కలెక్టరేట్లలో మొదలు కాని ధరణి హెల్ప్‌‌డెస్క్‌‌లు

కలెక్టరేట్లలో మొదలు కాని ధరణి హెల్ప్‌‌డెస్క్‌‌లు
  • ధరణిపై సబ్ కమిటీ సమావేశమైనప్పుడల్లా ఇదే పరిస్థితి
  • మొన్నటి భేటీ వాయిదాకు కారణమిదే

హైదరాబాద్, వెలుగు: ధరణిపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీకి.. పోర్టల్‌‌లో పాత సమస్యలు పరిష్కరించకముందే కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. మొదటిసారి సమావేశమైనప్పుడే సుమారు 20 రకాల సమస్యలు సబ్ కమిటీ దృష్టికి రాగా.. రెండో సమావేశంలో మరో పది రకాల కొత్త సమస్యలు వచ్చినట్లు తెలిసింది. ఇలా భేటీ అయినప్పుడల్లా కొత్త సమస్యలు తెరపైకి వస్తుండడంతో పాత వాటికి పరిష్కారం చూపాకే కొత్త ఇష్యూస్ పై దృష్టి పెట్టాలని సబ్ కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నెల 25న జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు సమాచారం.

మాడ్యూల్స్‌‌పై కొనసాగుతున్న కసరత్తు
ధరణి పోర్టల్‌‌లో కొత్తగా ఇవ్వాల్సిన 18 రకాల ఆప్షన్లను వివరిస్తూ కలెక్టర్ల నుంచి తెప్పించుకున్న నివేదికపై సబ్ కమిటీ ఇటీవల చర్చించింది. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) ప్రతినిధులు మరో 12 రకాల సమస్యలను సబ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ రిపోర్టుల ఆధారంగా పోర్టల్‌‌లో మార్పులు చేయాలని, సమస్యల పరిష్కారానికి కలెక్టర్లకు ఆప్షన్స్ ఇవ్వాలని సబ్ కమిటీ సిఫార్సు చేసింది. అగ్రికల్చర్ భూములు నాన్ అగ్రికల్చర్ భూములుగా మారడం, అసైన్డ్ భూములకు డిజిటల్ సైన్ కాక పాస్ బుక్స్ జారీ కాకపోవడం, భూసేకరణలో సేకరించిన భూమి కంటే ఎక్కువగా నమోదు కావడం, ఆర్ఎస్ఆర్ విస్తీర్ణంలో తేడా వల్ల భూమి ఉన్నా కొందరికి పాస్ బుక్స్ జారీ కాకపోవడం, వ్యవసాయ భూములు కొనుగోలు చేసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి పేర్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదు (మ్యుటేషన్) కాకపోవడం వంటి సమస్యల పరిష్కారానికి ధరణిలో ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. తమ దృష్టికి వచ్చిన సమస్యలపై మాడ్యుల్స్ రూపొందించాకే సబ్ కమిటీ మరోసారి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

సబ్‌‌ కమిటీ ఆదేశాలు అమలైతలే
అన్ని జిల్లాల కలెక్టరేట్లలో హెల్ప్ డెస్క్‌‌లను ఏర్పాటు చేయాలని ఈనెల 17న జరిగిన సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. ప్రజలకు అవగాహన కల్పించడం, అప్లికేషన్లు అప్ లోడ్ చేసేందుకు  మీ సేవా కేంద్రాల్లా పని చేయడానికి ఏర్పాట్లు చేయాలని సూచించినా.. ఇప్పటిదాకా ఏ కలెక్టరేట్‌‌లోనూ హెల్ప్ డెస్క్‌‌  ఏర్పాటు చేయలేదు. ధరణి పోర్టల్, మాడ్యూల్స్, ఆప్షన్స్‌‌పై అధికారులు, మీ సేవ ఆపరేటర్లకు జిల్లా స్థాయిలో ఒక రోజు ట్రైనింగ్ ఇవ్వాలని సబ్ కమిటీ సూచన ఏ జిల్లాలోనూ అమలు కాలేదు.