మీకు తెలుసా : స్కూల్స్, కాలేజీల్లో బూతులు నిషేధించిన జపాన్.. సంస్కారం నేర్పిస్తున్న టీచర్లు..!

 మీకు తెలుసా : స్కూల్స్, కాలేజీల్లో బూతులు నిషేధించిన జపాన్.. సంస్కారం నేర్పిస్తున్న టీచర్లు..!

స్కూళ్లలో పిల్లలకు ఎదురయ్యే ఇబ్బందుల్లో ఒకటి నిక్ నేమ్. డుంబోడు, బక్కోడు, పొట్టోడు, కర్రోడు, ఎర్రోడు.. ఇలా రకరకాల మారుపేర్లతో పిలుస్తుంటారు. పిల్లల ఆకారాలపైనే కాదు, వాళ్ల వేషభాషలు, వైకల్యాలపై కూడా నిక్ నేమ్ లు ఉంటాయి. మన దగ్గరే కాదు అన్ని దేశాల్లోని బడుల్లోనూ నిక్ నేమ్ ల గోల ఉంది. 

అయితే, ఆటపట్టించడానికో, సరదాకో నిక్ నేమ్‌తో పిలవడం వల్ల కొందరు పిల్లలు మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. దీన్ని గుర్తించి జపాన్‌లోని కొన్ని స్కూళ్లు నిక్ నేమ్‌తో పిలవడాన్ని నిషేధించాయి. దీనికి బదులు ఒకరినొకరు పిలుచుకునేటప్పుడు పేరు చివరలో 'సాన్' అనే పదం వాడాలని చెప్తున్నాయి. 'సాన్' అంటే మన దగ్గర వాడే 'శ్రీ' లేదా 'గారు' లాంటిదన్నమాట. నిజానికి ఈ పద్ధతిని జపాన్ ప్రభుత్వం అధికారికంగా అమలులోకి తీసుకురాలేదు. కానీ, టోక్యోలోని కొన్ని ప్రైవేటు స్కూళ్లు ఈ రూల్ పాటిస్తున్నాయి.

 'చిన్నప్పటి నుంచే ఇతరులను గౌరవంగా పిలుస్తూ మాట్లాడడం పిల్లల్లో మంచి ప్రవర్తనకు సాయం చేస్తుంది' అంటున్నారు కసాయ్ స్కూల్ ప్రిన్సిపాల్ మసాకీ ఉచినో. ఈ రూల్ పెట్టడానికి మరొక కారణం కూడా ఉంది. జపాన్‌లో ఇతరుల్ని పిలిచేటప్పుడు పేరుకు ముందు లేదా వెనక గౌరవ సూచకాన్ని వాడకపోవడం అగౌరవంగా భావిస్తారు. అందుకనే కొన్ని స్కూళ్లలో నిక్ నేమ్‌లపై నిషేధం పెట్టినట్లు అర్థమవుతోంది. 

అయితే, ఈ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. నిక్ నేమ్స్‌లో కొన్ని మంచివి ఉంటాయంటున్నారు కొందరు. పిల్లలు ఒకరితో ఒకరు స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి, అనుబంధం పెంచుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి అంటున్నారు. మరికొందరేమో 'పిల్లలు నిక్ నేమ్‌తో పిలుచుకోవడాన్ని నిషేధించే బదులు వాళ్లు తిట్టుకోవడాన్ని ఆపడం ఎలాగో నేర్పిస్తే బాగుంటుంది' అని చెప్తున్నారు. ఇంకొంతమంది అయితే 'కొందరు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు విచిత్రమైన పేర్లు పెడుతుంటారు. అవి పిల్లలను ఇబ్బంది పెట్టేలాగా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు తమని ఏదైనా మంచి నిక్ నేమ్‌తో పిలవాలని కోరుకుంటారు. ఇప్పుడు ఈ రూల్ పెట్టడం వల్ల ఇలాంటి పిల్లలకు మాత్రం ఇబ్బందే' అంటున్నారు.