మిడ్​డే మీల్స్​ కార్మికులకు అకౌంట్ల కష్టాలు

మిడ్​డే మీల్స్​ కార్మికులకు అకౌంట్ల కష్టాలు
  • కెనరా బ్యాంకుల్లోనే ఖాతాలు తీయాలని స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల ఆదేశం 
  • బ్రాంచులు తక్కువున్న బ్యాంకులో ఎందుకున్న  హెడ్​మాస్టర్ల సంఘం

హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల అనాలోచిత నిర్ణయంతో మధ్యాహ్న భోజన కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వివిధ బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లను పక్కనపెట్టి, కొత్తగా కెనరా బ్యాంకుల్లోనే ఖాతాలు ఓపెన్ చేయాలని అధికారులు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం ఖండించింది. అన్ని జిల్లాల్లోనూ బ్రాంచులు లేని కెనరా బ్యాంక్​లో అకౌంట్లు తీయించాలనే ఆలోచనను విరమించుకోవాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్​ డైరెక్టర్​కు మెయిల్ ద్వారా వినతిపత్రం పంపారు.  రాష్ట్రంలో 14,897 గ్రామాల్లో 26,065 స్కూళ్లున్నాయి. మధ్యాహ్న భోజన కార్మికులకు సర్కారు ఇచ్చే గౌరవవేతనం, వారు పెట్టే ఖర్చుకు ఇప్పటికే వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తీసుకున్నారు. సింగిల్ నోడల్ ఏజెన్సీగా ఏర్పడిన నేషనలైజ్డ్ బ్యాంకుల్లోనే ఖాతాలు తీయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులిచ్చారు. స్టేట్‌‌లో 366 కెనరా బ్యాంకు శాఖలున్నాయని, వాటిలో193 బ్రాంచులు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయని హెడ్మాస్టర్ల సంఘం తెలిపింది. మిగిలిన 173 శాఖలు 30 జిల్లాల్లో ఉన్నాయంది. అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఎస్బీఐ లాంటి నేషనలైజ్డ్ బ్యాంకుల్లోనే ఖాతాలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.