న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) ఆర్థికంగా స్టేబుల్‌గా ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటి మొత్తం లాభం రూ.2 లక్షల కోట్లను దాటుతుందని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ ఎం. నాగరాజు తెలిపారు. పీఎస్‌బీలు ఇచ్చిన అప్పుల (క్రెడిట్) వృద్ధి 12శాతం, డిపాజిట్ వృద్ధి 10శాతంగా ఉందని అన్నారు.
వీటి మొత్తం లాభం 2022–23లో లాభం రూ.1.05 లక్షల కోట్లుగా, 2023–24లో రూ.1.41 లక్షల కోట్లుగా, 2024–25లో రూ.1.78 లక్షల కోట్లుగా నమోదైంది. కిందటేడాది సెప్టెంబర్ నాటికి ప్రభుత్వ బ్యాంకుల గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్‌పీఏ) రేషియో 2.30శాతంగా, నెట్ ఎన్‌పీఏ రేషియో 3శాతంగా ఉంది. ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో 94.63శాతానికి, క్యాపిటల్ అడెక్వసీ రేషియో 15.96శాతానికి మెరుగుపడింది. 2024–25లో పీఎస్‌బీలు రూ.34,990 కోట్ల డివిడెండ్ ప్రకటించగా, అందులో రూ.22,699 కోట్లు కేంద్రానికి వెళ్లాయి. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో వాటాలను విక్రయించి రూ.2,627.52 కోట్లను, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ నుంచి రూ.1,419.36 కోట్లను ప్రభుత్వం సమీకరించింది. మరోవైపు పీఎస్‌బీలలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎఫ్‌డీఐ) పరిమితిని ప్రస్తుతం ఉన్న 20శాతం నుంచి 49శాతానికి పెంచే ఆలోచనలో కేంద్రం ఉందని నాగరాజు తెలిపారు. ప్రైవేట్ బ్యాంకుల్లో ఎఫ్‌డీఐ 74శాతం వరకు ఉందని అన్నారు. ఈ మార్పు ద్వారా ప్రభుత్వ బ్యాంకుల క్యాపిటల్ పరిస్థితులు మరింత బలపడతాయని అభిప్రాయపడ్డారు.
