శివ్వంపేట, వెలుగు : గుళ్లలోకి సాయంత్రం భక్తుడిగా వచ్చిన వ్యక్తి అదే రోజు రాత్రి దొంగగా వచ్చి చోరీకి పాల్పడిన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరులోని సాయిబాబా, దత్తాత్రేయ ఆలయాల్లో గురువారం రాత్రి జరిగింది.
పోలీసులు, ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరులోని సాయిబాబా, దత్తాత్రేయ ఆలయాల్లో గురువారం సాయంత్రం భక్తుడిలా ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకున్న గుర్తుతెలియని వ్యక్తి అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో మళ్లీ వచ్చి రెండు ఆలయాల తాళాలు పగలగొట్టి, సీసీ కెమెరా బాక్సును ఆఫ్ చేసి హుండీలోని నగదును ఎత్తుకెళ్లాడు.
ఇది సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది. ఏడాది కాలంగా హుండీ లెక్కించకపోవడంతో అందులో దాదాపు రూ.3 లక్షల నగదు ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలుపారు. ఆలయ ఇన్చార్జి సత్యనారాయణ గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
