రుణమాఫీ చేసేద్దాం..ఎన్నికల కోడ్ ముగిసేలోపు నిధుల సమీకరణ

రుణమాఫీ చేసేద్దాం..ఎన్నికల కోడ్ ముగిసేలోపు నిధుల సమీకరణ
  • అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్.. అధికారులకు సీఎం రేవంత్​ ఆదేశం
  • మహారాష్ట్ర, రాజస్థాన్​లోని రుణమాఫీపై స్టడీ చేయండి
  • వడ్ల కొనుగోళ్లను స్పీడప్​ చేయాలి.. మిల్లర్ల అక్రమాలను సహించేది లేదు
  • రేషన్​ షాపుల్లో సన్న బియ్యం అందించేందుకు చర్యలు
  • జూన్​ 2 తర్వాత హైదరాబాద్​లోని ప్రభుత్వ భవనాలన్నీ తెలంగాణ ఆధీనంలోకి
  • విభజన చట్టంలోని అంశాలపై రిపోర్ట్​ రెడీ చేయాలని సూచన
  • రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, విభజన చట్టంపై చర్చకు 18న కేబినెట్​ భేటీ

హైదరాబాద్​, వెలుగు : రైతులకు పంద్రాగస్టులోపు రుణమాఫీ చేద్దామని, అందుకు అవసరమైన నిధులను ఎన్నికల కోడ్ ముగిసేలోపు సమీకరించాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో ప్రణాళికలు రూపొందించాలన్నారు. విభజన చట్టం, రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్​ పంటల ప్రణాళికలపై చర్చించేందుకు ఈ నెల 18న రాష్ట్ర కేబినెట్​సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికలు ముగియడంతో బుధవారం సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్​రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

మంత్రులు ఉత్తమ్ కుమార్​రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతులకు పంట రుణాలు మాఫీ చేసి తీరాల్సిందేనని సీఎం అన్నారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. జూన్​ 4 తర్వాత ఎన్నికల కోడ్​ ముగుస్తుందని.. ఆలోపు అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడే నిధులను సర్దుబాటు చేయాలన్నారు.

రైతు రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలన్నారు. 

జూన్​ 2 నుంచి తెలంగాణకే హైదరాబాద్ రాజధాని​

జూన్ 2 నాటికి రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్నందున రెండు రాష్ట్రాల మధ్య విభజన చట్టంలోని పెండింగ్​ అంశాలను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. విభజన చట్టం ప్రకారం పదేండ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇక కేవలం తెలంగాణకే రాజధానిగా మారనుందని చెప్పారు.

ఏపీకి కేటాయించిన లేక్​వ్యూ గెస్ట్ హౌస్​ వంటి భవనాలను జూన్ 2 తర్వాత రాష్ట్ర ఆధీనంలోకి తీసుకోవాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఉద్యోగుల కేటాయింపు మొదలు ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి విభజన చట్టంలోని పెండింగ్ అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని సూచించారు. షెడ్యూల్​ 9, షెడ్యూల్​ 10 లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్తు సంస్థల బకాయిలు ఇంకా తేలలేదు.

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.  తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీల వంటి అంశాలు పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని

 పీటముడి పడిన అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని అధికారులను అప్రమత్తం చేశారు. విభజన చట్టంలోని పెండింగ్​ అంశాలు, ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వాటిపై సమగ్రమైన నివేదికను తయారు చేయాలని  సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. 

వడ్ల కొనుగోళ్లలో ఇబ్బందులు రానీయొద్దు

వడ్ల  కొనుగోళ్లలో వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి, రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కల్లాల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పారు.

తడిసిన వడ్లు, తేమ విషయంలో రైతులకు సమస్యలు లేకుండా చూడాలన్నారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై ఉక్కుపాదం మోపాలని, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం తేల్చి చెప్పారు.