నీ ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌కే దిక్కులేదు.. ఫ్యూచర్ సిటీ కడ్తవా?..సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైర్ 

నీ ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌కే దిక్కులేదు.. ఫ్యూచర్ సిటీ కడ్తవా?..సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: ‘రాష్ట్రంలో ఉన్న సిటీకే దిక్కులేదు.. ఇక ఫ్యూచర్ సిటీ ఏం కడతావు? నీకే ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌కే దిక్కులేదు.. నువ్వు ఫ్యూచర్ సిటీ కడ్తవా?’అని సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌‌‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం బీజేపీ స్టేట్‌‌‌‌ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాకుంటే రాజీనామా చేయాలి తప్ప, రైతుల ఉసురు పోసుకోవద్దని సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంపై బురదజల్లడం మానుకోవాలన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో తెలంగాణకు కేంద్రం ఎలాంటి మార్జిన్ విధించలేదని స్పష్టం చేశారు.

రైతుల మీద రాజకీయం చేయడం సరికాదని, ఇసుక సరఫరాకు లేని లారీల కొరత.. ధాన్యం దగ్గరకు వచ్చేసరికి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. ఊరికే గుజరాత్ మోడల్ గురించి మాట్లాడటం కాదని, మోదీ దగ్గర ఒక గంట కూర్చుంటే గవర్నెన్స్ అంటే ఏంటో నేర్పిస్తారని పేర్కొన్నారు. పంజాబ్‌‌‌‌లో బీజేపీ ఎప్పుడూ పాలించలేదని, అక్కడికి వెళ్లి మార్కెట్ యార్డులు ఎలా ఉన్నాయో చూడాలని సూచించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న ప్లాన్ ఏంటో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి ఇప్పటికే నాలుగు పార్టీలు మారారని అర్వింద్ విమర్శించారు. సోనియా గాంధీని తిట్టిన ఇలాంటి వ్యక్తిని సీఎం చేసినందుకు కాంగ్రెస్‌‌‌‌ పార్టీకి సిగ్గుండాలని, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు రేవంత్ ఎప్పుడైనా అనుకూలంగా మాట్లాడారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదని, ప్రజల జాగీరని ఆయన స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ తమకు ఎన్డీయేలో ప్రధాన కూటమి నేత అని, ఆయనకు సొంత అజెండా ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.