ధరణి వచ్చినా లంచాలు తప్పట్లే!

ధరణి వచ్చినా లంచాలు తప్పట్లే!
  • మ్యుటేషన్​కు ఎకరాకు ఇంత చొప్పున వసూళ్లు
  • 4 నెలల కిందటే సర్కారుకు ఇంటెలిజెన్స్ ​రిపోర్ట్
  • అయినా చర్యలు తీసుకోని రాష్ట్ర సర్కార్​

హైదరాబాద్, వెలుగు: ధరణి వచ్చినా రైతులకు లంచాల బెడద తప్పడం లేదు. అగ్రికల్చర్​భూములకు తహసీల్దార్​ఆఫీసుల్లో ముడుపులు ముడితేనే పనులు చకచకా పూర్తవుతున్నాయి. రిజిస్ర్టేషన్ ​పెట్టుకుంటే చాలు.. స్లాట్ ​బుకింగ్ ​దగ్గర నుంచే వసూళ్ల పర్వం మొదలవుతోంది. పలాన దగ్గరకు వెళ్లి స్లాట్ బుక్ ​చేసుకోండి.. రేటు చెప్తరు రిజిస్ర్టేషన్​ఈజీగా కంప్లీట్ ​అయిపోతుందని చెబుతూ కొందరు సిబ్బంది రైతుల నుంచి పైసలు తీసుకుంటున్నరు. సర్కారుకు దీనిపై ఫిర్యాదులు అందుతున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. స్లాట్​బుకింగ్ మొదలు ధరణిలో రిజిస్ర్టేషన్ పూర్తయ్యే వరకు సిబ్బంది ఒక ఎకరాకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భూముల విలువ ఎక్కువ ఉన్నచోట మ్యుటేషన్​ పూర్తి చేసుకునేందుకు రూ.15 వేల వరకు తీసుకుంటున్నరు. ధరణి నిర్వహణ చూసేది ప్రైవేట్ ఆపరేటర్లు కావడంతో రెవెన్యూ సిబ్బంది వారి ద్వారానే వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఉన్నతాధికారులు చెప్తున్నరు. ధరణి రిజిస్ర్టేషన్లపై రైతులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవడంతోనే ఈ తతంగం సాగుతోందని దాదాపు 80% మండలాల్లో పరిస్థితి ఇలాగే ఉందని 4 నెలల కిందటే ఇంటెలిజెన్స్​ రిపోర్ట్​వచ్చిందని సెక్రటేరియేట్​ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు తెలిపారు. ఇప్పటికే కొంతమంది ఏసీబీకి పట్టుబడ్డారని, త్వరలో దీనిపై విజిలెన్స్ ​ఎంక్వైరీ చేపట్టే చాన్స్​ ఉందని ఆయన చెప్పారు. 
 

అక్కడ అలా.. ఇక్కడ ఇలా
‘‘కొత్తగా జరిగే భూమి క్రయ విక్రయాల నమోదు 15 నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఒక్క పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు”అని ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌ ప్రారంభం  సందర్భంగా సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. అయితే క్షేత్రస్థాయిలో 15 నిమిషాల్లో పని పూర్తి కావాలంటే పైసలు ఇచ్చుకోక తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. అగ్రికల్చర్ ​భూములకు స్లాట్ ​బుక్​ చేసుకున్న దాని ప్రకారం ప్రతి రోజు ఏ సమయానికి ఎవరెవరి రిజిస్ర్టేషన్లు ఉన్నాయో.. ధరణి ఆపరేటర్​కు  తెలిసిపోతుంది. దీంతో వారు రిజిస్ర్టేషన్​ ప్రక్రియ మొదలు పెట్టక ముందే వారితో సంప్రదింపులు జరుపుతున్నరు. ఇక్కడ ఎకరాకు రూ.3 వేల దాకా వసూలు చేస్తున్నరు. రెవెన్యూ సిబ్బంది ప్రైవేట్​గా రిక్రూటైన ధరణి ఆపరేటర్ల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఏదైనా మ్యుటేషన్​ ఆపాలన్నా, ఎలాంటి ఆబ్జక్షన్​లేకుండా పూర్తి చేయాలన్నా ఎంతో కొంత ఇచ్చుకుంటేనే పని పూర్తయ్యే పరిస్థితి నెలకొంది. నాన్​అగ్రికల్చర్​కు వస్తే  సబ్​ రిజిస్ర్టార్​ఆఫీసుల్లో వక్ఫ్‌‌‌‌‌‌‌‌, దేవాదాయ, పీవోటీ భూముల్లోని ప్లాట్లకూ రిజిస్ర్టేషన్లు చేస్తున్నరు. ఆటోలాక్ ​అని సర్కార్ ​చెప్పినప్పటికీ కాగితాల్లో పేర్లు మారుతూనే ఉన్నయి.  అక్రమ లే అవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేయొద్దని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. అయినా రియల్​ భూమ్​ కొన్ని జిల్లాల్లో అక్రమ లే అవుట్లలోని ప్లాట్లతో పాటు బ్యాన్​ఉన్న ఫామ్ ల్యాండ్స్‌‌‌‌‌‌‌‌ను కూడా రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేసేస్తున్నట్లు ఐదారు నెలల కిందటే సర్కార్​ దృష్టికి వచ్చింది. అయినా ఎలాంటి చర్యలు మొదలు కాలేదు. ఔట్​సోర్సింగ్ ​ఉద్యోగులు, డాక్యుమెంట్​ రైటర్లు ముడుపులకు కీలకంగా మారినట్లు తెలుస్తోంది. 

స్లాట్​ బుక్​ చేసుకున్నప్పటి నుంచే
ప్రతి మండల రెవెన్యూ ఆఫీస్​లోని ఇద్దరు, ముగ్గురు సిబ్బంది వారికి సంబంధించిన వ్యక్తుల కంప్యూటర్ సెంటర్లలోనే స్లాట్ బుక్ చేసేలా ప్లాన్​ చేస్తున్నరు. అక్కడ రిజిస్ర్టేషన్​కు కట్టాల్సిన డబ్బులతో పాటు కేవలం స్లాట్ బుక్ ​చేసినందుకే రూ.1,500 నుంచి రూ.2 వేల దాకా వసూలు చేస్తున్నరు. తమ దగ్గర స్లాట్​ బుక్​ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా పని పూర్తవుతుందని చెబుతుండటంతో రైతులు అక్కడికే వెళ్తున్నారు. ఈ వసూళ్లలో ఎమ్మార్వో ఆఫీసుల్లో పనిచేస్తున్న వారికి కూడా డబ్బులు అందుతున్నట్లు గుర్తించినట్లు ఇంటెలిజెన్స్​ ఆఫీసర్​ ఒకరు వివరించారు. 

ధరణి నిర్వహణ ప్రైవేట్ ​ఆపరేటర్ల చేతిలో
ధరణి ఆపరేటర్లు అంతా ప్రైవేట్​గా రిక్రూట్​కావడంతో వారితోనే వసూళ్ల దందా నడుస్తోంది. ధరణి రాకంటే ముందే ఒక ప్రైవేట్​కంపెనీ ద్వారా రిక్రూట్ అయిన వారిని ఐఎల్ఆర్ఎమ్ (ఇంటిగ్రేటెడ్​ ల్యాండ్​ రికార్డ్స్​ మేనేజ్​మెంట్​ సిస్టమ్) కోసం తీసుకున్నరు. అప్పటి వరకు కాగితాల్లో ఉన్న భూ వివరాలను ఆన్​లైన్​చేశారు. అప్పుడే భూముల్లో ఎక్కువ తప్పిదాలు దొర్లాయి. ఇప్పటికే ధరణి సాఫ్ట్​వేర్ ​ప్రైవేట్​కంపెనీ చేతుల్లోనే ఉంది. ఇక దాని నిర్వహణ కూడా ప్రైవేట్​లోనే ఉండటం గమనార్హం. అధికారులు వారితోనే వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.