MI vs SRH: కమ్మేసిన సూరీడు.. హైద‌రాబాద్‌కు తప్పని ఓటమి

MI vs SRH: కమ్మేసిన సూరీడు.. హైద‌రాబాద్‌కు తప్పని ఓటమి

పోతూ పోతూ ముంబై జట్టు మరో నలుగురిని తమ వెంట తీసుకెళ్లేలా కనిపిస్తోంది. ఆడిన 12 మ్యాచ్‌ల్లో నాలుగింట విజయం సాధించిన హార్దిక్ సేనకు ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు లేవు. ఈ క్రమంలో ఇతర జట్ల అవకాశాలను దెబ్బతీసేలా ముంబై జట్టు ప్రదర్శన చేస్తోంది. సోమవారం(మే 06) సొంతగడ్డపై స‌న్‌రైజ‌ర్స్‌తో జరిగిన మ్యాచ్ కో హార్దిక్ సేన 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

ఛేదనలో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ముంబైని సూర్యకుమార్ యాదవ్(102 నాటౌట్; 51 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఒంటి చేత్తో విజయతీరాలకు చేర్చాడు.  30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మిస్టర్ 360 ఆ తరువాత మరింత చెలరేగిపోయాడు. భువనేశ్వర్, నటరాజన్ బౌలింగ్‌లో కాస్త ఆచి తూచి ఆడినా.. మార్కో జెన్ సెన్, కమిన్స్‌లను చీల్చి చెండాడాడు. అతన్ని ఆపడం ఏ ఒక్కరి వల్ల కాలేదు. అతనికి తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ(37 నాటౌట్; 32 బంతుల్లో 6ఫోర్లు) చక్కని సహకారం అందించాడు. సూర్య విధ్వంసం ధాటికి ముంబై 17.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. 

కమిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్

అంతకుముందు ముంబై గ‌డ్డపై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్లు తేలిపోయారు. బౌలింగ్‌కు అనుకూలించిన వాంఖ‌డే పిచ్‌పై పరుగులు చేయలేక డ‌గౌట్‌కు క్యూ క‌ట్టారు. టాపార్డర్‌లో ట్రావిస్ హెడ్(48) ఒక్కడే ఫ‌ర్వాలేద‌నిపించ‌గా.. చివర్లో క‌మిన్స్(35 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లా మూడేసి వికెట్లు పడగొట్టగా.. జస్ప్రీత్ బుమ్రా, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.