విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా ఉద్యోగుల ధర్నా

విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా ఉద్యోగుల ధర్నా

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా విద్యుత్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఈ ధర్నాలో భాగంగా ఉద్యోగులంతా నలుపు దస్తులు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మింట్ కాంపౌండ్ నుండి సోమాజిగూడ విద్యుత్ సౌధ వరకు ర్యాలీగా బయలుదేరిన ఉద్యోగులు... మహాధర్నాను తలపెట్టారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో... ఉద్యోగులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం అనుమతి ఇవ్వడంతో ర్యాలీగా విద్యుత్ సౌధకు ఉద్యోగులు బయలుదేరారు.

హనుమకొండలో...

కేంద్రప్రభుత్వం విద్యుత్ ను ప్రయివేట్ పరం చేస్తున్నారని ఆరోపిస్తూ.. నక్కలగుట్ట విద్యుత్ భవన్ ముందు విద్యుత్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. వెంటనే పార్లమెంట్ లో బిల్లు పెట్టడాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన  విద్యుత్ ఉద్యోగులు... పేదలకు ఆర్థికంగా నష్టం కలిగించేందుకే బిల్లు పెడుతున్నారని ఆరోపించారు.

కరీంనగర్, జగిత్యాలలో...

విద్యుత్ సంస్కరణల బిల్లుకు వ్యతిరేకంగా కరీంనగర్ లోని ఎన్.పి.డి.సి.ఎల్. కార్యాలయంతో పాటు, ఇతర విద్యుత్ శాఖల వద్ద విధులు బహిష్కరించి విద్యుత్ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఇక జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యుత్ ప్రగతి భవన్ ముందు కూడా ఉద్యోగుల ధర్నా చేస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు. కేంద్రం విద్యుత్  సంస్థలను ప్రయివేటీకరించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు నల్ల దుస్తులతో ధర్నాకు హాజరైన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు... విద్యుత్ సంస్కరణల బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు తమకు మద్దతు తెలిపాలని విద్యుత్ ఉద్యోగులు కోరారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..

పాల్వంచ కేటీపీఎస్ కాంప్లెక్స్ లో విధులు బహిష్కరించి విద్యుత్ ఉద్యోగులు మహా ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టనున్న విద్యుత్ సవరణ చట్టం బిల్లును నిలిపివేయాలని కోరుతూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా విద్యుత్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్... లేకపోతే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వానికి, విద్యుత్ ఉద్యోగులు హెచ్చరిక జారీ చేశారు.