జగిత్యాల, వెలుగు : ధర్మపురి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురిలో మొత్తం 15 వార్డుల ఉండగా అన్నింట్లోనూ కాంగ్రెస్ క్యాండిడేట్లే విజయం సాధించడంతో మున్సిపల్ పీఠం కాంగ్రెస్ ఖాతాలో పడింది. ఈ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, బీజేపీలు కనీస ప్రభావం చూపించలేకపోయాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రభావం ఏమాత్రం కనిపించకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. మొత్తం వార్డులు, మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడం పట్ల మంత్రి లక్ష్మణ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
కోస్గిలో 16కు 16 వార్డులు..
కోస్గి, వెలుగు : నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలోని మొత్తం వార్డులు కాంగ్రెస్‌కే దక్కాయి. ఈ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా.. అన్నింట్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలో ఉన్న కోస్గి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు ప్రతిపక్షాలు తీవ్ర ప్రయత్నాలే చేశాయి.
అయితే సీఎం సోదరుడు ఎనుముల తిరుపతిరెడ్డిని ఈ మున్సిపాలిటీకి ఇన్‌చార్జిగా నియమించడంతో సమీకరణలు మారిపోయాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుకొని పోలింగ్ ముగిసే వరకు ఎప్పటికప్పుడు వార్డుల వారీగా సమీక్షలు చేస్తూ సలహాలు, సూచనలు ఇవ్వడంతో విజయం ఏకపక్షంగా మారింది. ఒకటి, రెండు స్థానాల్లో బీజేపీ లేదా బీఆర్‌ఎస్ ప్రభావం చూపుతుందని భావించినా.. ఓటర్లు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు.
