి భిన్నమైన తన తత్వ చింతన ఏమిటో ఈ పుస్తకంలో రాశాడు. ఈ ఇద్దరి తత్వ చింతనకు భిన్నమైన భారతీయ తత్వ చింతనను అంబేద్కర్​ తన కుల నిర్మూలన పుస్తకం 1936లో   రాశాడు. ఈ మూడింటికి భిన్నమైన తత్వచింతనను నెహ్రూ 1944లో డిస్కవరీ ఆఫ్ ఇండియాలో రాశాడు. ఈ నలుగురు తమ తమ దృష్టిలో ఇండియా గతం భవిష్యత్​ ఎలా ఉండాలో రాశారు. దురదృష్టవశాత్తు  సర్దార్​ పటేల్​  వీరితో సమానశక్తి కలిగిన శూద్ర నాయకుడు ఏమీ రాయలేదు. అందుకే ఈ దేశ నిర్మాణాన్ని ఉత్పత్తి ద్వారా,  సైన్స్,  టెక్నాలజీ ద్వారా నిర్మించి అతిపెద్ద మానవశక్తి  స్వీయ ఆలోచన లేక దెబ్బతింటున్నది. శూద్రుల్లో  ఫిలాసఫీ కరువైంది.  సావర్కర్​ తన పుస్తకంలో ఈ దేశం పేరు ఏం ఉండాలనే అంశాన్ని ముందుగా సుదీర్ఘంగా చర్చించి ఆ తరువాత బుద్ధిజానికి, హిందూయిజానికి ఉన్న  వైరుధ్యాన్ని చర్చించాడు. చివరిగా చాలా ఎక్కువ పేజీల్లో  హిందూయిజానికి, హిందూత్వకు ఉన్న తేడా చెప్పి తన హిందూత్వ ఐడియాలజీని వివరించాడు. ఆయన రచనకు ఆధారాలు నాలుగు వేదాలు.  మను ధర్మశాస్త్రం, కౌటిల్యుని, అర్థశాస్త్రాన్ని అందరిలాగే ఆయన కూడా పట్టించుకోలేదు. కానీ, కౌటిల్యుని ఫిలాసఫీ ఆధునిక దశకు అనువదించి చెప్పాడు. ఇది చాలామంది గమనించలేదు. 

దేశం పేరు

సావర్కర్​ ఇండియాకు  ప్రాచీన దశ నుంచి ‘సింధుస్థాన్,  హిందుస్థాన్’ అనే రెండు పేర్లు ఉన్నాయి అన్నారు. అందుకు కారణం సంస్కృతంలో ‘ఎస్.హెచ్’ రెండూ ఒకే అర్థంలో వాడడం ఉంది అంటాడు. భారత్​ అనే పేరు  భరతుని పేరు నుంచి వచ్చినా ఆయన దానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. హిందూస్థాన్​అనేది ముస్లింలు వచ్చేనాటికీ ఉన్నదని ఆయన వాదన. 10వ శతాబ్దంలో  అల్బరూనీ రాసిన ‘ఆల్​హింద్’ పుస్తకాన్ని ఆయన ఎక్కడా ఉటంకించలేదు. ఆర్యవర్త అనే పేరు కేవలం వింధ్య పర్వతాలు నార్త్​ భాగానికే వర్తిస్తుంది కనుక దాని అవసరం లేదన్నాడు.  అయితే,  సిందుస్థాన్​ అనే పేరు సింధూనది ఇవతలి భాగం నుంచి సౌత్, ఈస్ట్​లో ఉన్న సముద్రాల వరకు ఉన్న భూభాగానికి వర్తిస్తుంది అని ఆయన చెప్పారు. అయితే, నార్త్ ఈస్ట్ ను​  ఇండియాలో భాగంగా  గుర్తించాడా లేదా స్పష్టత లేదు.  చైనాను  మాత్రం హిందూస్థాన్​  వ్యతిరేక బుద్ధిస్టు దేశమని తేల్చాడు. చివరిగా ఆయన ఈ దేశానికి హిందూస్థాన్​ అనే పేరుపై స్థిరపడ్డాడు. అయితే, ఆయన పుస్తకం చాలా వైరుధ్యాలతో ఇంగ్లిషులో రాశాడు.  ఏ వాదనకూ లాజికల్​ ఎండ్​కు తీసుకుపోలేదు.  ఒక్క ముస్లిం సమస్యమీద తప్ప. 

సావర్కర్​ తాత్విక పునాది వేదాలు

సావర్కర్​ వాదనలన్నీ వేదాలు,  మనుధర్మంపై ఆధారపడి  చేసినవి. హిందూయిజం అనేది వైదిక మతానికి మరో పేరని సావర్కర్​ నిర్ధారిస్తాడు. స్వాతంత్ర్యం అనంతరం భారతదేశ వ్యవస్థ  వర్ణధర్మంపై  నడవాలనేది ఆయన వాదన. ఆయన వర్ణవ్యవస్థలో శూద్రుల స్థానం ఎలా ఉండాలి, ఉత్పత్తికి, వ్యవసాయానికి, సాంకేతిక పరిజ్ఞానానికి ఆయన కోరుకునే వ్యవస్థలో  మార్పు ఎలా ఉంటుందో  ఎక్కడా చెప్పలేదు.  ముస్లింలు తప్ప అందరూ హిందువులే అనేది సావర్కర్​ వాదనే. దాన్నే ఇప్పుడు మోహన్​ భాగవత్​ వల్లె వేస్తున్నాడు. దళితులు ఆయన వ్యవస్థలో ఎక్కడ ఉంటారో  చర్చలేదు. అంటరానితనాన్ని హిందూయిజం భవిష్యత్తులో ఎలా ట్రీట్​ చేస్తుందో అసలు చర్చలేదు. అసలు దళితులు ఆయన దృష్టిలో అంటరానివారు. స్వాతంత్ర్యం తరువాత ఏ స్థితిలో ఉండాలో చర్చలేదు. శూద్రుల స్థానం హిందూ 
దేవాలయాల్లో, ఆస్తిపాస్తుల్లో ఏ స్థితి కలిగి ఉంటారో చర్చలేదు.   కానీ,  హిందూయిజంపై ప్రపంచంలోని అన్ని  మతాల కంటే ఎంత గొప్పదో,  వేదాలు ఎంత గొప్పవో చాలా చర్చించాడు. ఆయన పురుషసూక్త సిద్ధాంతాన్ని ధిక్కరించలేదు. చాలా తెలివిగా సమర్థించాడు. 

గాంధీ హిందూయిజం

గాంధీ హిందూయిజం సావర్కర్​ హిందూయిజం కంటే భిన్నమైనదిగా కనిపిస్తుంది. ఆయన వేదాలను ఒప్పుకుంటాడు. వర్ణ వ్యవస్థ ఉండాలంటాడు. కానీ, అంటరానితనం పోవాలని కచ్చితంగా వాదిస్తాడు. అందుకోసం కొన్ని ఉద్యమాలు చేశాడని మనకు తెలుసు.  గాంధీ ఒక బనియా కుటుంబం నుంచి వచ్చాడు. సావర్కర్​ సనాతన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చాడు. ఇద్దరూ ఇంగ్లండులో ఇంగ్లిషు భాషలోనే  చదువుకున్నారు. ఇద్దరూ హింస, అహింస సిద్ధాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకించుకున్నారు. గాంధీ ‘హింద్​స్వరాజ్’ అహింసాయుత  పోరాటాన్ని ప్రతిపాదించాడు. ముస్లింను పోరాటంలో కలుపుకుపోవాలన్నది ఆయన వాదన.  సావర్కర్​  పోరాటం ధీరోచితంగా,  హింసాయుతంగా ఉండాలని  వాదించాడు. కానీ, ముస్లింలతో ఐక్యంగా ఉండటాన్ని ఆయన వ్యతిరేకించాడు. అయితే,  సావర్కర్​   రచనలో ముస్లిం వ్యతిరేకత ఎంత బలంగా కనిపిస్తుందో వర్ణధర్మ రక్షణ (కులవ్యవస్థ రక్షణ) కూడా అంతే బలంగా కనిపిస్తుంది. 

సావర్కర్​ హిందూత్వ సారాంశం

సావర్కర్​ హిందూత్వం మతం కాదంటాడు. అది ఒక జాతి అని చెబుతూనే ముస్లింలు మాత్రం అందులో భాగం కాదంటూనే.. హిందూస్థాన్​లో ఉన్నవారంతా మాతృభూమిని పూజించాలంటాడు. ఇక్కడే ఆయన మత తగువు  పెడుతున్నాడు.  సింధూనది అవతలివారిని పాకిస్థాన్​ విడిపోకముందు కూడా ఆయన హిందూస్థాన్​లో భాగంగా దాన్ని చూడలేదు.  సింధూనది ఈ దేశ బార్డర్​ అన్నాడు. ఈ వాదన  ఆర్​ఎస్​ఎస్  అఖండ భారత్​ వాదనకు భిన్నమైంది. అయినా ఇప్పటి బీజేపీగాని, ఆర్​ఎస్​ఎస్​గాని  సావర్కరే  పునాది  సిద్ధాంతకర్తగా భావిస్తాడు. గత పదకొండు ఏండ్లుగా గాంధీని, సర్దార్​పటేల్​ను, అంబేద్కర్​ను మేం బాగా గుర్తిస్తున్నాం అంటూనే, గాంధీని జాతిపితగా గుర్తిస్తున్నాం అంటూనే, ఆయన పేరును క్రమంగా తొలగించడం మొదలైంది. ఇక క్రమంగా వారు తెరమీదికొచ్చే కీలక జాతిపిత 
సావర్కర్​ మాత్రమే.  అయితే ఇక్కడ  కీలకమైన  విషయం సావర్కర్​ తాత్విక పునాదిగా ఆర్​ఎస్​ఎస్, బీజేపీలు దేశాన్ని పరిసాలిస్తే ఆ పార్టీ,  సంఘంలో ఉన్న శూద్ర,  దళిత, ఆదివాసీలు తమ భవిష్యత్ ఏంటి అని ఆలోచించాలి. సావర్కర్​ సంస్కృతం, హిందీ భాషలు మాత్రమే వేద పునాది కలిగిన భాషలని తేల్చి చెబుతాడు. హిందీని ఆయన ప్రాకృత భాష అని కూడా అంటాడు. కానీ, ఆయన పుస్తకంలో శ్రమకు,  పంటలకు, పశుకాపరికానికి ఎక్కడా గుర్తింపు కనిపించదు. వేద పునాదిగల  దేవతలు, రుషులు, రాజుల గురించి పొగడ్తలతో కూడిన ప్రస్తావన ఉంది. కానీ, శూద్రులు, దళితులు, ఆదివాసులు ఈ దేశంలో బతికి ఉన్నట్టు కూడా ఆయన గుర్తించలేదు. వారు ఏ పార్టీలో ఉన్నా శూద్రులు, దళితులు, ఆదివాసులు గుర్తించాల్సిందేమంటే వారు వారి జాతిపిత సిద్ధాంత ఉనికిలో లేనప్పుడు వారికి భవిష్యత్​ ఎలా ఉంటుంది? ఇక్కడ అంబేద్కర్​ మన జీవితాల్లోకి తొంగి చూస్తాడు. అందరినీ చదవండి తప్పులేదు. కానీ, తేల్చుకోండి. ఎవరు ఎటో.

అంబేద్కర్​– సావర్కర్​

ఈ ఇద్దరి తాత్వికతను పోలుస్తూ ఎవరూ రచనలు చేయలేదు. అంబేద్కర్​ కుల నిర్మూలన, శూద్రులంటే ఎవరు? పుస్తకాలలోని వాదనలు సావర్కర్​  పుస్తకంలోని ప్రతి లైను వ్యతిరేకించే స్వభావంతో ఉంటాయి.  వేదాలు పునాదిని,  వర్ణవ్యవస్థ లక్షణాలను అంబేద్కర్​ కుల నిర్మూలన, దేశ నిర్మాణం, అభివృద్ధికి అడ్డుపడేవని చర్చించాడు. సావర్కర్​  బుద్ధుడిని  గౌరవిస్తాను అని చెప్పినా బుద్ధిజాన్ని సమూలంగా వ్యతిరేకించాడు. సిక్కిజాన్ని పొగిడాడు. వారి తల్వార్​ పోరాటాన్ని గొప్పదిగా చూపించాడు. 

- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్​